……… By…….. Bharadwaja Rangavajhala…………… ఇప్పుడూ క్రియేటివిటీకిన్నీ అరాచకానికీ చాలా దగ్గర సంబంధం కలదు.
మరీ పద్దతిగా ఉన్నవాడు క్రియేటివ్ గా ఎలా ఆలోచించగలడు?
పద్దతి రాజ్య స్వభావం.
అక్కడ రాజ్యాంగం చెప్పిన పద్దతిలోనే నడక సాగుతుంది.
అక్కడ క్రియేటివిటీకి అదే సృజనాత్మతకు అవకాశం ఏదీ?
ఉండదని మదీయ భావన.
ప్రభుత్వోద్యోగులు డాన్సులు చేయరా? చేస్తారు…
అలాగే…
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతకు ముందు ఘంటసాల వీళ్లందరికీ పారలల్ గా బాలమురళీ లాంటి అద్భుతమైన గాయకులు ప్రోస్టేట్ ఉన్నారు కదా …
వారు సృజనాత్మకత లేనివారా లాంటి ప్రశ్నలు అడగవచ్చు ..
వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి బలమైన ఆనవాళ్లు లేకపోవడం చేత అలా అంటున్నాం … ఇక్కడ రాజ్యం అంటే కేవలం ప్రభుత్వ అనో పోలీసులనో నేను అనడం లేదు.
ఘంటసాల, బాలమురళీ లాంటి వాళ్లు రాజ్యానికి పద్దతిగా వ్యవహరించినట్టు కనిపించినప్పటికిన్నీ .. వ్యక్తిగత జీవితాల్లో కొన్ని రిస్టిక్షన్స్ అంటే పరిమితులు దాటి ఉండవచ్చు కదా…
అలా దాటకపోతే అంత క్రియేటివిటీ ఎక్కడనుంచీ వస్తుందని నేనంటున్నాను..
అంచేత …
కవులు రచయితలు ఇతర కళాకారుల జీవితాల్లో ఒకటి రెండు పెళ్లిళ్లు … అక్రమ సంబంధాలు కనిపిస్తాయి.
తప్పదు … దీనికి ఎస్ ఎల్ భైరప్ప రాసిన వంశవృక్షలో ప్రొఫెసర్ పాత్రే ఉదాహరణ.
అదేనండీ బాపు తీసిన సినిమాలో కాంతారావు వేశాడు కదా ఆ పాత్ర …
భారతీయ సంస్కృతి మీదో మరో వల్లకాటి అంశం మీదో పరిశోధన చేయడానికి వచ్చిన శ్రీలంక అమ్మాయితో కాంతారావు కథ నడుపుతాడు కదా …
విషయం తెల్సి ఆయన భార్య రంకెలు పెట్టినప్పటికిన్నీ ఆయన ముందుకే పోతాడు.
ఆ సందర్భంగా … కొన్ని సార్లు అంటే చాలా సార్లు … మన మనసు కోరుకుంటున్నదే మనం పొందుతున్నామా అనే క్లారిటీ ఉండదు.
ఇదే మనసు కూడా కోరుకుంటోందేమో అనే భ్రమలో మనం కొన్ని ప్లగ్గుల్లో వేళ్లు పెట్టేస్తాం …
ఆ తర్వాత తెలుస్తుంది …
అబ్బే, మనం రాంగ్ ప్లగ్ లో వేలెట్టాం అని … అప్పుడేం చేయాలి?
దీన్నే ఆత్రేయ గారెలా చెప్పారంటే …
నీ మనసుకు తెలుసు నా మనసు
నీ వయసుకు తెలియదు నీ మనసు అని …
ఏం చెప్పాడండీ ఎంత అరాచకుడు కాపోతే అంత గొప్ప మాట చెప్పగలడు వాడు.
ఇలా మనసు గుర్తించిన తర్వాత మనసు కోరుకుంటున్న నిజమైన మనసు ఎదురైనప్పుడు రాజ్యానికి రాజ్యాంగానికీ భయపడి ఇక్కడే ఆగిపోవాలా ?
ముందుకు సాగిపోవాలా?
అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
అప్పుడు ఏం చేయాలి?
పాత అప్పటిదాకా కల్సి ఉన్న కంపేనియన్నుగారిని కంపార్టమెంటు దింపేసి యు డై యువర్ ఓన్ డెత్ అనేసి షికారు పోయి దూదమా అని పాడుకుంటూ రైలేసుకుని వెళ్లిపోవాలి …
అప్పుడా కంపార్ట్ మెంట్లోంచీ దిగిపోయిన పాత కంపేనియన్ ఏం చేయాలి?
ఇంకో రైలు కోసం ఎదురుచూడాలా?
ప్రయాణం ముగిసిందని ముసుగేసుకుని కూర్చోవాలా?
ఈ జన్మకింతే అనుకోవాలా …
ఏం చేయాలి అనే సమస్య మీద కొన్ని వందల నవల్లు వచ్చాయి.
ఇంకొన్ని వందల సినిమాలూ వచ్చాయి.
దాదాపు ఇలాంటి కథే… ఈరోజు విన్నాను….
అసలు నాగేస్పర్రావు నటించిన అనేక సినిమాలకు కథలివే కదండీ …
మనసు కలవని భార్యతో సంసారం చేస్తూ…
మనసు కలసిన కంపేనియన్ దొరికినప్పుడు పడే ఘర్షణతో ఓ సినిమా ..
రైలెక్కేసి కంపేనియన్ ను దింపేసినట్టు ఓ సినిమా … దింపేసిన కంపేనియన్ నాటకం ఆడి తనే అత్యంత ఆధునికంగా మోడ్రన్ థింకర్ లా కనిపించి మళ్లీ హీరోను తనతో తీసుకెళ్లడం అనే కథతో ఓ సినిమా …
భర్త కారు ఇంకెక్కడో పార్క్ చేస్తున్నాడనే అనుమానంతో భార్య గొడవ పడడంతో ఓ సినిమా … భార్య ఇంకెవరితోనో అనే అనుమానంతో భర్త …
భర్త అనుమానం తప్పని నిరూపించడానికి భార్య ప్రియుడుగా మోపబడ్డ వాడు పడే తాపత్రయంతో ఓ సినిమా …
ఇలా అనుమానం చుట్టూ తిప్పి అనేక సినిమాలు తీసేసి నట సామ్రాట్టును నటభూషణను పోషించిన చరిత్ర మనది…
సరే అదంతా పక్కన పెట్టేస్తే …
శ్రీశ్రీ తన ఆటో బయాగ్రఫీలో తన అక్రమ సక్రమ సంబందాల మీద బోల్డు రాసవతల పడేశాడు … ఆత్రేయ గురించి మురారి లాంటి నిర్మాత చాలా గౌరవ ప్రదంగానే ఆయన అఫైర్ల గురించి రాశారు… అధర్మపత్ని లాంటి అద్భుతమైన క్రియేటివ్ పదం ప్రయోగించారాయన.
వేటూరి వారి మీదా ఇలాంటి అనుమానపు క్రీనీడలు ఉండనే ఉన్నాయి.
తప్పేం కాదు …
అయితే ఈ మొత్తం వ్యవహారానికి మూలం ఎక్కడుందంటే …
పెళ్లి అన్న దగ్గరుంది.
పెళ్లి అయిన మగాడు … లేదా పెళ్లి అయిన ఆడది ఇలా చేయడం …
అన్నదగ్గరే వస్తోంది ఈ గొడవంతా …
పెళ్లే రాజ్యం …
దానికి వ్యతిరేకంగా మనసులుకోవాల్సి రావడం అంటే పెళ్లినిబంధనలు మనసు స్వేచ్చకు అడ్డంకిగా మారినప్పుడు ఎదిరించిన ప్రతివాడూ ప్రతిదీ దుర్మార్గులు అవుతున్నారు ఈ లోకంలో …
రాజ్యాన్ని వ్యతిరేకించే కమ్యునిస్టులు కూడా అక్రమ సంబంధాల గురించి మాట్లాడడం ఎంత దారుణమండీ ?
అదేమన్నా మార్క్సిజమా?
కాదు కానే కాదు.
ఫలానా వెంకటలక్ష్మి మొగుడు ఫలానా సుబ్బలక్ష్మితో వెళ్లాట్ట …
లేదూ ఫలానా వెంకయ్య గాడి పెళ్లాం … ఫలానా వాడితో వెళ్లిందట ఇట్టా మాట్లాడుకోడానికి టీకొట్ల దగ్గర టాపిక్కులు కావడానికీ ఎందరో తమ జీవితాలను కొవ్వొత్తులుగా కాల్చుకుంటున్నారు.
అంచేత నేనేమంటానంటే …
ఈ అక్రమ సంబంధాలు అనే పదబంధం తప్పు …. పెళ్లి అనే వ్యవస్థను రద్దు చేసేస్తే … ఆటోమేటిక్ గా ఇవీ పోతాయి.
దేవుడు పోతే దెయ్యమూ పోయినట్టు..
అప్పుడు కేవలం సంబంధాలే ఉంటాయి.
అసలు అక్రమ సంబంధం అనే పదం ఉందిగానీ సక్రమ సంబంధం అనే పదమే లేదు కదా…
టీ కొట్ల దగ్గర గాడిదలు చేరి …
ఫలానా వాడి పెళ్లాం లేదూ ఫలానా దాని మొగుడూ అని చెత్తవాగుడు వాగరు.
బావుంది కదా …
ఇద్జెప్పడానికి ఇంత చెప్పుకురావాల్సి వచ్చింది…
ఆ మధ్య ఫేస్బుక్ లో ఓ పంచాయితీ నడిచింది… నైతికత మీద …
ఈ నైతికత అనేదే ఓ బూటకం.
ఇదీ రాజ్యం తాలూకు కట్టుబాటు కంచే తప్ప మరేం కాదు …
కమ్యునిస్టులూ ఇక్కడ నడుం వంచి దణ్ణం పెట్టుకుచస్తారు వీళ్ల దుంపలు తెగ …
పైగా వాడిట్టాట వీడిట్టాట అనే స్టేట్ తాలూకు ఇన్ఫ్యులెన్స్ ఉన్న చెత్త చర్చలు ఎక్కువగా జరిగేది కమ్యునిస్టు శిబిరాల్లోనే …
నీతి నియమం రీతి రివాజు లాంటి చెత్త అంతా కూడా ఈ దిక్కుమాలిన స్టేట్ భావజాలమే తప్ప మరోటి కాదని నేను డబ్బా బద్దలు కొట్టి సారీ కంప్యూటర్ కీబోర్డును బాది మరీ చెప్తున్నాను.
Share this Article