నేను ఆ పాటను ముందుగా పాడాను కాబట్టి ఇక నాకే అన్ని హక్కులూ ఉంటయ్, ఇంకెవరైనా మాట్లాడితే మర్యాద దక్కదు, ఆ పాట ఎక్కడైనా సరే నేనే పాడాలి…. అంటూ సాయిపల్లవి సారంగదరియా పాట మీద ఓ జానపద గాయని కొట్లాడింది తెలుసు కదా… దీని మీద కొద్దిరోజులుగా రచ్చ సాగుతూనే ఉంది… ప్రత్యేకించి సుద్దాల అశోక్ తేజ వ్యవహారశైలి మీద కూడా…! నిజానికి ఒక పాట మీద వివాదం ఎందుకులే అనుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల మధ్యేమార్గంగా, మంచితనంతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు… కానీ కొన్ని ప్రశ్నలు అలాగే సజీవంగా ఉంచేశాడు… ఒక జానపద గీతానికి హక్కుదారులెవరు..? ముందుగా టీవీలో ఎవరు పాడితే వాళ్లేనా..? రైట్స్ వచ్చేస్తాయా..? ఇక ఎవరూ పాడకూడదా..? అసలు ఏ పాత జానపద గీతమైనా దాని ఒరిజినల్ రూపంలోనే ఉండిపోదు, ప్రాంతాలు, సంస్కృతులు, కాలానికి అనుగుణంగా మారిపోతూ ఉంటుంది… ఒక తరం నుంచి మరోతరానికి అది అలా సజీవనదిలా ప్రవహిస్తుంది… అందుకే జానపదాలకు హక్కుదార్లు ఎవరు..? ప్రజలే… సమాజమే… ఎవరు పాడితే వాళ్లే…
అసలు సారంగదరియా అంటే ఏమిటి..? ఏజెంటు రైక అంటే ఏమిటి..? వంటి ప్రశ్నల మీద కూడా బోలెడు చర్చలు నడిచాయి… సుద్దాల కూడా యథాతథంగా ఆ పాటను స్వీకరించలేదు… పల్లవి తీసుకుని, మిగతాదంతా సినిమాకు పనికొచ్చేలా తిరగరాసుకున్నాడు… అది వేరే కథ… అనుకోకుండా ఓ మిత్రుడి నుంచి ఓ వాట్సప్ సందేశం… అది ఒక పాత పుస్తకంలోని 129వ పుట… అది పాత జానపదాలను వింటూ, రాసుకుంటూ, అక్షరబద్ధం చేసిన ఎవరో రచయిత శ్రమ, అభిరుచి, ప్రయాస, జిజ్ఞాస… నిజానికి పాపులర్ జానపదాల్ని రికార్డు చేయడం, వాటిని సంరక్షించడం గొప్ప పని… ఆ పేజీ చూడండి ఓసారి…
Ads
రమ్మంటే రాదుర చెలియ, దాని పేరే సారంగదరియ అనే జానపదాన్ని 1952లోనే తను నల్గగొండ జిల్లా, నకిరెకల్లు గ్రామంలో ఫలానా ఫలానా వాళ్లు చెబుతుంటే రాసుకున్నాను అని కూడా రచయిత స్పష్టంగా పేర్కొన్నాడు… సరసమైన జానపదాల్ని విడిగా శృంగార గీతాలు విభాగం కింద వర్గీకరించి, పొందుపరిచినట్టున్నారు… ఈ పుస్తకం పేరేమిటో, రచయిత పేరేమిటో మొదట సరిగ్గా తెలియరాలేదు కానీ… సారంగదరియ 70 ఏళ్ల క్రితమే జనం నోళ్లలో నానిందని చెప్పడానికి ప్రబలమైన ఉదాహరణ… (పుస్తకం పేరు తెలంగాణ పల్లె పాటలు, రచయిత బిరుదరాజు రామరాజు అని మిత్రులు గుర్తుచేస్తున్నారు…) ఇప్పుడు చెప్పండి ఈ సారంగ దరియకు అసలైన హక్కుదారులెవరో… అప్పటి గీతానికీ ఆమధ్య టీవీలో వినిపించిన గీతానికీ పోలికే లేదు… ఉండదు… కాలాన్ని బట్టి గీతాలు మార్పులకు గురవుతాయని చెప్పుకున్నాం కదా ముందే… ఇదీ అంతే… నిష్ఠురంగా ఉన్నా సరే, నిజం ఏమిటీ అంటే… ఇప్పుడు తెలంగాణ పాటలు, తెలంగాణ పాత్రలు, తెలంగాణ యాస కాస్త ట్రెండీ కాబట్టి, కాసులు కురిపిస్తున్నయ్ కాబట్టి అకస్మాత్తుగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలందరికీ తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపిస్తోంది… వినోద దందా కదా, ఈ పాటలు రుచి, ఈ మాటలు రుచి, ఈ పల్లెలు రుచి… అంతకుముందు ఏళ్లకేళ్లు తామే వెక్కిరించి, ఏవగించుకున్న ఆ తెలంగాణతనాన్ని ఇప్పుడు తలమీద పెట్టుకుని ఊరేగుతున్నది ఇండస్ట్రీ… ఇంకేదో కొత్తదనం కనిపించేవరకూ… అంతే… అప్పటివరకూ సారంగదరియా, నర్సపెల్లే, ఆగం చేసిందిరో వంటి పాటలదే రాజ్యం… కానివ్వండి… @sarangadariya, @saipallavi, @lovestory2021
Share this Article