Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సత్యమే సుందరం..! చాలాసార్లు సంతోషంతో ఏడ్చాను. కారణం తెలీకుండా ఏడ్చాను…

October 2, 2024 by M S R

.

గుర్తుకొచ్చారా? – మహమ్మద్‌ ఖదీర్‌బాబు

‘ఒరే గాడ్ది’ అనే అక్క ఒకత్తి ఉంటుంది. మద్రాసులో ఉంటుంది. అంత మంచి పొడవైన కురులు మళ్లీ జన్మలో చూడం. సెలవుల్లోనో, పెళ్లిళ్లప్పుడో నశ్యం వల్ల నల్లగా ఉండే ముక్కుపుటలతో ఉండే వాళ్లమ్మతో వస్తుంది. ఆవిడ వరుసకు మేనత్త అవుతుంది. తమిళ దేశానికి వెళ్లి సంసారం చేసి కూతుర్ని కన్నది. వచ్చిదంటే పూర్వికుల పురాణం విప్పుతుంది.

Ads

ఆ బంధువులు అక్కడ ఈ బంధువులు ఇక్కడ… మాటల్లో బంధాలు తెలుస్తూ ఉండగా పొడవు కురుల అక్క ‘ఒరే గాడ్ది… జామకాయలు కోద్దాం రారా’ అని పిలుస్తుంది. పాదాలకు మూడు కెరటాల వెండి పట్టీలు గుర్తుంటాయి. ఎడమ చేతిలో ఎర్రటి గోరింట బొట్టు గుర్తు ఉంటుంది. చిలకపచ్చ దావ్‌నీలో కొమ్మను లాగి చక్‌మంటూ కోసే లేపచ్చి జామకాయ కూడా.

కాస్త పెద్దవుతాము. అడ్రస్‌ తప్పిపోతాము. గుర్తే రాదు.
బిట్రగుంట నిండా మావాళ్లే. ఫుట్‌బాల్‌ మజీద్‌ అనే వరుసకు పెదనాన్న డిగో మారడోనా అబ్బాజాన్‌లా కొట్టాడంటే గోల్‌ పడాల్సిందే. ‘రైలు డ్రైవరు. ఏం పేరని’ అంటూ ఉంటే అదొక బంధం ఉన్నందుకు సెలవులకు వెళ్లే ఊరున్నందుకు సంతోషం. పిల్లలందరం మూగితే ‘96 డౌన్‌ 74 అప్‌’ అని రైళ్లను పిలుచుకుంటూ వాళ్లకు మాత్రమే అర్థమయ్యే రైల్వేభాష నుంచి తప్పించి, షావుల్‌ గాడు దూరంగా తీసుకెళ్లి, చల్లటి నీటితొట్టిలో నుంచి కలర్‌ సోడా కొట్టించి తాగిస్తాడు. మొత్తం తాగాక సీసాలోని నీలిరంగు గోలీని కదిలించి చూస్తూ అలాంటి గోలీ ఎక్కడ దొరుకుతుందో తెలియక…

ముప్పై ఏళ్లయినా అయి ఉంటుంది షావుల్‌ని చూసి. దూరం ఉన్నాడా? నెల్లూరులోనే.
అమమ్మకు ముగ్గురు అక్కచెల్లెళ్లు. వాళ్ల సంతానం వారికి సంతానం. 100 మందైనా ఉంటారు. కలిసింది లేదు. పేర్లు గుర్తున్నది లేదు. వాళ్లల్లో నా ఈడు వాళ్లు, ఆడిన వాళ్లు, ఆదివారాలు గాలిపటాలు ఎగరేసిన వాళ్లు, గ్యార్‌వీలో శుభ్రంగా తలస్నానం చేసొచ్చి విస్తరితో కూచుని ‘చూద్దామా నువ్వు ఎక్కువ ముక్కలు తింటావో నేను తింటానో’ అని పందేలు కట్టిన వాళ్లు, పక్కపాపిడి అమాయక ముఖాలు తప్ప ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియకుండా ముద్రేసుకుని పోయినవాళ్లు….. ఖాలాలు వదలరు. కంట నీరు పెట్టుకుంటూ ‘సర్తాజ్‌ కొడుకువట్రా నువ్వూ. మీ అమమ్మతోనే అన్ని బంధాలు పోయాయిలే’ అనంటుంటే ఏం చెప్పాలో తెలియక ఊలు కొట్టడమే.

