సర్వపిండి సనాతనం
~~~~~~~~~~~~~~~
చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం.
Ads
ఉల్లి కొత్తిమీర గుమగములతో ఊరిస్తది.
ఎక్కువ గట్టిపడిపోదు. చలిగదా, తాపం తక్కువ.
చెడగొట్టు ముసుర్లకు చెవ్వోముక్కో అన్నట్టుగుంటంది గద,
కారకారంగ రామతులసి ఆకులు వేసిపెట్టిన సర్వపిండి ఇది.
నీడకుబతికే వాళ్లం, ఒక్కటితింటే ఒకపూట గాసం సమాప్తం.
~•~•~•~•~
అనుభవసారం ప్రకారం సర్వపిండిలో ప్రాంతీయత మెండు.
పుట్టిన ఊర్లర్ల జిలుకరెల్లిపాయేసి,ఇంత పెసరుపప్పు చల్లేటోళ్లు.
నేను పెరిగిన ఊర్ల పల్లీలు నువ్వులు దండిగనే పోసేకునే వాళ్లు.
ఏ ఊరిపంట ఆవూరితిండికి మూలం అన్నది గమనిస్తే తెలుస్తది.
పుట్టినవూర్ల పల్లికాయ పండది. పెరిగిన ఊరు పల్లిపంట పెన్నిధి.
వెనుకట పెద్దవి మందపువి చేసిన కూరగంజులు ఉంటుండే గద,
మామూలుగ సర్వపిండి అవ్వీట్లల్లనే పెడుదురు. ఒక్క అడుగుకు
మాత్రమేనా, చుట్టూరుగ పైదాక అంచులకూ పల్చగ పెట్టుకద్దురు.
ఇల్లన్నకాడ ఇరువైమందికి గావాలె. వచ్చిపొయ్యెటొళ్లకూ పెట్టాలె.
పిల్లలకు పక్కలది అసలేవద్దు. చమరు ఇనికిన అడుగుదే కావాలె.
ముసలోళ్లకు అడుగుదైతెనే మెత్తగ ఉంటది, ఆ ఓటూ అటుదిక్కే.
వచ్చిపొయ్యెటోళ్లకు కాలికాలంది పెడితే, ఏమనుకుంటరు ఏంకథ.
ఇంటాయన వీరాధివీరుడు,నచ్చకపోతె ఒంటికాలు మీదనే లేస్తడు.
చాకలామెకిస్తె ఊకుంటదా, పదిండ్లకు పచ్చకర్పూరం చేసుకవస్తది.
అయ్యకు పుట్టిన అందరూ పరమభాగవతులైతే ఆఖరుది ఎవరికి,
ఇంకెవరికి, అందరికి పెట్టంగ, అందురు తినంగ,మిగిలింది అమ్మకు.
ఎడ్డికాలమో ఎల్లువాటం లేనికాలమో ఆకాలమట్ల గడిచిపోయింది.
రోజులు మారిపాయె, లింగిలింగడని సంసారం సన్నగ పాచిపాయె.
దాచిన మొగడా వేరుపడుదాం అని, సాటుకుతినుడు మొదలాయె.
సిరిగలిగి పావెడుకాడ రెండుపావుల నూనెవోసుడు పెద్దరికమాయె.
ఉల్లిపాయ ఎక్కువతక్కువ కోసివేసే అలవాటూ కొత్తగనే వచ్చిచేరే.
ఎనుబైలకు, తొంబైలకు, రెండువేలకు కాలక్రమంగ ఎంతటిమార్పు.
రెండువేల తర్వాత, సర్వపిండి రోడ్డుమీద దొరికే తిండిగ మారింది.
ఈ రోజులల్ల సర్వపిండంటే మాటలా, రోజూ వేలకువేలు అమ్ముడే.
పంటగంజి పాసుపాసు కైకిలిగంజి కమ్మకమ్మగని శాత్రం చెప్పినట్టు
కొనుక్కతింటెనే ఇంటింటిరాజులకు, తిన్నమన్న తృప్తి దొరుకుతది.
వంగలేక మంగళారమని చేసుడూతినుడూ పూర్తిగనే మోటైపోయే.
ఇగజాలు తియ్యిండ్రి, మనదిగాని ముచ్చట ఎవలకు చేదుంటది ?
పొంటెసేపు చెప్పుకున్నా మొకంగొట్టంది ఏదంటే మందిముచ్చటనే.
పొనుసులు వినెటోళ్లకు తిండికంటే ముచ్చటతోనె ఆకలి తీరుద్దట.
రెక్కలే ఉండివుంటెనా, నా సర్వపిండి ఎక్కడికో ఎగిరిపోతుండేగద,
నాకు పోటువదీసేటప్పుడే, అది సీతకోకచిలుకోలె కండ్లవడ్డది మరి !
ఇది… మన తిండి – మన సామాజిక చరిత్ర… ~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article