నటి లైలా పదహారు ఏళ్ల తరువాత మళ్లీ రంగు పూసుకుంది… సర్దార్ సినిమా కోసం..! హిందీ నటుడు చుంకీ పాండే తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు… మొన్నమొన్ననే పొన్నియిన్ సెల్వన్ సినిమాతో తమిళంలో బ్రహ్మాండమైన ఫేమ్ సంపాదించిన కార్తికి ఇది మళ్లీ వెంటనే ఓ స్పై థ్రిల్లర్… డబుల్ రోల్… చెప్పుకోదగిన హీరోయిన్లే… రాశిఖన్మా, రాజీష విజయన్… మంచి అభిరుచి కలిగిన దర్శకుడు మిత్రన్ దీనికి దర్శకుడు…
సర్దార్ సినిమా రిలీజుకు ముందు విశేషాలు ఇవే… అవన్నీ తమిళ విశేషాలే… కాకపోతే తమిళంలో వండిన ప్రతి వంటనూ తెలుగులో ఖచ్చితంగా వడ్డిస్తారు కదా, పైగా ఖైదీ సినిమా తరువాత కార్తికి కాస్త ఇమేజ్ అంటూ వచ్చింది కదా… సో, అదుగో తమిళ్, ఇదుగో తెలుగు… అంతే… తమిళ వాసన ఉంటుంది మరి… ఓ పోలీసాయన, పబ్లిసిటీ పిచ్చి, ఎందుకయ్యా అంటే తన తండ్రి మీద ఆల్‌రెడ్డీ దేశద్రోహి అనే ముద్ర ఉంటుంది… ఈ ‘గుడ్ వర్కర్’ ఇమేజీతో దాన్ని తుడిపేసుకోవడానికి ప్రయత్నం… అదీ కార్తి పాత్ర…
నిజానికి సినిమాలో తీసుకున్న పాయింట్ మంచిది… దాన్ని అంతే సీరియస్‌గా చెప్పలేకపోయినట్టు అనిపించింది… సెకండాఫ్‌లో కాసేపు ఫ్లాష్ బ్యాక్, పాటలు టైమ్‌ను తినేశాయి… ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే కథలో, కథనంలో సీరియస్‌నెస్ పెరిగేది… దేశమంతటా ఒకే కంపెనీ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ చేసే ప్రాజెక్టును తీసుకుంటుంది… అదొక స్కామ్… రాబోయే రోజుల్లో నిజంగానే తాగునీటి సమస్య చాలా విషమం కాబోతోంది… ఈ కోణంలో కార్పొరేట్ కంపెనీలు, కుట్రధారులు, విదేశీయులు ఎన్ని కుట్రలకు పాల్పడతారనేది కథ ఆసక్తికరం…
Ads
లైలా సామాజిక ఉద్యమకారిణి… దీని మీద పోరాడుతూ ఉంటుంది… ప్రాణాలే పోగొట్టుకుంటుంది… కొడుకు అనాథ అవుతాడు… ఈ కేసు మీద మన హీరోకు ఇంట్రస్టు కుదురుతుంది… ఈలోపు మన గూఢచార విభాగానికి సంబంధించిన ఓ ఇంపార్టెంట్ ఫైల్ మిస్సవుతుంది… హీరో కూడా వర్క్ చేస్తుంటాడు… అందులో తన తండ్రి తాలూకు ఫ్లాష్ బ్యాకులు కూడా బయటపడతాయి… మిగతా కథంతా సోసో…
పలుచోట్ల సినిమా బోర్ అనిపిస్తుంది… అది ఎడిటింగ్ వైఫల్యమే… హీరోయిన్లు సోసో… తెలుగులోకి అనువదింపబడిన తమిళపాటలు ఎంత అధ్వానంగా ఉంటాయో తెలుసు కదా… ఇక్కడా అంతే… కాకపోతే బీజీఎం బాగుంది… దానికి భాషాదోషాలు, తేడాలు ఉండవు కదా పాపం…
సినిమాకు ప్రాణం కార్తి… తనొక్కడే సినిమాను ఒంటిచేత్తో మోసేశాడు… కానీ మీడియాలో పడేందుకు తన తాపత్రయం, హీరోయిన్‌తో వేసే వేషాలు గట్రా కాస్త ట్రిమ్ చేస్తే కథనంలో వేగం, సీరియస్‌నెస్ వచ్చేవి… కానీ స్థూలంగా కార్తి నిరాశపరచడు…
దీపావళికి రిలీజైన నాలుగు సినిమాల్లో కాస్త ఇదొక్కటే నిలబడే చాన్స్ కనిపిస్తోంది… అఫ్ కోర్స్, డబ్బులున్న ప్రేక్షకులయితేనే… మరీ మీద మీద ఎగబడి, చూడాల్సినంత గొప్పదేమీ కాదు… పైగా ఆ పాటలు ఓ పెద్ద దరిద్రం… చివరగా… అయ్యా, మిత్రన్… నీకు తెలిసిన సమాచారం మొత్తం మా మెదళ్లలో నింపాలని భావించకు… ఓ స్టోరీ లైన్‌కు ఎంత అవసరమో అంతే చెప్పు…!!
Share this Article