ఇది మైత్రీ మూవీస్ వాళ్ల సినిమాయా..? ఇంత ఘోరంగా తీశారు గనుకే థియేటర్లలో విడుదల మానేసి, ఓటీటీలో రిలీజ్ చేసి, ప్రేక్షకుల్ని ఇక మీ చావు మీరు చావండని చేతులు దులిపేసుకున్నారా..? పెయిడ్ రివ్యూయర్లు ఉంటారు కదా… డప్పు కొట్టేశారు కొందరు… కానీ నిజమైన తెలంగాణ ప్రేమికులకు ఈ కథ నచ్చదు… ఈ భాష నచ్చదు… ఈ పోకడ నచ్చదు…
ఇప్పుడు తెలుగు సినిమాకు తెలంగాణ ఆట కావాలి, పాట కావాలి, నేపథ్యం కావాలి, పల్లె కావాలి… కానీ నిజమైన తెలంగాణ పల్లెను, జీవితాన్ని, కల్చర్‌ను, భాషను చూపిస్తున్నారా..? లేదు… మరింత భ్రష్టుపట్టిస్తున్నారు… తెలుగు టీవీ సీరియళ్లలో తెలంగాణ భాషను ఖూనీ చేసినట్టుగానే… తెలంగాణ సినిమా దిశలో బలగం ఓ సక్సెస్… కమిటెడ్, సిన్సియర్ ఎఫర్ట్…
కానీ దసరా సినిమాలో నాని ఓ కృతకమైన తెలంగాణ భాషను పలికించాడు… చూస్తున్నంతసేపు చిరాకు… బట్ అఫ్ కోర్స్, కీర్తి సురేష్ తెలంగాణ భాషను, యాసను బాగా సాధన చేసింది… నానికన్నా చాలా బెటర్ డిక్షన్ ఆమెది… అదేదో సినిమాలో నాని చిత్తూరు యాసను భలే పలుకుతాడు… మరి ఆ శ్రమ, ఆ సాధన దసరా సినిమా విషయంలో ఎందుకు జరగలేదో… ఇన్ని కోట్ల డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు డైలాగుల రచనలో గానీ, నటులు ఆ భాషను పలకడంలో గానీ కాస్త సెట్‌లోనే ట్రెయినింగ్ ఇప్పిస్తే బాగుండదా..? మరీ ఇలా తెలంగాణతనాన్ని ఖూనీ చేయాలా..?
Ads
ఇదే ప్రశ్న ‘సత్తిగాని రెండెకరాలు’ చూస్తుంటే తలెత్తుతుంది… పుష్ప సినిమాలో చిత్తూరు యాసను పర్‌ఫెక్ట్‌గా పలికించి, తన నటనతో కూడా ఆకట్టుకున్న కేశవ అలియాస్ జగదీష్ ప్రతాప్ బండారి ఈ రెండెకరాల సినిమాలో ఆ కమిట్మెంట్ ఎందుకు చూపించలేదు..? తను మంచి నటుడే, కరెక్టు, కానీ ఓ స్పెసిఫిక్ యాస కలిగిన పాత్రను తీసుకున్నప్పుడు దానికి తగిన సాధన చేయాలి కదా… (బన్నీ నటించిన ఓ సినిమాకు ఇదే బిత్తిరి సత్తిని తెలంగాణ డిక్షన్‌లో సాధనకు నియమించారు… బన్నీ కాస్త వర్క్ చేశాడు కూడా…)
వెన్నెల కిషోర్ గురించి కూడా చెప్పాలి..,. పబ్లిసిటీలో జేపీ బండారిని మించి వెన్నెల కిషోర్‌నే ఎక్స్‌పోజ్ చేశారు… కానీ మనం గతంలో చెప్పుకున్నట్టే… వెన్నెల కిషోర్ అంటే ప్రేక్షకుల్లో మొనాటనీ వచ్చేసింది… తను భాషలో వేరియేషన్లు పలికించలేడు… నటన, ఉద్వేగ ప్రదర్శన అన్నీ సేమ్ సేమ్… విసుగొస్తోంది… ఈ సినిమాలోనూ అంతే… ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే సేమ్ బ్రహ్మానందం తరహాలోనే కనుమరుగు తథ్యం… బిత్తిరి సత్తి పాత్రా అంతే…
ఇది క్రైమ్ కామెడీ డ్రామా జానర్… మనిష్టం, ఏ పేరయినా పెట్టుకోవచ్చు… ఓ పేదవాడు… డబ్బు అవసరం ఉంది… ఉన్న రెండెకరాల్ని అమ్మడానికి తాత ‘వద్దురా’ అని చెప్పిన హితవు అడ్డుపడుతుంది… చిన్న పిల్ల కోసం ఇక తప్పనిసరై అమ్మడానికి వెళ్తుంటే అనుకోకుండా ఓ కారు యాక్సిడెంట్… అందులో ఓ సూట్ కేసు… డబ్బు ఉంటుందని ఎత్తుకెళ్లిపోయిన బండారి… దాన్నెలా తెరవాలో అర్థం కాదు… ఓ నేరం దర్యాప్తు చేసే బిత్తిరి సత్తి… కథ ఎటో ఎటో తిరుగుతూ ఉంటుంది… సూట్‌కేసు ఓపెన్ చేయకపోవడం అనే పాయింట్‌తోనే కథ దొబ్బేసింది…
విషాదం ఏమిటంటే… ఈ సినిమాలో వినోదం, కామెడీ వర్కవుట్ కాలేదు… క్రైమ్ ఎప్పుడూ కథ పరుగులు తీసినప్పుడే కనెక్టవుతుంది… ఈ సినిమా కథ పరమ నీరసంగా సాగుతూ ఉంటుంది… పెద్దగా మలుపుల్లేవు… నాలుగైదు టీవీ సీరియళ్ల ఎపిసోడ్లను ఒక్కచోట కలిపి కుట్టేసి, ఓటీటీకి ముడిపెట్టినట్టుగా ఉంది… ఇంతకుమించి ఈ సినిమా గురించి చెప్పుకోవడం అనవసరం…
మొన్నామధ్య ఓ ప్రోమోలో… ఇదే బండారి అలియాస్ కేశవ ఓ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ ఎదుట… సినిమాలో హీరోగా చేశాను, ఆశీర్వదించండి సార్ అంటాడు… బన్నీ సరదాగానే… హీరోగా సక్సెస్ కావాలని కోరుతున్నా, కానీ హీరో అయిపోయాను అని కథలు పడొద్దు… కేశవ పాత్ర షూటింగుకు సైలెంటుగా తిరిగి వచ్చెయ్ అని హెచ్చరిస్తాడు… ప్రస్తుతానికి బన్నీ చెప్పింది నిజమే… కేశవకు ఆ హీరో ఫ్రెండ్ కేరక్టర్లే కరెక్టు..!! సమజైందారా సత్తిగా…!!
Share this Article