బంధువులు ఇవాళ ఎవరికి గుర్తున్నారు? మహా వృక్షాల ఛాయలు ఎవరికి దాపున ఉన్నాయి? చక్కని చిన్న ఇల్లు. మనమూ మన ఇద్దరు పిల్లలు. పూలకుండీలు. చాలా?
నదీ ప్రవాహాలు రక్త ప్రవాహాలు సమూలంగా నశించిపోవు. ఇంక వచ్చు. తిరిగి ప్రవహిస్తాయి. పూర్వీకుల రక్తం అయినవారి రక్తం. దాని గుణం ఏమిట్రా అంటే తన వారిని చూస్తే దౌడు తీస్తుంది. కొట్టకలాడుతుంది. అవును. నిర్లక్ష్యం చేసి ఉంటారు. చెడ్డమాట అని ఉంటారు. మోసం చేసి ఉంటారు. ఈర్ష్య పడి ఉంటారు. కాని ప్రేమించి, అభిమానించి, ఆర్తి నింపుకుని… మన గురించి ఏ మంచి వార్తో విన్నప్పుడు ‘పోనీలే’ అనుకుని చెడువార్త విని ‘అయ్యో’ అని బాధ పడి… మనవాళ్లు.

‘సత్యం సుందరం’లో సినిమా తొలిషాట్‌ నుంచి దర్శకుడు పశుపక్ష్యాదులను చూపిస్తూ వెళతాడు. ఏనుగు, చిలుకలు, ఆంబోతు, కుక్క, పాము, చేపలు… వాటితో ఆయా పాత్రలు కలిసి బతుకుతూ ఉంటాయి. ఏనుగు నలిపేస్తుందని, కుక్క కరుస్తుందని, పాము కాటేస్తుందని, ఆంబోతు కుమ్ముతుందని…. ప్రమాదమే. కాని వాటితో ఉండటానికి వాటిని పోషించడానికి మనిషి సిద్ధంగా ఉన్నాడు. మరి మంచో చెడో… మన వారనుకునే మన బంధువులను ఎందుకు దూరం పెడుతున్నాడు. ఆఖరికి సొంత అన్నదమ్ములను అక్కచెల్లెళ్లను, చిన్నాన్నలను, సైకిల్‌ అడ్డతొక్కుడు తొక్కడం నేర్పించిన చిననాటి బంధువును… పశు పక్ష్యాదుల కంటే కాకుండా పోయాయా మన బంధుత్వాలు?

అరవింద్‌ స్వామి తన ఇంట వందల చిలుకలకు ఆశ్రయం ఇద్దామనుకుంటాడు కాని సొంత మనుషుల ముఖం కూడా చూడాలని అనుకోడు. ‘బావా… నువ్వు కొంచెం బాధ పడినా నిన్ను మోసం చేసి నీ ఇల్లు లాక్కున్న నీ పెదనాన్నలకు చెడు జరుగుతుంది. వారి క్షమించేయ్‌ బావా’ అంటాడు కార్తి.

మోసాలు, ద్రోహాలు ఏమీ చేయకపోయినా సరే… అసలేమీ కారణాలు లేకపోయినా సరే అతి చిన్న సాకులకు కూడా బంధుగణానికి దూరమయ్యి, వారిని పనిగట్టుకుని మరిచిపోతున్న మన మీద కదా ఈ సినిమా. మరి మనల్ని మనం క్షమించుకోగలమా?

అరవింద్‌ స్వామి సినిమా చివరి వరకూ కార్తీ పేరు ఏమిటో గుర్తుకు తెచ్చుకోలేడు. దర్శకుడు అడుగుతున్నాడు… మీరు మరిచిపోయిన మీ వాళ్ల పేర్లు చెప్పగలరా? అని. చాలాసార్లు సంతోషంతో ఏడ్చాను. కారణం తెలీకుండా ఏడ్చాను.

మిమ్మల్ని ఈ సినిమాలో చూశాను. మీరు చూస్తే నేనూ కనపడతాను. పారంపరిక అనుబంధాలలోని మనుషులను వారి వెలుగు నీడలతో పాటు కలిసి జీవించడమే– వారి వాకిలి ఎదుట నిలబడి ‘పేరు పిలుస్తూ తలుపు కొట్టడమే’ సత్యం… అదే సుందరం….. 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions