కాజల్ అగర్వాల్… చందమామ… నో డౌట్, మంచి అందగత్తె… నిజానికి జస్ట్, ఇన్నేళ్లూ ఓ అందగత్తెగానే కనిపించింది సినిమాల్లో… ఇదీ నా సినిమా అని చెప్పుకునే సినిమా ఒక్కటీ లేదు ఆమెకు… ఏదో దర్శకుడు చెప్పినట్టు హీరోతో నాలుగు గెంతులు, హీరో పక్కన దేభ్యం మొహం వేసుకుని క్లైమాక్స్ దాకా ఏదో కధ నడిపించడం… అంతే…
కానీ చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంది, పెళ్లయ్యింది, ఓ కొడుకు… కొంత మెచ్యూరిటీ వచ్చినట్టుంది… అల్లరిచిల్లర పాత్రలు కాదు, అలా చేస్తే మొగుడు వోకే అంటాడా లేదానేది వేరే సంగతి, ప్రేక్షకులు హర్షిస్తారా లేదానేది డౌట్… ఇది ఈమెకూ వచ్చింది… పెళ్లయితేనేం..? ఈ వివక్ష ఏమిటని ప్రశ్నించింది మొన్న ఎక్కడో…
ఉంటుంది, చూసే ప్రేక్షకులు పెళ్లయిన మహిళ అనగానే చూసే కోణమే మారుతుంది… సరే, ఆమె రీఎంట్రీ అనుకుందాం… పోనీ, సెకండ్ ఇన్నింగ్స్ అనుకుందాం… కొన్నాళ్లు గ్యాప్ తరువాత తెర మీదకు వచ్చింది… అదీ రొటీన్ కమర్షియల్ ఆరబోత బాపతు పాత్ర కాదు, వుమెన్ సెంట్రిక్… ఇన్‌స్పిరేషనల్… మంచి పాత్రే…
Ads
సినిమా పేరు సత్యభామ… వుమెన్ సెంట్రిక్ అన్నారు కాబట్టి పేరున్న పెద్ద హీరోను పెట్టుకోలేదు… వెబ్ సీరీస్ చేసుకునే నవీన్ చంద్రను పట్టుకొచ్చారు, అఫ్ కోర్స్, మంచి నటుడే… ప్రకాష్ రాజ్ వంటి కొందరు ఉన్నారంటే ఉన్నారు, అంతే… మొత్తం కాజలే… ఐనా సరే తన భుజాల మీద మోసింది… కష్టపడింది… కొత్త కాజల్ కనిపించింది… యాక్షన్ సీన్లు కూడా అదరగొట్టింది…
కానీ..? కేవలం కాజల్ మొహం, కదలికలు చూడటానికి రాడు కదా ప్రేక్షకుడు థియేటర్‌కు… మనకు తెలిసిన కాజలే కదా, సినిమా ప్రమోషన్లలోనూ ఎడాపెడా కనిపించేస్తోంది కదా… మరి సినిమాలో ఏం చూడాలి..? కథ, కథనం… కథ వరకు వస్తే… ఆమె ఏసీపీ… మహిళలకు స్పూర్తి, భరోసా… ఓసారి ఎవరికో భరోసా ఇస్తుంది, భర్త కాస్తా కాజల్ కళ్ల ముందే హతమారుస్తాడు, సినిమా కథ కదా, కాజల్ బుల్లెట్లు పనిచేయవు, సినిమాయే కదా, ఆమె సస్పెండ్ అవుతుంది… ఎన్ని సినిమాల్లో చూడలేదు..?
తరువాత ఆమే హంతకుడిని పట్టుకోవడానికి తిరుగుతుంది… అదేదో స్ట్రెయిట్‌గా ఉంటే మరో మంచి క్రైమ్ థ్రిల్లర్ అయ్యేది… కథ కాస్తా పక్కదోవ పట్టి, అనేక ఉపకథల్ని విలీనం చేసుకుని… టెర్రరిజం, వుమెన్ ట్రాఫికింగ్, గేమింగ్ గట్రా అంశాల మీదుగా క్లైమాక్స్ దశకు చేరేసరికి ప్రేక్షకుడికి హమ్మయ్య అనిపిస్తుంది…
ఒకటే కొత్త విషయం… హంతకుడు ఎవడో తెలిసిపోవడం ముందే… తనను పట్టుకునే ప్రయాసే కథ… అది ఎటో ఎటో సాగి, చివరకు ఓ ఇంట్రస్టింగ్ నోట్‌తో కంచికి చేరుతుంది… నిజం చెప్పొద్దూ, కథనం ఎక్కడా సగటు ప్రేక్షకుడిని కనెక్ట్ కాదు… ఎందుకంటే, దర్శకుడు చెప్పాలి… ఫాపం, కాజల్ మాత్రం తన వంతు శ్రమ తాను పడింది… ఇంతకుమించి చెప్పడానికి కూడా ఏమీలేదు సినిమాలో…! సత్యభామ అని పేరెట్టారు గానీ… మరీ సత్యభామ అంతటి కేరక్టరైజేషన్ ఏమీలేదు..!!
Share this Article