.
Subramanyam Dogiparthi
….. సంకీర్తన . ఎంత చక్కటి పేరు !? శాస్త్రీయ నృత్యాలలో , పాశ్చాత్య నాట్యాలలోను తర్ఫీదు పొందిన రమ్యకృష్ణకు తన శాస్త్రీయ నాట్య కౌశల్యాన్ని చూపే సినిమాలు ఎక్కువగా రాలేదు . ఫుల్ లెంగ్త్ శాస్త్రీయ నృత్యకారిణి పాత్రను నటించింది ఈ ఒక్క సినిమాలోనే ఏమో ! Subject to correction .
కె విశ్వనాధ్ శిష్యుడు గీతాకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు . దర్శకునిగా అయనకు ఇదే అరంగేట్రం . ఈ సినిమాకు కధ , స్క్రీన్ ప్లేలను కూడా ఆయనే అందించారు . కె విశ్వనాధ్ శైలి ప్రస్ఫుటంగానే కనిపిస్తుంది . ప్రేక్షకులకు కూడా ఈ సంకీర్తన సినిమా చూస్తుంటే సిరిసిరిమువ్వ , సప్తపది వంటి సినిమాలు గుర్తుకొస్తాయి . ఈ సినిమాకు అరంగేట్ర దర్శకునిగా నంది అవార్డుని పొందారు .
Ads
It’s a romantic inter-caste love story . మామూలు కులాంతరం కాదు . ఓ శాస్త్రి గారి అమ్మాయో అబ్బాయో ఓ శెట్టి గారి అమ్మాయినో అబ్బాయినో ప్రేమించటం కాదు . జాలరి కులానికి సంబంధించిన ఓ యువకుడు , భావకవి ఆ ఊళ్ళోనే అందరూ గౌరవించే శాస్త్రి గారమ్మాయిల మధ్య ప్రేమ . ఆర్ధిక , సామాజిక అంతరాలు చాలా ఉన్నాయి .
ఈ అమ్మాయి గుడి మెట్ల మీద వదిలి పెట్టబడిన పసిగుడ్డుని తెచ్చి పెంచుతాడు శాస్త్రి గారు . అదే ఊళ్ళో ఉన్న మరో శాస్త్రీయ నాట్యాచార్యులు గిరీష్ కర్నాడ్ ఆ అమ్మాయి భగవంతుని స్వరూపం అని , ఆమె వచ్చాకే ఆ ఊరి జనం కష్టాలు తొలిగిపోయాయనే నమ్మకాన్ని బాగా నాటుతాడు .అమాయక ప్రజలు ఆ భ్రమలోనే ఉంటారు . ఆ అమ్మాయిని కూడా భగవంతుని స్వరూపంగానే గౌరవిస్తూ ఉంటారు .
వాస్తవానికి హీరోయిన్ ఈ నాట్యాచార్యులి కూతురే . తనకూ ఒక దేవదాసికి జన్మించిన అమ్మాయి . లోకానికి వెరిచి గుడి మెట్ల మీద వదిలించుకుంటాడు . కానీ నాట్యాన్ని మాత్రం పూర్తిగా నేర్పుతాడు . ఒకే ఊళ్ళో ఉండే హీరో భావుకతకు హీరోయిన్ ఫిదా అయిపోయి అతన్ని ప్రోత్సహిస్తుంది , ప్రేమిస్తుంది కూడా .
ఆ ఊరికి సంబంధించిన ఓ ధనవంతుడు శరత్ బాబు . పెయింటర్ , కళారాధకుడు . హీరోయిన్ని ఇష్టపడతాడు . హీరోయిన్ హీరోని ప్రేమిస్తుందని తెలిసాక పక్కకు తప్పుకుంటాడు . హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు . ఓ తక్కువ కులస్తుడయిన జాలరి అమ్మవారి స్వరూపం అయిన హీరోయిన్ని పెళ్లి చేసుకోవటాన్ని జీర్ణించుకోలేరు . చంపేయటానికి బయలుదేరుతారు .
వాళ్ళతో పాటు ఊరి మోతుబరి కొడుకు ముఠా కూడా వీళ్ళని వెంటాడుతారు . ఆ ఊళ్ళోనే ఉండే రాళ్ళపల్లి వీళ్ళకు అండగా నిలబడి ఊరి జనంతో పోరాడుతాడు . ఈలోపు శరత్ బాబు వచ్చి ఊరి జనానికి తలంటు పోసి హీరోహీరోయిన్లను తనతో తీసుకుని వెళ్ళడంతో శుభం కార్డ్ పడుతుంది .
ఈ సినిమాకు గుండెకాయ ఇళయరాజా సంగీతం , శేషు నృత్య దర్శకత్వమే . పాటలను సిరివెన్నెల సీతారామ శాస్త్రి , ఆత్రేయ , సి నారాయణరెడ్డి వ్రాసారు . బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , జానకమ్మ , వాణీజయరాం , శైలజలు చాలా శ్రావ్యంగా పాడారు .
సిరివెన్నెల వ్రాసిన వేవేలా వర్ణాలు ఈ నేలా కావ్యాలు , మనసున మొలిచిన సరిగమలే పాటలలో సాహిత్యం చాలా బాగుంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసిన దేవీ దుర్గా దేవీ అంటూ సాగుతుంది నవరాత్రుల్లో దేవాలయంలో హీరోయిన్ చేసే నృత్యం . చిత్రీకరణ బాగుంటుంది . మరో శ్రావ్యమైన పాట మనసే పాడెనెలే మైమరిచి చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది .
ఏ నావది ఏ తీరమో అనే ఆత్రేయ గారి విషాద గీతాన్ని జేసుదాస్ చాలా శ్రావ్యంగా పాడారు . వై విజయ ఉన్నాక ఆమెకో పాట లేకపోతే ఎలా ! వంద రూపాయల నోటిచ్చేస్తే వచ్చేస్తాను పాటను పెట్టకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో ! కలికి మేనులో పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది .
మొత్తం మీద పాటలు , శాస్త్రీయ నృత్యాలు బాగుంటాయి . మనం మెచ్చుకోవలసిన వారిలో మరొకరు ఛాయాగ్రాహకుడు నివాస్ . గోదావరి అందాలను , దేవాలయాలను , దేవాలయాల్లో నృత్యాలను అద్భుతంగా కేప్చర్ చేసారు .
ఈ సినిమాలో హీరో నాగార్జున పాత్ర చాలా భారమైన పాత్ర . ఈ సినిమా నాటికి కూడా ఇంకా నాగార్జున సెట్ కాలేదనే చెప్పాల్సి ఉంటుంది . ఇతర ప్రధాన పాత్రల్లో గిరీష్ కర్నాడ్ , సాక్షి రంగారావు , జె వి సోమయాజులు , కాకినాడ శ్యామల , డబ్బింగ్ జానకి , శ్యామలరావు , నర్రా , సాయికుమార్ , శివాజీ రాజా , ప్రభృతులు నటించారు .
1987 మార్చి ఆఖర్లో వచ్చిన ఈ సంకీర్తన సినిమా హిందీ , తమిళ భాషల్లోకి డబ్ చేయబడింది . తమిళంలో రీమేక్ కూడా చేయబడింది . కార్తీక్ , రేవతిలు లీడ్ రోల్సులో నటించారు . సంకీర్తన సినిమా యూట్యూబులో ఉంది . సంగీత సాహిత్య శాస్త్రీయ నృత్య అభిమానులకు నచ్చుతుంది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్
Share this Article