Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆనందశాస్త్రం..! science of happiness … సిలబస్‌లో ఉండాల్సిన సబ్జెక్టు..!

September 9, 2025 by M S R

.

ఆనందం;
పరమానందం;
బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా – మనం లౌకిక అర్థమే తీసుకుందాం.

ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమకపడుతుంటాం. ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తుంటాం. జీవితం ఎప్పుడూ సరళరేఖ కానేకాదు . ఒకేవేగం , ఒకే పద్ధతిలో వెళ్ళదు . ఎగుడు దిగుళ్లు ; లాభనష్టాలు ; కష్టసుఖాలు సహజం . అయితే లాభమూ సుఖమూ ఆనందించదగ్గది – నష్టమూ కష్టమూ భరించకూడనిది అవుతుంది . ఇక్కడే వస్తోంది చిక్కంతా .

Ads

జీవితం సంక్లిష్టం కావాలని ఎవరూ కోరుకోరు . కానీ సంక్లిష్టమయినప్పుడు బయటపడడానికి , ఆ ప్రయత్నంలో ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నించేవారు తక్కువ .

ఆనందం దానికదిగా వస్తువు కాదు . మార్కెట్లో దొరకదు . ఆనందం అక్షరాలా మనం తయారుచేసుకునే పదార్థం . మనమే వెతికి పట్టుకోవాల్సిన వస్తువు . మనలోపలే ఉన్నా మనం లేదనుకుని వెతికే ఫీలింగ్ . ఒక అనుభూతి . ఒక మానసిక స్థితి .

మరి – మనలోపలే ఆనందం టన్నుల కొద్దీ ఉంటే మనకెందుకు కనిపించదు ? అనిపించదు ?

గెలుపు ఆనందం- ఓటమి బాధ . స్థూలంగా ఆనందానికి- బాధకు మన నిర్వచనం ఇది . లక్ష్యం , గమ్యం ఆనందం .
చేరేదారి, గమనం బాధ , నొప్పి , అసహ్యం , అసహనం , అసంతృప్తి .

గమ్యంతోపాటు గమనాన్ని , చేరే దారిని కూడా ఆనందించాలి , ప్రేమించాలి , అనుభవించాలి .

జీవితం చాలాసార్లు సవాళ్లు విసురుతుంది . ఇక మార్గమే లేనట్లుగా చేస్తుంది . బరువుగా మారుతుంది . దిగులుగా చేస్తుంది . నీరసపరుస్తుంది . నిస్పృహ నింపుతుంది . మొండిగా బండగా మారుస్తుంది . కానీ ఇలాంటి సమయాల్లో కూడా ఆనందాలను వెతుక్కోవాలి . అలవికాని ఆశలు , అంచనాలు , ఇతరులతో పోలిక , ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆందోళనలు వదిలేస్తే ఎన్నెన్నో ఆనందాలు కళ్ళముందే ప్రత్యక్షమవుతాయి .

బాధ – కృతజ్ఞత రెండూ ఒక ఒరలో ఒదగవు . చెప్పుల్లేనివాడు పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు . ఎవరూ ఓదార్చలేకపోయారు . అయితే రెండు కాళ్లు లేనివాడిని చూసేసరికి అతడి ఏడుపు ఆగిపోయింది . కాళ్లు లేనివాడిగురించి కన్నీళ్లు ఉబికాయి . ఇప్పుడు అతడిది బాధ కాదు , సహానుభూతి , సానుభూతి , పరిపక్వత . కాళ్లున్నందుకు ఆనందం , కృతజ్ఞత . అలా లేనివాటికంటే – ఎన్నో మనకున్నవాటికి ఎంత కృతజ్ఞతతో ఉండాలి మనం ?

