ఈ సినిమా మీకు అస్సలు నచ్చదు… ఇందులో హీరో ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ హీరోయిన్ పాదాల దగ్గర పాకుతూ, దేకుతూ, పొర్లిగింతలు పెట్టడు… డిష్యూం అనే సౌండ్ కూడా రాకముందే పది మంది రౌడీలు అర్జెంటుగా అంతరిక్షంలోకి ఎగిరిపోరు… ప్చ్, మీకు హిందీలో వచ్చిన తాజా సినిమా ‘సర్దార్ ఉధం’ నచ్చనేనచ్చదు… వెకిలి పంచ్ డైలాగుల్లేవు, అసహజమైన డ్యూయెట్లు లేవు… అన్నింటికీ మించి డాన్స్ పేరిట కోతిగెంతుల్లేవు… రేకుడబ్బాలో రాళ్లు వేసి మోగించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేదు… దైవస్వరూపుడైన హీరోను కీర్తిస్తూ సాగే ఇంట్రో సాంగ్ లేదు, ఐటమ్ సాంగ్ అసలే లేదు… మరి దీన్ని సినిమా అని ఎలా అంటామంటారా..? నిజమేనేమో… ఇందూరు కల్తీ గుడుంబా అలవాటైనవాడికి జానీవాకర్లు ఏం బాగుంటయ్..? ఇన్నేళ్ల మన భారతీయ సినిమాల్ని చూసీ చూసీ, ఇవే సినిమాలనే భ్రమల్లో ఉన్న మనకు, మరీ ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులకు ఉధం సింగ్ నచ్చకపోవచ్చు… మన హీరోలందరూ పైసావసూల్ అంటూ వెకిలి ముద్రలతో పాటలుపాడే ‘తేడా సింగ్’లే కాబట్టి… ఎంత దరిద్రం అంటే, చరిత్ర చెప్పుకునే రియల్ హీరోల కథల్ని కూడా మన ఫేక్ రీల్ హీరోల చెత్తా ఇమేజీ పేరిట మార్చేసి, అటుపీకి, ఇటుపీకి, పెంట పెంట చేసి, భ్రష్టుపట్టిస్తారు… సైకో ఫ్యాన్స్ ఆనందంతో సైసైరా అటూ ఎగిరి గంతులేస్తూ ఉంటారు… సో, సర్దార్ ఉధం నచ్చడమంటే కష్టమే…
అప్పుడే అస్కార్ అధికారిక ఎంట్రీకి వెళ్లిపోతోంది సినిమా… థియేటర్లలో రిలీజ్ లేనేలేదు, జస్ట్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది… దేశవ్యాప్తంగా క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు… ఈ సినిమాకు ఆ ప్రశంసలు పొందే అర్హత ఉంది… ఎందుకో తెలియాలంటే సినిమా చూడాలి… ఏకబిగిన కాదు… అవసరమైతే కాస్త వెనక్కీ ముందుకూ వెళ్తూ, ఆగుతూ… ఎలాగూ ఓటీటీయే కదా… అసలు ఏముంది ఇందులో..? అందరికీ తెలిసిన కథే… అప్పట్లో 1919లో జలియన్‌వాలా బాగ్‌లో వందలాది మందిని కాల్చిచంపించిన క్రూరుడు డయ్యర్… ఓ భారతీయ విప్లవకారుడు అప్పటి గవర్నర్ డ్వేయర్ పై తీర్చుకున్న ప్రతీకారం… ఇరవై ఏళ్ల తరువాత ఉధం సింగ్ లండన్ వెళ్లి మరీ తనను కాల్చిచంపుతాడు… చాలామందికి తెలిసిన కథే… భగత్‌సింగ్ సమకాలికుడైన ఉధం సింగ్ జీవితకథను ఈ సినిమా కథగా ఎంచుకోవడం ముందుగా అభినందనీయం… విముక్తి పోరాటంలో గాంధీలు, నెహ్రూలు మాత్రమే కాదు… ఇలాంటి ఉధం సింగ్లెందరో ఉన్నారని జాతి ఓసారి గుర్తుతెచ్చుకోవడానికి ఇది ఉపయోగపడాలి…
