మొన్నామధ్య నాని సినిమా ఏదో వచ్చింది కదా… అందులో కథానాయకుడి పాత్ర నానిది… ప్రతినాయకుడి పాత్ర ఎస్‌జే సూర్యది… అనేక సీన్లలో సూర్య నానిని డామినేట్ చేశాడు… పాత్రకు కూడా అంత ప్రాధాన్యం ఉంది… ఒక దశలో ఇది నాని సినిమాయా..? సూర్య సినిమాయా..? అన్నట్టుగా ఉంటుంది…
సాధారణంగా హీరోలు, ప్రత్యేకించి సౌత్ ఇండియన్ హీరోలు… బిల్డప్పులకు, ఇగోలకు విపరీతంగా ప్రాధాన్యమిచ్చే స్టార్ హీరోలు ఈ ధోరణిని అంగీకరించరు… నాని డిఫరెంట్ కదా, సూర్య పాత్ర ప్రాధాన్యాన్ని అంగీకరించాడు… ఇప్పుడు తమిళ హీరో కార్తి సినిమా ఒకటి వచ్చింది… తెలుగులో దాని పేరు సత్యం సుందరం…
ప్రధాన పాత్రల నడుమ నటనలో, ప్రాధాన్యంలో పోటీ ఈ సినిమాలో ఇంకాస్త ముందుకు పోయింది… హీరో కార్తియే… కానీ సినిమా కథ మొత్తం అరవింద స్వామి చుట్టూ తిరుగుతుంది… తనదే కథ… (రోజా సినిమా కాలంలో ఈ అరవిందుడు యువతుల కలల రాకుమారుడు)… పలు దశల్లో హీరో కార్తిని అరవింద స్వామి స్పష్టంగా డామినేట్ చేశాడు… అఫ్‌కోర్స్, ఒకవైపు కామెడీ పండిస్తూనే, మరోవైపు సున్నితమైన ఎమోషన్స్ పండించడంలో కార్తి మెరిట్ కనిపిస్తుంది… తన కెరీర్‌లో ఇది చెప్పుకోదగిన పాత్ర…
Ads
96 సినిమా తీసి, అందరి మెప్పునూ పొందిన ప్రేమకుమార్ దీని దర్శకుడు… ఎక్కడా సగటు సౌత్ ఇండియన్ స్టార్ హీరో సినిమాల్లో కనిపించే కమర్షియల్ దుర్వాసనల జోలికి పోలేదు… ట్విస్టులు, ఫైట్లు, ఇతరత్రా ఫీట్లు గాకుండా అచ్చంగా కథను నడిపించాడు… అఫ్‌కోర్స్, ఈరోజుల్లోని సినిమాల ట్రెండ్ కోణంలో చూస్తే ఈ సినిమా కథనం చాలా స్లో… ఎడిటింగ్ వైఫల్యం కనిపిస్తుంది… సినిమా నిడివి ఎక్కువ…
తమిళ సినిమా కాబట్టి వాళ్లకు బాగానే ఎక్కుతుందేమో… తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతుందా వేచి చూడాలి… కానీ కొన్ని ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలి… భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటున్నాడు కార్తి… ఇది సూర్య, జ్యోతిక నిర్మించిన చిత్రం… దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ… పల్లె కథ… కుటుంబబంధాల కథ… మూలాల్లోకి తీసుకుపోయే కథ… ఇప్పుడు స్టార్ హీరో సినిమా అంటేనే నరుకుడు, తురుముడు, రక్తం కదా… ఆ నెత్తుటి వాసన లేకుండా… నిజమైన నెత్తుటి బంధాల వాసనను కమ్మేసే కథ…
ఏవో కలహాలు… అరవింద్ స్వామి ఊరు వదిలేసి, బంధాలన్నీ తెంపుకుని ఎక్కడికో వెళ్లిపోయి బతుకుతుంటాడు… చాన్నాళ్ల తరువాత ఓ పెళ్లి కోసం మళ్లీ ఊరెళ్తాడు… అక్కడ కార్తి తగులుతాడు… బావా బావా అంటూ కొత్త బంధాల్లో బంధిస్తూ వెంట వెంట తిరుగుతుంటాడు… ఈ సీన్లలో కామెడీ… అంతర్లీనంగా ఎమోషన్స్… చివరి దాకా ఎక్కడా దర్శకుడు దారితప్పలేదు… అదీ నచ్చుతుంది…
అవసరమున్నా లేకపోయినా అనేకమంది నటీనటులను సినిమా కథలో ఇరికించడం కూడా ప్రజెంట్ ట్రెండే… ఆ పాత్రలకు ప్రాధాన్యమున్నా లేకపోయినా..! ఈ సత్యం సుందరం సినిమాలో ప్రతి పాత్రకు కథోచిత ప్రాధాన్యం ఉంది… చివరకు ఓ సైకిల్, ఓ ఎద్దుకు కూడా..!! రణగొణధ్వనులు, భీకరమైన బీజీఎం కాదు, హృద్యంగా ఉన్న నేపథ్య సంగీతం కుదిరింది… తమిళ ట్యూన్లలో ఇరికించిన తెలుగు పదాలతో ఎప్పుడూ డబ్బింగ్ పాటలతో ఇబ్బందే… కానీ తెలుగు డైలాగుల రచన, డబ్బింగులో నాణ్యత పర్లేదనిపిస్తాయి… మొత్తానికి అరవింద్ స్వామి సినిమాలో ఇగోరహితంగా నటించినందుకు కార్తి అభినందనీయుడు..!!
Share this Article