అనుకుంటాం గానీ… బట్టతలకూ, మోకాలికీ ఖచ్చితంగా సంబంధం ఉంటుందండీ… ఉండదు అంటే మన తెలుగు పాత్రికేయులు అస్సలు ఒప్పుకోరండీ… మనం ఇన్నాళ్లూ గమనించలేదు గానీ… మోడీ పట్ల జనాదరణ ఘోరంగా పడిపోవడానికి అసలు కారణం మనం పట్టుకోలేకపోయాం, ఎందుకంటే… మనం ఆప్టరాల్ జర్నలిస్టులం, ఆఫ్టరాల్ రీడర్స్ కాబట్టి… అదే రాధాకృష్ణ మాత్రం నిశితంగా పరిశీలించి, శోధించి, క్రోడీకరించి, విశ్లేషించి, తవ్వివడబోసి అసలు కారణం ఇట్టే పట్టేశాడు… సింపుల్… మోడీ అడ్డదిడ్డంగా పెంచుతున్న గడ్డం, జులపాలు జనానికి ఏమాత్రం నచ్చడం లేదు… అంతే…! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘వీక్’ఎండ్ కామెంట్ తేల్చేసింది కూడా ఇదే… అవునా..? నిజమేనా..? తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదేమో… గతం అంటే వేరే… ఓ బక్కపల్చటి పెద్దాయన గోచీ ఒకటి కట్టుకుని, ఓ పెద్ద కట్టె ఆసరాగా అడుగులేస్తుంటే కోట్ల మంది జనం స్వాతంత్ర్య పోరాటంలో ఆయన వెంట కదిలారు… ఇప్పుడయితే చర్చ వేరే ఉండేదేమో… ఏమోయ్ గాంధీ, పళ్లు రాలిన ఆ నోరేంటి..? బొక్కలు తేలిన ఆ బక్క దేహ ప్రదర్శన ఏమిటి ..? ఇలాగైతే ఆ బ్రిటిషోడు స్వేచ్ఛనిస్తాడా మనకు..? అని ఏ రాధాకృష్ణో ఖచ్చితంగా రాసి ఉండేవాడేమో… అంతేనా..? నీపక్కన నెహ్రూను చూడు, హిందీ హీరోలా ఎలా నిగనిగలాడుతున్నాడో అని ఓ పోలిక కూడా పెట్టేవాడేమో…
కేసీయార్, జగన్, మోడీల పట్ల జనాదరణ జారుడుబండ మీద పడి వేగంగా దిగువకు జారిపోతోందని ఇండియాటుడే సర్వే చెప్పిన మాట నిజమే… అందులో రాధాకృష్ణ సొంత వికారమేమీ లేదు… అయితే ఆ సర్వేను నమ్మాలా లేదానేది పాఠకుడి ఇష్టం… నమ్మాలనుకుంటే, ఎందుకు పాపులారిటీ తగ్గుతోంది అనే విశ్లేషణలూ అవసరమే… ఆ జారుడు హీరోలకు కూడా స్వీయ విశ్లేషణ అవసరం… అయితే అది సీరియస్‌గా జరగాలి… ఈ గడ్డాలు, జులపాలు వంటి నాన్-సీరియస్ అంశాల్ని కుక్కి, ఆ విశ్లేషణ సరైన జర్నలిస్టిక్ అప్రోచ్‌లో సాగాలి… ఒకే ఏడాాదిలో ఒక ప్రధాని పట్ల జనాాదరణ 66 శాతం నుంచి 24 శాతానికి పడిపోవడం అనేది ఖచ్చితంగా మీడియాలో చర్చ జరగాల్సిన అంశమే… ప్రభుత్వరంగ సంస్థల విక్రయం, కరోనా వేక్సిన్ పాలసీ, కరోనా వేళ జనాన్ని ఆదుకునే మానవీయ చర్యలు, అత్యవసర మందుల కొరత, ఆక్సిజెన్ లేమి, పెట్రో ధరల