అక్షయకుమార్… అలా అలా అలవోకగా సినిమాలు చేసేస్తాడు… నెలకొక సినిమా రిలీజు అన్నట్టుగా ఉంటుంది ఆయన సినిమాల సంఖ్య… భిన్నమైన పాత్రలు… వైవిధ్యమైన కథలు… ఒక్కొక్క పెద్ద హీరో ఒక్కో సినిమాకు ఏడాది, రెండేళ్లు తీసుకునే వాతావరణంలో తను వేగంగా పూర్తి చేసే తీరు ఖచ్చితంగా చెప్పుకోదగిందే…
ఫ్లాపా, హిట్టా… జానేదేవ్… ఓ యంత్రంలా గిరగిరా తిరుగుతూనే ఉంటాడు పనిలో… ఐతే కొన్నిసార్లు ఈ తొందరలో, ఈ వేగంలో పొరపాట్లు కూడా చేస్తుంటాడు… సర్ఫిరా సినిమా దానికి ఓ పెద్ద ఉదాహరణ… నిజానికి ఈ సినిమా ఒకటి రిలీజైందనే చాలామందికి తెలియదు… అంత అనామకంగా వచ్చింది… రిలీజు టైమ్‌కు అడ్వాన్స్ బుకింగుల రూపంలో వచ్చిన కలెక్షన్ 30 లక్షలు మాత్రమే అని వార్తలొచ్చాయి… ఒకరకంగా అక్షయకుమార్‌కు ఘోర అవమానమే ఇది…
కలెక్షన్ల వివరాలు పరిశీలిస్తే మొదటిరోజు వసూళ్లు జస్ట్, 2.4 కోట్లు… వోకే, ఈ స్థాయి పరాజయాలు పొందిన చాలా హిందీ సినిమాలు ఉన్నాయి గానీ అక్షయకుమార్ రేంజుకు ఇది మరీ పరాభవం రేంజు వసూళ్లే… నిజానికి ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందేమో తను… ఈ సినిమా నిర్మాతల్లో సూర్య కూడా ఉన్నాడు… ఓ అతిథి పాత్రలో కనిపిస్తాడు కూడా…
Ads
తమిళంలో సూర్య హీరోగా, అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా చేసిన సూరారై పొట్రు సినిమా గుర్తుంది కదా… ఓటీటీలో రిలీజైంది కరోనా పీరియడ్‌లో… హిట్… తెలుగులో కూడా ఆకాశం నీ హద్దురా పేరిట డబ్బయింది… సుధా కొంగర దర్శకత్వం… సగటు మనిషికి కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలని తపించిన ఓ ఎయిర్‌లైన్స్ సాహసి గోపీనాథ్ బయోపిక్ అది…
చాలామంది ఓటీటీలో ఆ సినిమా చూసేశారు… మళ్లీ ఆమె దర్శకత్వంలోనే హిందీలో రీమేక్ చేశారిప్పుడు సర్ఫిరా పేరిట… ఆల్రెడీ లక్షల మంది చూసిన కథ మీద, ఆల్రెడీ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉన్నప్పుడు ఇక కొత్తగా ఆ కథ మీద థ్రిల్ ఏముంటుంది..? పైగా హిందీ రీమేక్ రిలీజు సమయంలోనే, సూరారై పొట్రు హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలిఫిలిమ్స్ సంస్థ ఉడాన్ పేరిట హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను యూట్యూబులో పెట్టింది…
నిజానికి చాన్నాళ్లుగా అక్షయకుమార్‌కు హిట్లు లేవు… చేస్తూ పోతున్నాడు తప్ప సరైన విజయం దక్కక చాన్నాళ్లయింది… వరుస ఫ్లాపులకు మరిన్ని ఫ్లాపులను యాడ్ చేయడం తప్ప కాస్త నిదానంగా ఆలోచించి అడుగులు వేయడం లేదు… ఇదిలాగే కొనసాగితే అక్షయకుమార్ కెరీరే ప్రశ్నార్థకం అయ్యేలా ఉంది… ఐనాసరే తను సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు…
ఒక దశలో నేను వరుసగా 17 సినిమాల షూటింగులకు వెళ్లేవాడిని, 8 నెలలో రిలీజయ్యాయి అవి… నిర్మాతలు నాతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపించేవారు… టైమ్‌కు సినిమా రిలీజయిపోతుందని వాళ్లకు ఓ నమ్మకం… కానీ కొందరు నా సినిమాలు ఫ్లాప్ అవుతుంటే సంతోషిస్తున్నారు, 30 ఏళ్లు దాటింది నేను ఇండస్ట్రీకి వచ్చి, బురద జల్లుకోవడం ఎక్కువైంది ఇప్పుడు అని ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అక్షయకుమార్…
ఇన్ని ఫ్లాపులు, పరాజయాల్లో సైతం ఇప్పుడు తన చేతిలో ఇంకా తొమ్మిది సినిమాలున్నయ్… కానీ అసలే సౌత్ ఇండియన్ సినిమాల ధాటికి బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది… అప్పుడప్పుడూ ఒకటీ అరా తప్ప మిగతా సినిమాలన్నీ ఢామ్మంటున్నాయి… కల్కి వంటి పాన్ ఇండియా సినిమాలు హిందీ మార్కెట్‌ను కొల్లగొడుతున్నాయి… ఈ స్థితిలో హిందీ ఇండస్ట్రీ కూడా దిద్దుబాటు కసరత్తు ఏదో ఆలోచించుకోవాల్సిందే..!!
Share this Article