Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బడిని సమూలంగా మార్చేద్దాం..! రేవంత్‌రెడ్డి సంకల్పం భేష్… కానీ..?

June 9, 2026 by M S R

.

తెలంగాణ ముఖ్యమంత్రి మొన్న హిందూ ఎన్‌.రామ్ ఇంటర్వ్యూలో ఓ కీలకాంశం ప్రస్తావించాడు… జనంలోకి నెగెటివ్‌గా తీసుకుపోవడానికి తన రాజకీయ ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారని తెలిసీ… సాహసించి తన ఆలోచనల్ని వెల్లడించాడు… తెలంగాణ సమాజంలో చర్చ జరగాలి… భావితరం నిర్మాణానికి కొత్త బడిబాటలు వేయాలి…

ఇప్పటికిప్పుడు… రాత్రికి రాత్రి అబ్రకదబ్ర అనేసి, మొత్తం ప్రాథమిక విద్యను మార్చేయడం సాధ్యం కాదు… కానీ సంకల్పం ముఖ్యం… ఆ దిశలో అడుగులు ముఖ్యం… అదే రేవంత్ రెడ్డి చర్చకు పెట్టిన అంశం… ఒకరకంగా అభినందనీయం… ఎంతసేపూ రాజకీయాల కోణం, ఆ పరిమితులు, ఆ చట్రంలోనే ఉండిపోకుండా ధైర్యంగా కొన్ని ప్రయోజన ప్రతిపాదనల వైపు వెళ్లాలి…

Ads

రేవంత్ రెడ్డి చేస్తున్నది అదే… మనం కాస్త వివరంగా చెప్పుకుందాం… ఎందుకంటే, ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం… కేసీయార్ కాలంలో పూర్తిగా పదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన రంగం… ఓసారి తెలంగాణలో ప్రాథమిక విద్య సంగతి చూద్దాం…

తెలంగాణలో 2,245 స్కూళ్లు ఖాళీ… ఇది విద్యా సంక్షోభమా? సామాజిక మార్పా? … ఒకప్పుడు గ్రామంలో బడి అంటే ఆ ఊరి గుండెకాయ. ఉదయం గంట మోగగానే పిల్లల కేరింతలతో సందడి చేసేది. మధ్యాహ్నం ఆటపాటలతో కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. బడి ఉంది, భవనం ఉంది, బెంచీలు ఉన్నాయి, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కానీ చదువుకునే పిల్లలు మాత్రం లేరు.

దేశవ్యాప్తంగా విద్యా రంగం పరిస్థితులపై విడుదలైన తాజా గణాంకాలు ఒక కొత్త సంక్షోభాన్ని బయటపెట్టాయి. అది డ్రాపౌట్స్‌ కాదు, టీచర్ల కొరత కాదు, మౌలిక వసతుల సమస్య కూడా కాదు. అసలు సమస్య – పిల్లలే లేని పాఠశాలలు.

తాజా UDISE+ గణాంకాల ప్రకారం తెలంగాణలో ఏకంగా 2,245 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా నమోదు కాలేదు (గత సంవత్సరం). దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 70 శాతం తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం.

పాఠశాలలు ఖాళీ అవుతున్నాయా… గ్రామాలే ఖాళీ అవుతున్నాయా?… ఈ గణాంకాలను కేవలం విద్యా శాఖ వైఫల్యంగా చూడడం సరైంది కాదు. ఎందుకంటే దీని వెనుక చాలా పెద్ద సామాజిక మార్పు దాగి ఉంది.

గ్రామాల్లో జనాభా తగ్గుతోంది. ఉపాధి కోసం కుటుంబాలు పట్టణాలకు, నగరాలకు వలస వెళ్తున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాల సంఖ్య తగ్గుతోంది. ఒకప్పుడు గ్రామంలోని ప్రభుత్వ బడిలో చదివిన పిల్లల తల్లిదండ్రులే ఇప్పుడు తమ పిల్లలను పట్టణాల్లోని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు.

