.
రోజులు అన్నీ ఒకేతీరులో ఉండవు… సీన్ రివర్స్… కేసీయార్ కుటుంబంలో గొడవలు చూస్తుంటే, అంతకుముందు కేసీయార్ క్యాంపు సీఎం రేవంత్‌రెడ్డి మీద వెటకారంగా చేసిన విమర్శలు గుర్తొస్తాయి… ఒకింత నవ్వూ వస్తుంది…
ఎలాగంటే..? రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పదే పదే కేసీయార్ క్యాంపు నుంచి వినవచ్చిన విమర్శలు ఏమిటి..? ఈ సీఎంకు గతానుభవం లేదు, పరిపాలన మీద పట్టు లేదు, లాటరీ ముఖ్యమంత్రి, యంత్రాంగం మీద అదుపు లేదు అనే కదా…
Ads
ఇప్పుడు సిట్యుయేషన్ ఏమిటి..? మనం చాన్నాళ్లుగా చూసిన కాంగ్రెస్ కీచులాటల సంస్కృతి కనిపించడం లేదు… మామూలుగానైతే కాంగ్రెస్‌లో ఉండేవి అధిష్టానికి ఫిర్యాదులు, రకరకాల ఆరోపణలతో లేఖలు, వర్గాల కొట్లాటలు, బహిరంగ పంచాయితీలు, ఢిల్లీలో తీర్పులు, నేతల సర్దుబాట్లు…
చివరకు ఉమ్మడి ఏపీలో సీఎంగా వైఎస్ఆర్ ఉన్న జమానాలో కూడా ధర్మపురి శ్రీనివాస్, యధు యాష్కి, వీహనుమంతరావు ఎట్సెట్రా గ్రూపులు కనిపించేవి కనీసం… ఇప్పుడు ఆ బహిరంగ విమర్శలు, కీచులాటలు కనిపించడం లేదు… ఎవరికివారే సీఎం కుర్చీ మీద ఆశలు పెంచుకోవచ్చుగాక, కానీ పైకి మాత్రం ఎవరూ బజారుకెక్కడం లేదు… కాంగ్రెస్‌లో రోజూ తన్నులాటలు కనిపిస్తాయని ఆశపడిన కళ్లకు ఆ సీన్లు కనిపించక ఓ నిరాశ…
కోమటిరెడ్డి బ్రదర్స్, పొంగులేటి, భట్టి ఎట్సెట్రా నాయకులతో సీఎంకు సయోధ్య ఉంది ప్రస్తుతానికి… ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తలెగరేస్తున్న దృశ్యాలు, మీడియాకెక్కుతున్న తతంగాలు లేవు… పాలన విషయానికొస్తే నిజంగానే తను సీఎం అయిన కొత్తలో ఆల్ ఇండియా సర్వీసు అధికారులతోపాటు రాష్ట్ర అధికార యంత్రాంగం మీద తనకు పట్టు చిక్కలేదు… తన అనుభవలేమి స్పష్టంగా కనిపించేది…
ఇంకా బీఆర్ఎస్ పాలనలోనే ఉన్నామన్నట్టుగా వ్యవహరించేవాళ్లు ఉన్నతాధికారులు… క్రమేపీ చేంజ్ కనిపిస్తోంది… తన ప్రయారిటీలు, తన అవసరాలకు అనుగుణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీలు చేసి, ఏకంగా తన పేషీని కూడా మార్చుకుని, ఆ పాత సీఎస్ వెళ్లిపోయాక కొత్తగా అదే ఫైనాన్స్ రామకృష్ణారావును కొత్త సీఎస్‌గా చేసుకుని… యంత్రాంగం మీద పట్టు వస్తోంది…
ఇది రేవంత్ క్యాంపు సిట్యుయేషన్… కానీ తనను పదే పదే వెటకరించిన కేసీయార్ క్యాంపు సిట్యుయేషన్ ఏమిటిప్పుడు..? పార్టీ మీద కేసీయార్ పట్టు లేదు ఇప్పుడు, ఎవరూ తనమాట వినడం లేదు.,. పది మంది ఎమ్మెల్యేలు జంప్… తను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లందరినీ గుండుగుత్తాగా లాక్కున్న సీన్ ఇప్పుడు రివర్స్… ఇప్పుడు తన అంగీలాగూ సర్దుకోవడానికే సరిపోతోంది…
