‘‘మాంచి పాటొకటి రాయాలోయ్ కవీ… ఎలాగూ మావాడే సంగీత దర్శకుడు… కథ మా నాన్నే రాస్తాడు… విషయమేమిటంటే… వీరపాండ్య కట్టబ్రహ్మన, సైరా నర్సింహారెడ్డి హీరోలు… స్వతంత్రం కోసం భీకరంగా పోరాడుతుంటారు… మధ్యలో అనిబిసెంటు వీళ్లకు మద్దతునిస్తుంటుంది… ముగ్గురూ ఓచోట కలుస్తారు, గుండెలు పగిలిపోయే రేంజులో ఓ పాట కావాలి…
అదేంటి సార్… వాళ్లు వేర్వేరు కాలాలకు చెందినవాళ్లు కదా… వాళ్లను కలపడం ఏమిటి..? పైగా వాళ్లు ఒక్కచోట కలిసి పాట పాడటం ఏమిటి..? ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారంటారా..? జనం నవ్విపోతారేమో సార్..?
ఏమీకాదు, మన ప్రేక్షకుల పిచ్చిదనం మనకు తెలియదా ఏం..? ఏం చూపించినా నమ్మేస్తారు… మన సినిమా కథలంటే అంతే… రాజమౌళి అల్లూరినీ, కుమ్రం భీమ్‌నూ కలపడం లేదా..? అసలు అల్లూరిని బ్రిటిష్ సైన్యంలో చూపిస్తాడట… 500 కోట్లు పెట్టాడట ఆ సూపర్ బంపర్ క్రియేటివ్ కథకు…! ఏం..? మనం కట్టబ్రహ్మనను, సైరాను కలిపితే ఏమవుద్ది..? అనిబిసెంటు మద్దతు అంటే తప్పేమిటి..?
Ads
దేశభక్తి పాట అంటే కాస్త దేశం, సమాజం, పోరాటం వంటి పదాలు పడితే బాగుంటుంది, అంతే కదా సార్… ప్రయత్నిస్తాను, రాస్తాను సరేనా..?
ఇదేనయ్యా మీతో వచ్చిన చిక్కు… ట్రెండ్ ఫాలో కారు… మరీ మనకు తెలుగువీర లేవరా, దీక్ష పూని సాగరా వంటివి అక్కర్లేదు… ఎత్తర జెండా టైపులో మొదలై… చుట్టూ చుట్టూ… నాటు నాటు… అంటూ పదాలు పడాలి… అరె పెద్ద హీరోలు బ్రదర్, స్టెప్పులు ఉండాలి కదా, వాటికి తగ్గట్టు పదాలు పడాలి, సాహిత్యం ఎవడికి కావాలి… మాంచి డాన్స్ మాస్టర్‌ను పెట్టి కంపోజ్ చేయిస్తాం స్టెప్పులు… తెలుగు సినిమా టిపికల్ స్టెప్పులు లేకపోతే హీరోయిజం ఏముంది..?
సైరాకు, బ్రహ్మనకు స్టెప్పులా… మధ్యలో అనిబిసెంటు పాదం కలుపుతుందా..? రామ రామ… ఇదేం బీభత్సం సార్… నాతో ఈ పాపపు పాట రాయిస్తారా..?
నువ్వు కాకపోతే వంద మందితో రాయించగలను, కాదంటావా చెప్పు… అంతే, అసలే మనం డాల్బీలో మ్యూజిక్ ఇస్తాం కదా, మైకులు అఖండ స్థాయిలో పగిలిపోవాలి… అంత నెత్తురు మరిగించాలి… తొందరేం లేదు, మనం ఏ ప్రాజెక్టు చేపట్టినా మినిమం మూడేళ్లు కదా… తాపీగా రాయి, వోకేనా..?
మీరు చెప్పినట్టే… నెత్తుటి కొండా, ఎత్తర జెండా వంటి పదాలు పెట్టేస్తాను… సగటు కమర్షియల్ తెలుగు సినిమాలోని పిచ్చి పదాల్నే పేరుస్తాను… సరిపోతుంది కదా..?
గుడ్… అలా రా దారికి..? చరణాల్లో చివర కోడె, నాగు, బుసబుస వంటి పదాలు పెట్టినా పర్లేదు… దేశభక్తి అంటే పౌరుషం కదా… అసలే పెద్ద హీరోలు… కాకపోతే స్టెప్పులకు సరిపడా పదాలు కోరలు చాస్తూ ప్రేక్షకులపైకి దూసుకుపోవాలి, అంతే… అయిదారుగురితో పాడిద్దాం… మనదీ 500 కోట్ల ఖర్చు మరి, పాన్ ఇండియా, పాన్ వరల్డ్… దద్దరిల్లిపోవాలి… అసలే పెద్ద హీరోలు…
సరేనండీ… నాదేం పోయింది..? మీ సినిమా మీ ఇష్టం… ప్రేక్షకుల ప్రాప్తం… ఐనా లాజిక్కులతో సినిమాలు తీస్తే ఎవడు చూస్తాడు..? మీరు చెప్పిందే కరెక్టు..? ఎంతగా లాజిక్కులు లేకపోతే అంత సూపర్ హిట్…
అన్నట్టు బ్రదర్, పాటలో భగత్ సింగ్‌కు, ఎన్టీయార్‌కూ, కరుణానిధికీ, నేతాజీకి, ప్రకాశం పంతులుకూ, షేక్ అబ్దుల్లాకు, వీలయితే రాణిరుద్రమ, వీరశివాజీలకు కూడా దండాలు పెడుతూ, పొగుడుతూ చరణాలు పడాలి… వైఎస్, కేసీయార్ పేర్లు కూడా పెడితే బాగుంటుందంటావా..? కేటీయార్, జగన్ కూడా ఖుషీ అవుతారు కదా, టికెట్ రేట్లకు ఫాయిదా ఉంటుంది…
బాబోయ్… అసలు వాళ్ల కాలం ఏమిటి..? సైరాలు, బ్రహ్మనల కాలం ఏమిటి..? వాళ్లు వీళ్లను కీర్తించడం ఏమిటండీ…. ఐనా నాదేం పోయింది, రాస్తాన్లెండి… వీలయితే ఎంజీఆర్, ఇందిరాగాంధీ, వాజపేయి పేర్లు కూడా పెట్టేస్తాను…
అదీ స్పిరిట్ అంటే… కాంప్రమైజ్ కావద్దు బ్రదర్… అసలే పెద్ద హీరోలు… హిందీ హీరోయిన్‌ను కూడా పట్టుకొచ్చాం… ఇంకో హిందీ హీరోను విలన్‌గా పెట్టేద్దాం… మరి పాన్ ఇండియా కదా, హిందీలో నడవాలి కదా… ష్, మనం కూడా ఓ ఇంగ్లిష్ హీరోయిన్‌ను పట్టుకొచ్చాం… మరి పాన్ వరల్డ్ సినిమా కదా… వీలయితే ఇంగ్లిషులోకి డబ్ చేసి కొట్టేద్దాం… అసలే 500 కోట్ల సినిమా మరి… సరే, మీరిక బయల్దేరండి, ఇంకో పెద్ద హీరోను మూడేళ్లు బుక్ చేసుకోవాల్సి ఉంది…
Share this Article