అంటే పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడం అనేది కేవలం విద్యా సమస్య కాదు. గ్రామీణ జీవన విధానంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతున్న పరిణామం.

ప్రభుత్వ బడులపై నమ్మకం తగ్గిందా?… గత రెండు దశాబ్దాల్లో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రైవేట్ విద్య వేగంగా విస్తరించింది. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన ఇంగ్లీష్ మీడియం విద్య ఇప్పుడు చిన్న పట్టణాలు, మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల వరకూ చేరింది.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడినా, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, మధ్యాహ్న భోజన పథకాలు ఉన్నా, చాలా మంది తల్లిదండ్రులు ఇంకా ప్రైవేట్ విద్యనే మెరుగైన ఎంపికగా భావిస్తున్నారు.

ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే, వాళ్ల కోసం ఏ కష్టం అయినా పడేందుకు సిద్ధపడుతున్నారు. ఫలితంగా గ్రామంలోని ప్రభుత్వ బడిని వదిలి, సమీప పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలను ఎంచుకుంటున్నారు.

జననాల రేటు తగ్గుదల ప్రభావమా? … ఈ పరిణామానికి మరో కారణం జనాభా ధోరణుల్లో వచ్చిన మార్పు. ఒకప్పుడు గ్రామాల్లో నాలుగు, ఐదు మంది పిల్లలు ఉండే కుటుంబాలు సాధారణం. ఇప్పుడు ఒకటి లేదా ఇద్దరు పిల్లలకే కుటుంబాలు పరిమితమవుతున్నాయి. జననాల రేటు తగ్గడం వల్ల పాఠశాల వయసు పిల్లల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది.

దీని ప్రభావం మొదటగా ప్రాథమిక పాఠశాలలపై పడుతోంది. అందుకే జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలల్లో ఎక్కువ శాతం ప్రాథమిక పాఠశాలలే ఉండటం గమనార్హం.

ఖాళీ బడుల భవిష్యత్తు ఏమిటి?… విద్యార్థులు లేని పాఠశాలలను కొనసాగించడం ప్రభుత్వానికి కూడా భారమే. భవన నిర్వహణ, సిబ్బంది నియామకం, ఇతర ఖర్చులు కొనసాగుతూనే ఉంటాయి. వేల మందికి జీతాలు తప్పవు, మరోవైపు పిల్లలున్న స్కూళ్లల్లో టీచర్లు సరిపోరు, కేసీయార్ పీరియడ్‌లో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది విద్యారంగమే…

అందుకే తెలంగాణ ప్రభుత్వం కొన్ని పాఠశాలలను సమీపంలోని ఇతర పాఠశాలల్లో విలీనం చేయడం, తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలను పరిశీలిస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరో చర్చకు దారితీస్తోంది.

ఎందుకంటే ఒకసారి బడి మూసివేస్తే, ఆ గ్రామం నుంచి విద్యా వ్యవస్థ పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో జనాభా పెరిగినా లేదా కుటుంబాలు తిరిగి వచ్చినా, పాఠశాలను మళ్లీ పునరుద్ధరించడం అంత సులభం కాదు.

అందుకని పాత మోడల్ పనికి రాదు, కొత్త మార్గాలు అన్వేషిద్దాం అంటున్నాడు రేవంత్ రెడ్డి… క్లస్టర్ స్కూళ్లు పెడదాం… నర్సరీ నుంచి ప్లస్ టూ దాకా… పొద్దున అల్పాహారం, మధ్యాహ్నభోజనం, సాయంత్రం సీఎస్ఆర్ నిధుల నుంచి ట్యూషన్లు… ఓ కొత్త తరానికి బాటలు వేద్దాం… ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు తోడు గురుకుల వ్యవస్థను పటిష్టం చేయడం కూడా… ఇదీ స్థూలంగా రేవంత్ రెడ్డి ఆలోచన సారాంశం…