అంతేనా..? సొంత కుటుంబంలోనే గొడవలు బజారునపడ్డాయి… కేసీయార్ ఇన్నేళ్లూ అనుభవించిన శుక్రమహర్దశ కాస్తా తిరగబడింది ఇప్పుడు… సొంత కూతురు అధినేతపై తిరగబడుతోంది… బిడ్డ, కొడుకు నడుమ వైరం శృతి మించి ఏకంగా పార్టీయే చీలిపోయే ప్రమాదం… ఇన్నేళ్లూ ఏ నలుగురు కుటుంబసభ్యులు రాజ్యపాలన చేశారో వాళ్లిప్పుడు తలోదిక్కు…
కవిత, హరీష్‌రావు, కేటీయార్, సంతోష్… ఎవరికి వారే యమునా తీరే… హరీష్ బయటపడటం లేదు గానీ తనను పక్కన పెట్టేశారనే అసహనం తనలో బాగా ఉంది… కేసీయారే మా నాయకుడు అని కవిత పైకి చెబుతున్నా సరే, ఆయనతో తనకు గ్యాప్ ఉందని పరోక్షంగా కవిత చెబుతూనే ఉంది… సేమ్, కేసీయార్ ధోరణి కూడా అలాగే ఉంది… కేసీయారే మా నాయకుడు అని చెబుతూ కేటీయార్ వారసత్వాన్ని, నాయకత్వాన్ని అంగీకరించేది లేదని పరోక్షంగా కుండబద్దలు కొడుతోంది ఆమె…
సొంత బిడ్డే కదా… ఇంటికి పిలిచి నీ ప్రాబ్లమేమిటమ్మా, నీకేం కావాలి అని అడిగి, ఏదో సర్దిచెప్పి, గొడవ సద్దుమణిగేట్టు ప్రయత్నించాల్సింది కేసీయారే కదా… తండ్రిగా ప్లస్ పార్టీ అధినేతగా… కానీ ఎవరో ఇద్దరు మధ్యవర్తులను పంపించాడు… ఒకరకంగా బిడ్డతో తనకు బాగా గ్యాప్ ఉందని తనే లోకానికి చెబుతున్నట్టయింది…
అదేమీ సామరస్యంగా కుటుంబంలోనే లోలోపల జరగడం లేదు కాబట్టే కవిత మరింతగా అగ్గిమండుతోంది కేసీయార్‌పైన, కేటీయార్‌పైన… పార్టీ మీద పట్టు ఇచ్చుకుపోవడమే కాదు, చివరకు కుటుంబ సభ్యులే తిరగబడుతున్న వైనం నియంతకు నిద్రపట్టని స్థితిని చూపిస్తోంది… వాళ్లు పదే పదే పాలన మీద పట్టు లేదు, అనుభవం లేదు అని వెక్కిరించిన సీఎం మాత్రం నిక్షేపంలా ఉన్నాడు…
సేమ్… ఒకప్పుడు రేవంత్ రెడ్డిని జైలుపాలు చేశారు… కేసులు ఎదుర్కున్నాడు… సేమ్ సీన్ రివర్స్… కేటీయార్ మీద కేసు, ఏసీబీ పిలుపులు, అరెస్టుకు మార్గాలు క్లియర్… కాలేశ్వరం విచారణకు కేసీయార్ వెళ్లనున్నాడు… తన పాలన తప్పులు, అక్రమాల మీద కమిషన్లు, విచారణలు… కవిత మీద లిక్కర్ కేసు సరేసరి…
అదేదో సినిమాలో చెప్పినట్టు… చిన మాయను పెద మాయ, పెద మాయను పెను మాయ… టైమ్ అంటేనే మాయ… టైమ్ బాగున్నన్నిరోజులూ మనదే ఘనత… అది పల్టీ కొట్టినప్పుడే, ఇదుగో ఇలా సీన్ ఉల్టా పుల్టా..! అదృష్టాలు అటూ ఇటూ..!!
అంటే ఇప్పుడు కాంగ్రెస్‌లో అంతా బాగున్నట్టేనా..? రేపూ అలాగే ఉంటుందా..? ఇదీ అసలు ప్రశ్న… అది కూడా టైమే చెబుతుంది..!! నాకు తిరుగులేదు అనుకున్న ప్రతి ఒక్కరినీ విధి నిర్దయగా, నిష్కర్షగా నేల మీదకు దింపుతుంది అని చెప్పడమే ఈ కథన ఉద్దేశం…
Share this Article