.
Subramanyam Dogiparthi …… పోస్టర్ల నిండా విజయశాంతి . చివరకు పెళ్లి చేసుకునేదేమో నళినిని . విజయశాంతికి అన్యాయం జరిగిందని గొణుక్కుంటూ థియేటర్ లోనుండి వెళ్ళే వారు ఆరోజుల్లో అమాయక ప్రేక్షకులు .
పెళ్లి ఎవర్ని చేసుకున్నా ఇద్దరు హీరోయిన్లతో అందమైన డ్యూయెట్లు ఉన్నాయి . కధలో రొటీన్ పగ , కక్ష తీర్చుకోవడం వంటి అంశాలు ఉన్నా సినిమా ఫోకస్ వర్గ విబేధాలు , యజమాని-కార్మికుల ఘర్షణల మీదే . రొమాంటిక్ ఎరుపు సినిమా అనవచ్చేమో !
Ads
అన్ని సినిమాలలో లేని ఒకటి రెండు ట్విస్టులు కూడా ఉంటాయి . రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్సులో చిరంజీవి నటించిన ఏకైక సినిమాయేమో ఈ సంఘర్షణ ! Subject to correction . గుహనాధన్ కధకుడిగా టైటిల్సులో పేరు వేసినా డైలాగులతో పాటు కధలో కూడా పరుచూరి వారి వాసన , విన్యాసాలు కనిపిస్తూ ఉంటాయి .
దర్శకుడు కె రామమోహనరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా కూడా ఇది . ప్రేమ సాగరం కధానాయకి నళినికి చిరంజీవితో రెండో సినిమా . మంచి పాత్రే లభించింది ఆమెకు . ప్రేమసాగరం సినిమాతో ఈ మళయాళ నటి దక్షిణ భారత సినీరంగంలో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది . సీతయ్య , వీడే సినిమాల్లో లేడీ విలనావతారంలో నటించింది తర్వాత కాలంలో .
చిరంజీవి తర్వాత ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి శివకృష్ణ . ఎప్పటిలాగే ఉపన్యాసాలు ఇచ్చే ఎర్ర పాత్ర . అతడు హత్య చేయబడిన తర్వాత అతని ఎర్ర కాగడాని చిరంజీవి ఎత్తుకుని కార్మిక నాయకుడు అయిపోయి తండ్రి , కాబోయే మామల మీదే యుధ్ధం చేస్తాడు . తర్వాత తెలుస్తుంది తండ్రి తండ్రి కాదని . అదో ట్విస్ట్ సినిమాలో .
మరో ప్రధాన పాత్ర , డ్యూయెట్లు పాడే పాత్ర విజయశాంతిది . చిరంజీవి చిన్ననాటి స్నేహితురాలు . ఊహల్లో చిరంజీవితో డ్యూయెట్లు పాడుకునే పాత్ర . ఇతర ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ , గుమ్మడి , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , ప్రభాకరరెడ్డి , మమత , సూర్యకాంతం , నూతన్ ప్రసాద్ , సారధి , కాకర్ల , ప్రభృతులు నటించారు . రామానాయుడు సినిమా కదా ! తారాగణం కూడా భారీగానే ఉంటుంది .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి . ఆత్రేయ , వేటూరిలు వ్రాసారు పాటల్ని . కట్టు జారిపోతా ఉంది చీరె కట్టు జారిపోతా ఉంది , నిద్దుర పోరా ఓ వయసా , సన్నజాజి పందిరి కింద , చక్కని చుక్కకు స్వాగతం పాటలు , పాటల్లో చిరంజీవి డాన్సులు , అతనితో పాటు ధీటుగా విజయశాంతి , నళినిల నృత్యాలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసాయి .
ఏదో ఓ ఇంటర్వ్యూలో నళిని చెప్పింది . నిద్దుర పోరా ఓ వయసా పాటను తెల్లవారుజామున మూడు గంటలకు షూట్ చేసారట . అంత బిజీగా ఉండేదట ఆవిడ రోజుకు నాలుగయిదు సినిమాలలో నటిస్తూ .
ప్రేమసాగరం ప్రభ . సంబరాలో సంబరాలు అనే గ్రూప్ సాంగ్ కార్మికవాడలో ఉంటుంది . చాలా బాగా చిత్రీకరించబడింది .
1983 చివర్లో డిసెంబర్ 29 న విడుదల అయిన ఈ సంఘర్షణ సినిమా కమర్షియల్ గా కూడా రామానాయుడు , చిరంజీవిల లెవెల్లోనే సక్సెస్ అయింది . సినిమా యూట్యూబులో ఉంది .
చిరంజీవి అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . పాటలన్నీ చాలా బాగుంటాయి . సంగీత ప్రియులు వినవచ్చు . A romantic , action oriented , class war movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article