Bharadwaja Rangavajhala………. కమల్ హసన్, హలం జంటగా బాలచందర్ తీసిన మన్మధలీల సినిమా విడుదలై విజయవంతంగా నడుస్తున్న రోజులవి. ఆ సినిమాకు సెన్సార్ వారు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. చెన్నైలో ఆ సినిమా ఆడుతున్న థియేటర్ బుక్కింగు ముందుకు ఓ పద్నాలుగు పదిహేనేళ్ల అమ్మాయి వచ్చి టిక్కెట్టు అడిగింది. బుకింగు క్లర్లు నో చెప్పాడు.
కారణం అడిగిందా అమ్మాయి. ఇది ఏ సర్టిఫికెట్ మూవీ కనుక పిల్లలకు టిక్కెట్లు ఇవ్వం అని తెగేసి చెప్పాడాయన. ఆ అమ్మాయికి పిచ్చకోపం వచ్చింది. ఎలాగైనా ఆ బుకింగ్ క్లర్క్ మీద పగ తీర్చుకోవాలనుకుంది. అదే బాలచందర్ దర్శకత్వంలో తప్పుతాళంగళ్ సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రత్యేక ఆహ్వానం మీద అదే ధియేటర్ కు వచ్చింది. ఆ బుకింగ్ క్లర్క్ ను గుర్తుపెట్టుకుని పిలిచి …
ఏమండీ నేనీ సినిమా చూడొచ్చా … ఇప్పుడు నా వయసు పద్దెనిమిదే …అందట… నవ్వుతూ…… ఏమిటి నన్నే అడుగుతున్నారు అని అడిగాడట ఇబ్బందిగా ఆ బుక్కింగ్ క్లర్లు … అప్పుడు మన్మధలీల సంఘటన గుర్తు చేసిందట సరిత … అమ్మా నువ్వేదో పగసాధించానని అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదుగానీ … ఫలానా సన్నివేశాలు చూసి పిల్లల మనసులు పాడైపోతాయని కదా సెన్సార్ వారు ఎ సర్టిఫికెట్ ఇచ్చేది … నా విధి నేను చేశాను … ఇది కూడా నువ్వు చూడదగ్గ సినిమా కాదనే నా అభిప్రాయం. అయినా నువ్వు హీరోయిన్ వి కాబట్టి నేనేం చేయగలను? అని సమాధానం చెప్పాట్ట ఆయన.
Ads
ఎర్లీ ఎయిటీస్ లో సరిత హీరోయిన్ గా నటించిన ఓ సినిమా విడుదల సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ సంఘటన చెప్పారావిడ. సకుటుంబ చిత్రమే తీసినా అందునా టీనేజ్ వారిని అట్రాక్ట్ చేయడానికి కొన్ని సన్నివేశాలు జొప్పించడం జరుగుతోందని, కథకు సంబంధం లేకుండా చేసే ఇలాంటి పనుల వల్ల సినిమాలాడతాయనే మూఢ నమ్మకం ఉన్నన్నాళ్లూ ఎవరూ చేయగలిగిందేమీ లేదని అంటూ …
అలాంటి సినిమాల్లో చేసినప్పుడల్లా తనకు ఆ బుక్కింగ్ క్లర్కు గుర్తొస్తూంటాడని చెప్పింది. ఆ వేదిక మీదే ఉన్న మా విజయబాపినీడు మీద సెటైర్ వేసిందా ఈవిడ అనే అనుమానం ఇప్పటికీ నన్ను వీడలేదు… (ఈమె అసలు పేరు అభిలాష, గుంటూరు జిల్లా మునిపల్లెలో పుట్టి పెరిగింది… 1988లో మలయాళ నటుడు ముఖేష్‌ను పెళ్లిచేసుకుంది, ఇద్దరు పిల్లలు… 2007 నుంచి విడిపోయారు… ఫ్యామిలీ కోర్టులో విడాకుల వ్యాజ్యం సుదీర్ఘంగా సాగింది… కొడుకు శ్రావణ్ కూడా నటుడే…)
Share this Article