.
సరస్వతి నది… అదెక్కడ ఉంది..? ఇప్పుడు లేదు… ఎక్కడో ఉత్తర భారతంలో ఉండేది గతంలో అని చదువుకున్నాను… ఇప్పుడది అంతర్వాహిని అని కూడా చెబుతుంటారు…
మొన్న ఓ బోర్ తవ్వుతుంటే పెద్ద ఎత్తున ప్రవాహం బయటపడింది… అదే సరస్వతి ఆనవాళ్లు అని చెప్పినవాళ్లూ ఉన్నారు… కాదు, అదొక పూర్వకాలం నాటి సముద్రం ఆనవాళ్లు అన్నవాళ్లూ ఉన్నారు… ఏమో… నిజమేమిటో తెలియదు…
Ads
ఇప్పుడు తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాళేశ్వరం దగ్గర పుష్కరాల్ని నిర్వహిస్తారట… మంత్రి శ్రీధర్ బాబు ప్రయాగరాజ్ తరహాలో స్నాన ఏర్పాట్లు చేయాలని ఆదేశించాడని ఓ వార్త చదివాను… ప్రయాగరాజ్ స్థాయి ఏర్పాట్లు అని చదవగానే నవ్వొచ్చింది… అది కోట్ల మంది స్నానం చేసే మహాకుంభమేళా మాస్టారూ…
కాళేశ్వరం దగ్గర ఉన్నవే కాసిన్ని పుష్కర ఘాట్లు… అవీ గోదావరి పుష్కరాల కోసం కట్టినవి… కానీ ఈ సరస్వతి పుష్కరాలు ఏమిటి..? వందేళ్లుగా చేస్తున్నాం కాబట్టి మేమూ చేస్తాం అంటున్నది సర్కారు… అదేమంటే..? గోదావరి, ప్రాణహిత సంగమం దగ్గరే అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తోంది అట…
గుడ్, ఓ సంప్రదాయాన్ని కొనసాగించడం వరకూ వోకే… కానీ అంతర్వాహినిలో స్నానాలు ఎలా..? ఏమైనా అంటే ధర్మ ద్రోహి అంటారు… లాజిక్కులు వెతకరు… ఎక్కడో ఉత్తరాదిలో అప్పుడెప్పుడో ప్రవహించిన సరస్వతి ప్రాణహిత, గోదావరి వద్ద కలవడం ఏమిటి..? ధర్మసందేహం మాత్రమే సుమా…
పోనీ, ఆ సరస్వతి వేరు, ఈ సరస్వతి వేర్వేరా..? అదీ ఇదీ అంతర్వాహినులే అంటున్నారు మరి… అన్నింటికీ మించి మరో విషయం… ఎక్కడో చదివాను ఇది…
భారతదేశంలో గంగా, యమున, నర్మద, కావేరి, భీమరథి, సరస్వతి, గోదావరి, కృష్ణ, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి 12 జీవనదులు ప్రవహిస్తున్నాయి. వీటినే పుష్కర నదులు అంటారు. ఈ 12 పుష్కర నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒక్కసారి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాలు కూడా రాశులకు అనుగుణంగా వస్తుంటాయి…
వోకే, ప్రాణహిత కూడా కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది అనుకుందాం, రెండూ పుష్కర నదులే… వాటికి పుష్కరాలు వోకే… మరి ఈ సరస్వతి ఎక్కడి నుంచి వచ్చింది..? ఇది ఈ రాశికి అనుగుణం…
జస్ట్, ఇవన్నీ ప్రశ్నలే… అర్థం గాకుండా అడిగేవే… తెలిసిన విజ్ఞులు వివరించగలిగితే సంతోషం… చెప్పాల్సిన పని లేదు… ప్రభుత్వం చెప్పిందంటే అదే అల్టిమేట్ సంప్రదాయం అంటారా..? డబుల్ వోకే… రెట్టింపు సంతోషం..!! మంథని బ్రాహ్మణోత్తముడు శ్రీధర్‌బాబు చెప్పాడంటే ఏదో పౌరాణిక సత్యం ఉండే ఉంటుందేమో… సార్, కాస్త సగటు తెలంగాణవాసికి అర్థమయ్యేట్టు చెప్పవచ్చు కదా..!!
Share this Article