Ads
నిజంగా మనం అంతర్జాతీయ ప్రమాణాల్లో సినిమా తీయలేమా..? చాలామంది సినిమా ప్రేమికులను వేధించే ప్రశ్నే ఇది… దీనికి సమాధానం చెప్పింది దర్శకుడు శుజిత్ సర్కర్… ఓసారి జాతీయ అవార్డు గ్రహీత, తనకు ఈ ఉధం సింగ్ సినిమా 21 ఏళ్లుగా డ్రీమ్ ప్రాజెక్టు అన్నాడు… ఆ తపనను సంపూర్ణంగా ఆవిష్కరించాడు… విక్కీ కౌశల్ తనూ జాతీయ అవార్డు గ్రహీత, సింపుల్‌గా ఈ పాత్రలో ఒదిగిపోయాడు… ప్రత్యేకించి సినిమాలో ఏం చెప్పుకోవచ్చునంటే… 1920, 1930 నాటి రోజుల్ని మనకళ్ల ముందు ఉంచడం… చిన్న విషయమేమీ కాదు… మనల్ని నిజంగానే దర్శకుడు ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోతాడు… ప్రతి చిన్న విషయం దగ్గర ఎంత కీన్గా ఉన్నదంటే ఈ సినిమా టీం… పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్… అప్పటి లండన్, అప్పటి పంజాబ్… అప్పటి డ్రెస్సులు, వీథులు, కార్లు, బస్సులు… స్కాట్లండ్ యార్డ్ పోలీసుల దర్యాప్తు వాతావరణం, ఫోన్లు, లైట్లు, ఫైళ్లు… ప్రెస్మీట్లో విలేకరులు వాడిన కెమెరాలు, మైకులు, ఫర్నీచర్, టెలిఫోన్ డైరెక్టరీ, అప్పటి మెసేజుల తీరు… వాట్ నాట్… ప్రతి చిన్న అంశంలోనూ జాగ్రత్త తీసుకున్నారు… (మొన్నీమధ్య తెలుగు దిగ్దర్శకుడి పర్యవేక్షణలో ఓ చెత్తా సినిమా వచ్చింది… అందులో అరవయ్యేళ్ల నాటి ఓ ఫ్లాష్ బ్యాక్, అదీ కాసేపే… అందులో మోడరన్ యాడ్స్… అదీ మన నేలబారు దర్శకత్వం, పర్యవేక్షణ…)
జలియన్‌వాలా బాగ్ సంఘటనకూ, ఈ ప్రతీకారానికీ నడుమ ఇరవై ఏళ్ల కాలం… డయ్యర్‌ను చంపేశాక అక్కడే పట్టుబడిన ఉధం మీద విచారణ తీరు ఈ సినిమా కథ… ఉధం సింగ్ వంటి నిజమైన దేశభక్తుల కథల్ని నిజాయితీగా తెరకెక్కించడం అనే ఆలోచనే ఎంత బాగుంది..?! 1940లో తనను ఉరితీస్తే, తన భౌతిక అవశేషాల్ని దేశానికి తీసుకురావడానికి మన దేశానికి 34 ఏళ్లు పట్టింది… ఇవన్నీ జాతికి తెలియాలి, తెలియాలంటే ప్రొఫెషనల్ నైపుణ్యం, క్రియేటివిటీతో, కథకు వక్రబాష్యాలు చెప్పని నిజాయితీతో కూడిన ప్రయత్నం అవసరం… అదే ఈ సర్దార్ ఉధం… రెండుగంటల నలభై నిమిషాల సినిమా అంటే ప్రజెంట్ స్టాండర్డ్స్ ప్రకారం ఎక్కువ స్క్రీన్ టైమే… ఐతే ఓటీటీయే కాబట్టి, మధ్యలో విరామం తీసుకుంటూ చూడొచ్చు… చూడాలి… ఎందుకంటే, మన భారతీయ సినిమా ఉన్నతీకరించబడుతోంది… అది చూడకపోతే ఎలా..?!
Share this Article