పెద్దగా ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు… ఆంధ్రజ్యోతి తన స్టేట్ బ్యూరో రిపోర్టర్ల కోసం సెల్ఫ్ యాడ్ పబ్లిష్ చేసుకున్న తీరు ఊహించిందే… గతంలో ఇలాంటి ప్లేసుల్లో తమ సొంత జర్నలిజం స్కూల్ అడ్మిషన్ల యాడ్స్ వచ్చేవి… రండి, బాబూ, జర్నలిజం కోర్సులో చేరండి అని పిలుపునిచ్చేది… కానీ ఇప్పుడు బాబ్బాబూ, కాస్త అనుభవం ఉంటే చాలు, వచ్చేయండి, అదే రోజు జాబ్‌లో జాయినైపొండి అన్నట్టుగా యాడ్స్ వేస్తోంది… నిజానికి ఈ పరిస్థితి ఆంధ్రజ్యోతిది మాత్రమే కాదు… ఇంగ్లిషు, ఉర్దూ, హిందీ సహా దాదాపు మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నింట్లోనూ ఉన్నదే… రెండుమూడు చిన్న పత్రికలు మరీ ఇద్దరు ముగ్గురితో స్టేట్ బ్యూరోల్ని రన్ చేస్తున్నాయి… అసలు స్టేట్ బ్యూరోలు మాత్రమే కాదు, సిటీ బ్యూరోలు, ఫీచర్స్ డెస్కులు గట్రా అన్నీ అదే దుస్థితి… టీవీలను కాస్త వదిలేయండి, వాటికి కావల్సిన జర్నలిస్టుల లక్షణాలు వేరు… ష్, వాటికీ మ్యాన్ పవర్ కొరత బాగా ఉంది… నాలుగు అక్షరాల్ని డొక్కశుద్ధితో రాసేవాళ్లు, పలికేవాళ్లు లేరు… జర్నలిజం బేసిక్స్ సంగతి అడిగితే మర్యాద దక్కదు… అంతే…
ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక స్టేట్ బ్యూరో రిపోర్టర్ల కోసం ఎందుకు అడుగుతోంది..? ఇప్పుడు పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్న షాళా పెద్ద తలకాయలు ఈ పరిస్థితి రావడానికి కారణాల్ని ఎప్పుడైనా ఆలోచించాయా..? జిల్లాల్లో పనిచేసే రిపోర్టర్లను స్టేట్ బ్యూరోలోకి బదిలీ చేసుకోవచ్చు కదా అంటారా..? అమాయకపు ప్రశ్న… జిల్లాల్ని వదిలి ఎవరూ రావడం లేదు… రారు… మరీ నిర్బంధంగా రమ్మంటే రాజీనామా పత్రాల్ని మొహాన కొడుతున్నారు… ఒక ఏరియాకు కంట్రిబ్యూటర్‌గా పనిచేయడానికి రెడీయే గానీ డెస్కుల్లోకి, బ్యూరోల్లోకి ఎవరూ రావడం లేదు… అసలు దాన్ని ఓ కెరీర్‌గా తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు… దిక్కుమాలిన కొలువు… పనికిమాలిన ఇంటర్నల్ రాజకీయాలు, అరకొర జీతాలు, నైట్ డ్యూటీలు, సరిగ్గా సెలవులుండవ్, బంధుగణంలో ఎవడింటికీ మంచికీ చెడుకూ వెళ్లేందుకు దిక్కుండదు… తీరా ఏ నలభై ఏళ్లకో వెనక్కి తిరిగి చూసుకుంటే బీపీలు, సుగర్లు, స్పాండిలైటిస్ నొప్పులు… ఇక ఎవడూ పట్టించుకునేవాడు ఉండదు…
Ads
అసలు కారణాలు ఇంకా చాలా ఉన్నయ్… 1) కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానెళ్లు మెయిన్ స్ట్రీమ్ పత్రికలకన్నా మంచి వేతనాలిస్తున్నయ్, వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు, కొత్త జనరేషన్లతో కంటాక్ట్‌లో ఉండొచ్చు… మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా ఛాందస ధోరణుల్లో బతుకుతోంది… వార్తల శైలి, ఎంపిక, ప్రాధమ్యాలు, ప్రజెంటేషన్… అన్నీ 1980 శకంలోనే ఉన్నయ్… 2) కొత్త జనరేషన్‌కు తెలుగు సరిగ్గా చదవడమే రాదు, ఇక రాయడం దాకా ఏం ఆలోచిస్తాం..? వేర్వేరు రంగాల్లోకి వెళ్తున్నారు తప్ప ఈ ఫీల్డ్‌లోకి రావడం లేదు… 3) పత్రికలు తమ అవసరాల కోసం గతంలో జర్నలిజం స్కూళ్లు నడిపేవి, ఇప్పుడవన్నీ మూతపడ్డాయి… ఖర్చు ఎక్కువ, సరైన సరుకు రావడం లేదు, నాలుగు అక్కరకొచ్చే ముక్కలు నేర్పించగల గురువులు కూడా లేరు… కరోనా కష్టాలు అదనం… 4) మన యూనివర్శిటీల జర్నలిజం విభాగాలు ఫిట్ ఫర్ నథింగ్… వాటి సిలబస్, బోధన, స్థాయి ఇంకా తక్షశిల కాలంలోనే ఉండిపోయింది… వాటిని మొత్తంగా మూసేసినా సమాజానికి తులమెత్తు నష్టం లేదు, అవి ఇచ్చే డిగ్రీలు దేనికీ పనికిరావు… ఐనా మార్కెట్ అవసరాలకూ మన యూనివర్శిటీలకూ ఎప్పుడూ సాపత్యం ఎక్కడేడ్చింది..? 5) మీడియాలో ఉద్యోగభద్రత మరీ ఘోరం……. ఇంకా కారణాలు ఉండవచ్చు… కానీ నాణ్యమైన జర్నలిజానికీ రాబోయే రోజుల్లో ఇంకా కొరత తప్పదు… జర్నలిస్టులూ దొరకరు…!!
Share this Article