సాధారణంగా విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే… తనతో పోరాటం ఎంత బలంగా ఉంటే… హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది… విలన్ అల్లాటప్పా పప్పుగాడు అయితే హీరో పాత్ర కూడా రక్తికట్టదు… ప్రేక్షకుడు కనెక్ట్ కాడు… అందుకని వీలైనంతవరకూ విలనీని కూడా ప్రభావవంతంగా ఫోకస్ చేస్తూ, అదే రేంజులో హీరో పాత్రను పైకి లేపే ప్రయత్నం చేస్తారు దర్శకులు…
ఐతే, విలన్ పాత్ర హీరో పాత్రను డామినేట్ చేసేలా ఉండకూడదు, ఉంటే హీరోలు అంగీకరించరు… అసలే సౌత్ ఇండియన్ హీరోలు అస్సలు అంగీకరించరు… ఇక్కడ హీరో నానిని అభినందించొచ్చు… ఈరోజు రిలీజైన ‘సరిపోదా శనివారం’ సినిమాలో విలన్‌గా చేసిన ఎస్‌జే సూర్య కొన్నిచోట్ల నానిని డామినేట్ చేశాడు… ఐనా సరే, నాని ఎక్కడా ఈ ధోరణిని అభ్యంతరపెట్టలేదు, అంగీకరించాడు… ఆ కోణంలో నానిని మెచ్చుకోవచ్చు… తోటి నటుడు తనను డామినేట్ చేస్తున్నా సరే, యాక్సెప్ట్ చేశాడు… అలాగని విలన్ పాత్రను డైల్యూట్ చేయాలని, సూర్య రెచ్చిపోకుండా చూడాలని దర్శకుడి మీద ఒత్తిడి తీసుకురాలేదు… నయం…
ఐతే నాని ఏదో తక్కువ చేశాడని కాదు… సినిమా కాస్త చూడబుల్ అని ఏమాత్రం పాజిటివ్‌గా చెప్పాలనుకున్నా… నాని, సూర్యలే కారణం… జేక్స్ బెజోయ్ బీజీఎం మరో కారణం… అఫ్‌కోర్స్, అవసరం లేని సీన్లలో కూడా బీజీఎం లౌడ్, లౌడర్… బహుశా దడదడా కొట్టుకుంటూ పోయాడే తప్ప, ఆ సీన్లను సరిగ్గా అర్థం చేసుకుని, సరిపడా బీజీఎం, అంటే ఆప్ట్ బీజీఎం ఆలోచించలేదేమో…
Ads
దర్శకుడు వివేక్ ఆత్రేయ గతంలో నానికి ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేశాడు… బహుశా ఆ సినిమా నానికి కూడా అర్థమైందో లేదో… చాలామందికి అదొక సినిమా వచ్చినట్టే గుర్తులేదు… ఆ టైటిల్‌లాగే ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అనే నాన్-రొటీన్ టైటిల్ పెట్టాడు… గతంలో మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘శనివారం నాది’ నవలను స్పూర్తిగా తీసుకున్నారేమో, కథ కూడా అదేనేమో అనే వార్తలు వచ్చాయి అప్పట్లో… టైటిల్‌కు తగినట్టు… హీరో తన కోపాన్ని మిగతా రోజుల్లో కంట్రోల్ చేసుకుంటూ శనివారం మాత్రం రెచ్చిపోతాడు… ఇదే నావెల్ పాయింట్ అనుకున్నాడేమో దర్శకుడు అండ్ హీరో…
క్రూరుడైన విలన్ పాత్రలో సూర్య ఇరగదీయగా… నానికి మరీ ఈ మాస్ యాక్షన్ కేరక్టరైజేషన్ పెద్దగా నప్పినట్టు అనిపించదు… చేయలేడని కాదు, చేయగలడు… కానీ ఆ పాత్రను ఎలివేట్ చేసే స్థాయిలో సీన్లు, ఎమోషన్ ఫ్యాక్టర్స్, డ్రామా లేవు… సరిపోదా శనివారం సినిమా జస్ట్, సరిపోయినట్టుగా ఉంది కానీ, పూర్తిగా సరిపోలేదు అనిపించేలా..!
సోకులపాలెం ఊరికి మద్దతుగా హీరో… వాళ్ల పాలిట క్రూరమైన విలన్‌గా సూర్య… ఇద్దరి నడుమ కొన్ని సీన్లు వోకే… లవ్ ప్లాట్ పెద్దగా ఆసక్తికరం కాదు… హీరోయిన్ ప్రియాంకకు నటించడానికి, చేయడానికి పెద్ద పనేమీ లేదు సినిమాలో… నామ్‌కేవాస్తే రోల్… అన్నింటికీ మించి సినిమా లెంత్ కూడా నెగెటివ్ ఈ సినిమాకు… ఇంత నిడివిని సమర్థించే, జస్టిఫై చేసేంత దమ్ము దర్శకుడి ప్రజెంటేషన్‌లో కొరవడింది… అందుకని లెంత్ కూడా ప్రేక్షకుడిని నిరాశపరిచేదే…
నిజానికి కల్కి, మహారాజ తరువాత ఇప్పటికీ ఓ బలమైన సినిమా పడలేదు థియేటర్లలో… ఆహా ఓహో అని చెప్పబడిన మిస్టర్ బచ్చన్ మటాష్… ఇక డబుల్ ఇస్మార్ట్ అయితే డబుల్ నిరాశాజనకం… మంచి స్పేస్ ఉంది ప్రస్తుతం… ఈ నాని సినిమాకు ఇదే ప్లస్ పాయింట్ అయి ఉండాల్సింది… కానీ ప్చ్… సరిపోలేదు..!! (యూఎస్ ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ ఆధారం…)
Share this Article