సాక్షి Yaseen Shaikh ది మంచి వెటకారం, వ్యంగ్యం, శ్లేష దట్టించిన కలం… మొదలుపెడితే చాలు, అలా నవ్విస్తూ సాగిపోతుంది… కానీ చాన్నాళ్లయింది తనను చూసి… చదివి… మళ్లీ ఎఫ్‌బీలో కనిపించింది తాజాగా… షేర్ చేయకుండా ఉండలేం… మీరూ ఎంజాయ్ చేయండి… ఎఫ్‌బ రైటింగ్సులో తోపులం అనుకునేవాళ్లు ఖచ్చితంగా చదవాలి సుమా…
సినీమృగాయణం! ‘ఓసోసీ పిల్ల ఖోడి ఫ్ఫెఠ్ఠా’ పాట దూరంగా వినిపిస్తుండగా పరవశించింది కోడి. ‘‘నా జాతిజనులు పాడుకునే జాగృతీ గీతంగా ఈ పాట ఎప్పటికీ నిలచిపోవాల’’ని అంది. అంతలోనే పావురాయి పిట్ట ఎంట్రీ…. ‘‘మీ గీతం ఎలా అవుతుంది?… ఆ వెంటనే ‘నా ఒయ్యారీ పావుర్హాయి ఫ్ఫిఠ్ఠా’ అనే మాట వినిపించలేదా… అయితేగియితే మన యుగళగీతమవ్వాల’’ నిలదీసింది పావురం.
‘‘ఎక్కడో ఓచోట ఎప్పుడో ఓమాటొస్తే సరిపోద్దా? ‘కోడి ఒకా కోనలో’ బ్లాకండ్ వైట్ నుంచీ… మొన్నటి సిరంజీవి సిన్మా ‘‘బంగారు ఖోడి పెఠ్ఠ’ వరకు అన్నీ మావి బ్లాక్‌బస్టర్లే’’ ఉక్రోశపడింది కోడి.
Ads
‘‘పిచ్చిదానా… కుహూ కుహూ కోయిలమ్మ కోనంతా సందడీ’’ వల్లనే కదా ‘అడవిరాముడు’ సిల్వర్‌జూబ్లీ! అసల్నీకు తెల్సా… మా రంగు నుంచే కదా బ్లాక్‌బస్టర్ అనే మాట పుట్టింది’’ అంటూ కోడికీ, పావురానికీ డబుల్‌కిక్కిచ్చింది కోయిల. ‘‘అన్నట్టు మేమ్మీలాగా మ..మ్మ.. మాస్ కాదు… ‘కోకిలా… ఓ ఓ కోకిలా’ లాంటి క్లాస్’’ అంది.
‘‘నోర్ముయ్… కనడం చేతనై పెంచడం చాతకాని వాళ్లు కూడా మాకు చెప్పేవారే. ‘బంఘారూ బాతు ఘుఢ్ఢు… బందారు థొఖ్ఖుడు లఢ్ఢూ… యమటేస్టీ ఫుడ్డూ’ అంటూ పాడబట్టే కదా ‘వేటగాడు’ హిట్టయ్యిందం’’టూ అరకొర రెక్కల్ని కాలర్లలా ఎగరేసింది బాతు.
‘‘మేం మాత్రం తక్కువా… టైటిల్లో ‘సీతాకోకచిలుక’ ఉన్నా… ‘పాడింది పాడింది పట్నాల కాకి’’ పాటతోనే కదా పిచ్చరు హిఠ్ఠు. మాదీ బ్లాక్‌బస్టరు కలరేనమ్మా’’ కోకిలకూ… పక్షులన్నింటికీ కలిపి ఒకే పంచ్ డైలాగొదిలింది కాకి.
సరసరా పాక్కుంటూ వచ్చింది పాము. ఎందుకైనా మంచిదని పిట్టలన్నీ దూరం జరిగాయి. ‘‘మీరంతా నోర్లు మూస్తే మంచిది. మా బుస సిన్మాకు పస. హీరోల్లో కోడెనాగూ, పున్నమినాగూ, హీరోయిన్లలో నగీనా శ్రీదేవీ, మల్లికా శెరావత్ హిస్సూ లేకపోతే మూవీ బుస్సే. సిన్మాలో చీలిన నాలుక ఉందంటే… కూకట్‌పల్లి ‘వై’ జంక్షన్‌లో మాల్ ఉన్నంత భరోసా. మీరొక్కసారి చెబితే… నేన్ రెండుసార్లు చెప్పినట్టే’’అంటూ రెండు నాల్కల్తో వెక్కిరిస్తూ వెటకరిస్తూ సెటైరేసింది నాగుపాము.
‘‘మీరొల్లకండోస్… అడవిరాముడు గురించి అందరూ పెద్ద మాట్లాడొచ్చారు. అనాదిగా, అనూచానంగా, ఆనవాయితీగా ఆ No suggestions నుంచి రాజేంద్ర–గజేంద్ర వరకు తొండంతో తొక్కి పీకితే… బాక్సాఫీసు బద్ధలే… బదాబదలే’’ తానూ పంచ్ వేసింది ఏనుగు.
‘‘ఓహోహొ… నీ ఒక్కదానికే ఒళ్లున్నట్టు మిడిసిపడకు. నీదొబెసిటీ ఒళ్లు…. కానీ నాది కట్స్‌తిరిగిన గొడ్డుప్యాకు. నీకో విషయం తెల్సా. బాహుబలిలో రానా విలన్ కదా. మరి విలన్ ఎవరితో ఫైట్ చేస్తాడూ… హీరోతోనే కదా. మరి ఆ లెక్కన హీరో నేనే. అందుకే బాహుబలి హిట్టు. నేనే లేకపోతే ఫిలిమ్ ఫట్టు’ అంది దున్నపోతు.
‘‘అందరూ కాస్త మూస్తారా?… ‘గుర్రం ఎగారావచ్చు… అని సామెత. కానీ కటౌటంతెత్తు ఎదిగేదే నేను. హార్సుపవరుతో హిట్టు కొట్టేదే మనం. మగధీర ఎవరనుకున్నారు? రామ్‌చరణా? రాజమౌళా? కాదు నేనే. కేఎస్సార్ దాసుల్నుంచి కే. రాఘవేందర్రావుల ‘వర్క్’ఐనా, విజయా వాహినీలు మొదల్కొని విజయేంద్రప్రసాదులైనా క్లైమాక్స్ ఫైటుల్లో నా కాళ్లిరగొట్టేవాళ్లు. నేన్ సకిలిస్తేనే నిర్మాత ఇకిలించేది’’ పవ్వర్ఫుల్ డైలాగ్ను ఒన్ టేక్‌లో వదిలింది గుర్రం.
‘‘గట్స్ లేనోళ్లు గ్యాపిస్తారు. గట్స్ ఉన్నోళ్లు గర్జిస్తారు. అప్పటి బొబ్బిలి పులి గానీ… ఇప్పటి కొమరం పులి గానీ నేన్లేందే సినిమాల్లేవ్. నా నేమ్ ముందు ‘యంగ్’ పెట్టుకుని, తన నేమ్ ప్లేట్లు రాసుకుంటారు హీరోలు. జస్ట్… నాకే కాదు… నా అరుపుక్కూడా బాక్సాఫీసు పీసుపీసు. నా ‘గర్జనా’ ఓ టైటిలే’’ అంది యాంగ్రీ యంగ్ పులి.
‘‘ఒరేయ్… పిట్టలే ఇంతగా కూస్తాయ్. మేరంతా మేస్తయ్. నాకూ హీరోలకూ తేడాయే లేదు. వాడు గడ్డం గీసుకుంటాడూ… నేను గీసుకోనంతే. కానీ ఈమధ్య వాడు గడ్డం గీసుకోకపోయేసరికి… గుర్తుపట్టని నా గాళ్‌ఫ్రెండ్ వాడి డెన్నులోకెళ్లి డ్యూయెట్టేసింది. దాన్ని లాక్కొచ్చేసరికి నా జూలులో ప్రాణం ‘‘zoo’’లోకొచ్చింది’’ అంటూ సింహనాదం చేసింది సింహాద్రీ ఉరఫ్ నర‘సింహ’ అలియాస్ ‘సింహ’!