విద్యపై వేసిన కమిషన్ సూచనలు కూడా అవే… ఐతే ఉంటాయి, రాజకీయ ప్రతిఘటనలు, గాయిగత్తరలు ఉంటాయి… టీచర్ల సంఘాల మొరాయింపులూ ఉంటాయి… కానీ ఎక్కడో ఓ చోట మార్పు మొదలు కావాల్సిందే… ప్రస్తుతం తెలంగాణలో 27 వేల ప్రభుత్వ స్కూళ్లుంటే విద్యార్థుల సంఖ్య 18 లక్షలు… శిక్షణ పొందిన టీచర్లుంటారు…

కానీ ప్రైవేటు స్కూళ్ల సంఖ్య 12 వేలు, విద్యార్థుల సంఖ్య మాత్రం 35 లక్షలు… (ఈ సంవత్సరం ప్రభుత్వ చొరవ పుణ్యమాని లక్ష మంది ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా చేరారు…) తేడా చూడండి… టెన్త్, ఇంటర్ ఫెయిలైన టీచర్లతోనూ ప్రైవేటు స్కూళ్లు కళకళలాడుతున్నాయి… ప్రభుత్వ స్కూళ్లు వెలవెలబోతున్నాయి…

ఎందుకు..? ఈ ప్రశ్నకు జవాబులు వెతుకుతూ కొత్త బాటలు పరవడమే పరిష్కారం… 2 వేల పైచిలుకు స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉంటే… పిల్లలున్న బడుళ్లో కూడా క్లాసుకు ఇద్దరు, ముగ్గురు ఉంటున్నారు… రేవంత్ రెడ్డి చెబుతున్నదీ ఇదే, ప్రస్తుత సిస్టం ఔట్ డేటెడ్… రేషనలైజేషన్ జరగాలి, 30 మంది ఉండాలి తరగతికి, ప్రతి సబ్జెక్టుకూ టీచర్ ఉండాలి… అందుకే క్లస్టర్ స్కూళ్లు బెటర్…

విద్యపై వేసిన కమిషన్ పలు దేశాలు తిరిగి నివేదిక ఇచ్చింది… మార్పు దిశలో ప్రభుత్వం రెడీ అయిపోయింది… కొందరు టీచర్లను సింగపూర్ పంపించారు అక్కడి విద్యాబోధన పరిశీలించి రమ్మని… రాబోయే రోజుల్లో దృశ్యం ఏమిటీ అంటే..? పిల్లాడిని బడిలో నర్సరీలో వేస్తే… ప్లస్ టూ దాకా… నో డ్రాపవుట్స్, రవాణా, తిండి అన్నీ సర్కారే… సంకల్పం మంచిదే, తెలంగాణ సమాజంలో చర్చ, మార్పు అవసరమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బడిని సమూలంగా మార్చేద్దాం..! రేవంత్‌రెడ్డి సంకల్పం భేష్… కానీ..?
  • ఐరాస భద్రత మండలిలో పాకిస్థాన్ – చైనా ఉమ్మడి భంగపాటు..!!
  • రేవంత్‌రెడ్డి కాళ్లల్లో కిషన్‌రెడ్డి కట్టెలు… తుమ్మడిహెట్టికి ప్లాన్-బి… ఇలా..!!
  • కమలహాసన్ – నాగ్ అశ్విన్… సింగీతం ఎదుట రెండు ఆశ్చర్యార్థకాలు…
  • ది డోపమైన్ ట్రాప్ … అవినీతి వైపు మనిషి పరుగులు దేనికి..?
  • TMC బండి నొగలు విరుగుతున్నయ్… ‘కర్మ’ ఎదురుతంతోంది…
  • అసలు హిట్లర్ ఎవరు..? BRS రచ్చకు శ్రీధర్‌బాబు భలే కౌంటర్…!
  • బొద్దింకలు అడిగాయని… ధర్మేంద్ర ప్రధాన్‌‌ను తప్పించడం పెద్ద పరీక్షే..!!
  • బండి ‘ఫ్లెక్సీలు’ సరే… తనను పదే పదే గోకి, గిల్లి, గిచ్చి, రక్కి రెచ్చగొట్టింది ఎవరు..?
  • మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions