కేరళకు చెందిన షాజన్ స్కారియా అనే వ్యక్తి జర్నలిస్టు. గతంలో ‘దీపిక’ అనే పత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేసిన ఆయన ‘Marunadan Malayali’, ‘British Malayali’ అనే రెండు ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్లను ప్రారంభించారు. ఇవి రెండూ మలయాళ భాషలోనే వార్తలు అందిస్తున్నాయి. అన్యాయాలను ప్రశ్నించే వార్తలను అందించే న్యూస్ పోర్టల్లుగా వీటికి పేరుంది. అయితే మతగొడవల్ని రెచ్చగొడుతుంటారని, నిర్ధారణ కాని వార్తలు వేస్తుంటారని తీవ్రమైన విమర్శలు సైతం ఈ రెండు పోర్టల్లు ఎదుర్కొంటూ ఉంది.
గతేడాది జులైలో తన న్యూస్ పోర్టల్‌లో సీపీఎం ఎమ్మెల్యే పి.వి.శ్రీనిజన్ గురించి స్కారియా ఒక వార్త ప్రసారం చేశారు. జిల్లా క్రీడా కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనిజన్ క్రీడా హాస్టల్‌ని సరిగ్గా నిర్వహించడం లేదని ఆ వార్తలో ఆరోపించారు. హాస్టల్ నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ వార్తలపై శ్రీనిజన్ మండిపడ్డారు. తన మీద అసత్య ఆరోపణలు చేశాడంటూ స్కారియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీద కేసు వేయాలని నిర్ణయించుకున్నారు.
Ads
ఇక్కడే కీలకమైన పరిణామం జరిగింది. తనపై చేసినవి అసత్య ఆరోపణలని భావిస్తే పరువునష్టం దావా వేయాలి. కానీ శ్రీజన్ అలా చేయలేదు. తాను దళితుడు కాబట్టి స్కారియా చేసిన ఆరోపణలను తన కులానికి ఆపాదిస్తూ ‘ఎస్సీ, ఎస్టీ వేధింపుల నివారణ చట్టం, 1989’ కింద కేరళ హైకోర్టులో కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కావాలంటూ స్కారియా హైకోర్టును ఆశ్రయించగా అక్కడి న్యాయమూర్తులు దాన్ని తిరస్కరించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నివారణ చట్టం కింద నమోదైన కేసులో అది కుదరదని తేల్చేశారు.
ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడా ఇదే తీర్పు వస్తుందని అంతా భావించారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసును మరో దృష్టితో చూసింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నివారణ చట్టం ప్రధాన ఉద్దేశం ఆ వర్గంవారిని కులసంబంధమైన వేధింపుల నుంచి రక్షించడమేనని తెలిపింది. ‘కులం’ అనే అంశానికి ఏమాత్రం సంబంధం లేని ఈ కేసులో ఆ చట్టం ఎందుకు వచ్చిందని శ్రీజన్ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది.
ఎస్సీ, ఎస్టీలకు జరిగే ప్రతి వేధింపునూ ‘కులం’ ఆధారంగానే జరిగిందని చెప్పేందుకు ఆస్కారం లేదని, అలా ప్రతి వేధింపుకూ ‘కులమే’ కారణమని భావించడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. శ్రీజన్ కులాన్ని చూసి ఆ వార్తలు ప్రసారం చేయలేదని, ఆయన కులాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ఈ కేసును తాము చూడలేమని తెలిపింది. ‘కులం’ ఆధారంగా లేదా అతని కులం పనులు, అలవాట్లు, ఆచారాల మీద జరిగే వివక్ష మాత్రమే ఈ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ స్కారియాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది…. – విశీ (వి.సాయివంశీ)
Share this Article