వీళ్లందర్నీ చూసి నవ్వింది బొద్దింక. ‘ఏం ఎందుకలా నవ్వుతున్నావ్?’’ అడిగాయి మిగతా జంతువులు. ‘‘గదిలోకొచ్చిన హీరోయిన్ కాక్రోచ్ను చూసి గబుక్కున కథానాయకుడి ఒళ్లోకొస్తుంది. హాహాకారాలు చేస్తూ హీరోకు హగ్గిస్తుంది. అంతే!… సీన్ కట్… సాంగ్ స్టార్… సిన్మా హిట్!!’’ అంది బొద్దింక.
వీళ్లను చూసి ఈగ పగలబడి నవ్వడం షురూ. ‘‘హేయ్… ఈగా ఎందుకలా నవ్వుతున్నావ్’’ అడిగాయి మిగతా జంతువులు. ‘‘హేయ్… యూ బ్లడీ పశువ్స్… పెద్ద హీరోల్లాగా నాకూ కొన్ని టైటిల్సున్నాయ్. నన్ను పిలవాలంటే జస్ట్ పేరెట్టి పిల్వొద్దు. మొదట ‘డేరింగ్ డయేరియా’, ‘కలరా స్టార్’, లేదా ‘ఫీవర్‌స్టార్’ టైటిల్స్ చేర్చాకే పిలవాలని గుర్తుంచుకోండి. ‘ఈగ’లో నాది ఫుల్లెంత్ రోలని మైండులో ఉంచుకోండి’’ జుయ్య్‌ంటూ గయ్యంది ఈగ.
‘‘మనలో మనం కొట్టుకోవడం కాదు… ఆపద్బాంధవుడులో మేమూ సాత్వికాభినయం చేశాం. మా మొగుళ్లు, బావలు, మరుదులు పాడిపంటలు కాలం నుంచి బాక్సాఫీసు బండిలాగుతున్నాయ్. మా కజిన్ సిస్టరు మీద కూర్చునే ఎన్టీఆర్ అంతటోడు ‘ముద్దబంతి పూలుబెట్టీ మొగిల్రేకులు జడనుజుట్టీ’ పాటల్పాడాడు. మేమేం మీలా మిడిసిపడుతున్నామా? మనందరికీ యూని‘వరసల’ పిక్చర్స్ బావగారు నక్క గార్ని పిలవండి. ఎవరు గొప్పో ఇట్టే చెప్పేస్తాడు. రాజనాల మొదలు రావుగోపాల్రావు వరకూ ఆయనేగా మన ఆంతరంగిక సలహాదారు’’ అన్నాయావులు.
నాగభూషణం, అల్లు రామలింగయ్యల మిక్స్‌డ్ వాయిస్తో అందర్నీ వాయిస్తూ… ఇలా అంది నక్క ‘‘ఎవరు గొప్పని ఎచ్చులు పోవడం కాదు… మొన్నటి వరకూ మనందర్నీ వాడుకొని సొమ్ముల్జేస్కొని, సోకులు పడ్డవారు ఇప్పుడు ‘సీజీ’లంటూ గ్రాఫిక్సులతో మళ్లీ మన ‘ఇమేజ్’లనే వాడుకొని ఇమేజులు పెంచుకుంటున్నారు. మన సంక్షేమానికీ, అడవులాభివృద్ధికీ, మన వాటా మనకు ఇచ్చి తీరాల్సిందేనంటూ నేడు జంతుహక్కుల దినోత్సవాన నినదిద్దాం పదండి ముందుకు’’ ………… – యాసీన్ జంతుహక్కుల_దినోత్సవం (10–12–2022)
Share this Article