మంటలు, నిత్యావసరాల భుగభుగ… ఇలా బోలెడు అంశాలు మోడీ పట్ల జనాదరణను క్షీణింపచేశాయి… ఎస్, మోడీ జులపాలు, గడ్డం చూడ్డానికి చిరాకుగా ఉన్నయ్, జనానికి నచ్చట్లేదు, దానికి అసలు కారణం ఇవిగో ఇలాంటి పాలనపరమైన వైఫల్యాలు, సగటు మనిషి కష్టాలు… (బెంగాలీల వోట్ల కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ వేషాన్ని ఇమిటేట్ చేస్తున్నాడని కూడా మీడియా అప్పట్లో కొక్కిరించంది మోడీని, మరి ఇప్పుడేమంటారో…) సరే, జగన్ ఏమీ మారలేదు కదా, ఎంచక్కా మహేశ్‌బాబు తరహాలో మంచి బ్రాండెడ్ షర్టులు వేసుకుని, మడత నలగని హీరోలా ఉంటాడు కదా, మరి తనకెందుకు తగ్గినట్టు జనాదరణ..? కేసీయార్ బట్టలు, మొహం ఏమీ మారలేదు కదా, మరి తనెందుకు జారిపోతున్నాడు..? జనంలో వ్యతిరేకత ఇంత ప్రబలంగా ఎందుకు పెరుగుతున్నట్టు..? సో, ఈ గడ్డాలు, జులపాల భాష వదిలేద్దాం కాసేపు…
Ads
జనానికి ఏం కావాలి..? కష్టకాలంలో తమతో ఉండే లీడర్ కావాలి… ఎలా పాలిస్తున్నాడనేది కావాలి… ఎలా వ్యవహరిస్తున్నాడనేది కావాలి… నడిపించే సత్తా ఉందా లేదా చూడాలి… అంతే తప్ప, లుక్కుతో ఏం పని..? బుడ్డ గోచీతో తిరిగితే ఏమిటి..? అంతెందుకు..? చంద్రబాబు గడ్డం గుర్తుకుతెచ్చుకొండి ఓసారి… మరి మొన్నమొన్నటిదాకా జనం వోట్లేశారు కదా, కుర్చీ ఎక్కించారు కదా..! యోగీ కూడా అంతే కదా, నున్నగా గుండు గీకేసి, కాషాయం అంగీ, ధోతీ వేసుకుని తిరుగుతూ ఉంటాడు, మరి జనం ఇప్పుడు తనను ప్రధాని పదవికి మోడీకి ప్రత్యామ్నాయం అని ఎందుకు భావిస్తున్నట్టు…? సో, ఈ బట్టలు, లుక్కు తిక్క గోల వదిలేస్తే…. నిజంగా రాధాకృష్ణను ఒక విషయంలో మెచ్చుకోవాలి… అధికారంలో ఉన్న లీడర్ల పాపులారిటీ దారుణంగా పడిపోతుంటే, కారణాల్ని విశ్లేషించే కలాలు లేవు ఇప్పుడు… డిబేట్లు పెట్టే టీవీలు లేవిప్పుడు… ఈ గడ్డాలు, జులపాలు ప్రస్తావనలు తీసేస్తే… ఆర్కే తనకు తోచిన కారణాల్ని నిర్మొహమాటంగా రాస్తూ పోయాడు… ప్రస్తుతం తెలుగు మీడియాలో ఆర్కే మాత్రమే ఓ ఆముదపు చెట్టు…!! అన్నట్టు… సరదాగా మనలో మనమాట… మాయలోళ్లు, మంత్రగాళ్లు గడ్డాల్ని అస్సలు తీయరు, తీస్తే వాళ్ల తంత్రవిద్య పనికిరాదు… మోడీ దాన్ని నమ్ముతున్నాడా ఈమధ్య… ఈసారి ఈ కోణంలోనూ ఓ పెద్ద వ్యాసం ఒకటి పత్రికలో అచ్చు కొట్టేస్తే సరి…!!
Share this Article