చాలామంది డబ్బు , కార్లు , ఇళ్లు , విలాసాల్లో ఆనందం ఉందనుకుని వాటికోసమే ఆగని పరుగుల్లో ఉన్నారు . ఆ పరుగుల్లో నిజానికి ఆనందం తప్ప అన్నీ దక్కించుకుంటున్నారు . ఎంతో కష్టపడి , పరుగులుతీసి సంపాదించుకున్నవి ఎక్కడ పోతాయోనని బతికినంతకాలం బాధపడుతూ ఉంటారు . ఆశకు అంతే లేదు . చిన్న చిన్న బంధాలు , ప్రేమలు , స్నేహాలు , ఇష్టాలు , ఇచ్చిపుచ్చుకోవడాలు , చేతనయిన సాయం చేయడాల్లో అంతులేని ఆనందాలు దాగి ఉన్నాయి .

జీవితంలో బ్యాంక్ బ్యాలన్స్ , ఇతరసంపదలు పోగు చేసినట్లే – ఆనందం పోగుచేయడానికి ఏమి చేస్తున్నామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి . చేయకూడనివి ఏవి చేస్తూ ఆనందాలకు దూరమవుతున్నామో సమీక్షించుకోవాలి . చుట్టూ ఉన్న వాతావరణాన్ని , మనుషులను నిత్యం ద్వేషిస్తూ ఉంటే – ప్రతిఫలంగా ద్వేషమే వస్తుంది .

చాలా సార్లు పరిస్థితులను యథాతథంగా , లోతుగా కార్యకారణ సంబంధాలతో అర్థం చేసుకోవడమే ఆనందమవుతుంది . అర్థం కాకపొతే అదే అయోమయం , బాధగా మారుతుంది .

ప్రపంచం మన సంతోషాన్ని గుర్తించనప్పుడు-
అక్కినేని నోట ఆత్రేయ పలికించిన మాటలు ఉండనే ఉన్నాయి!

“నేను పుట్టాను- లోకం మెచ్చింది.
నేను ఏడ్చాను- లోకం నవ్వింది.
నేను నవ్వాను- ఈ లోకం ఏడ్చింది.
నాకింక లోకంతో పని ఏముంది?
డోంట్ కేర్…”

  • ఎవరి ఆనందం వారిది. అలాంటి ఆనందం అందరిదీ కావడానికి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆక్స్ ఫర్డ్ (యూ కె); ఎం ఐ టీ (అమెరికా); ఎరాస్మన్ (నెదర్లాండ్స్) సంయుక్తంగా ఆరు నెలలపాటు ఒక అధ్యయనం చేశాయి. సంతోషానికి- ఉత్పాదకతకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. ఉద్యోగులు ఆనందంగా పనిచేస్తున్నచోట ఓవర్ టైమ్ అవసరం లేకపోవడాన్ని కూడా ఈ పరిశోధన గుర్తించింది.

మేనేజ్మెంట్ విద్యలో ఆనంద శాస్త్రం (సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్) పాఠాన్ని 2019లో తొలిసారి ఇంగ్లాండ్ లో ప్రవేశపెట్టారు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా మిగతా యూనివర్సిటీలు కూడా అందిపుచ్చుకున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులతో పాటు ఎవరికైనా వర్తించే సానుకూల దృక్పథ సూత్రమిది. మంచిదే.

–పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!
  • … బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సైద్ధాంతిక గందరగోళం…
  • ఆనందశాస్త్రం..! science of happiness … సిలబస్‌లో ఉండాల్సిన సబ్జెక్టు..!
  • ఆ దరిద్రుడి పాత్రలో మోహన్‌లాల్… ఆ డార్క్ షేడ్స్ కథ తెలుసా మీకు..?!
  • ’’నా పిల్లల్ని అమెరికాలో పెంచుతున్నానా..? ఇండియాలోనా..?’’
  • అసలు కన్సల్టెన్సీ అనగానేమి..? నిజానికి అవి ఏమి చేయును..?
  • సొంత బిడ్డపై డర్టీ క్యాంపెయిన్… ఎందుకు కేసీయార్ సైలెంట్..?!
  • ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!
  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!
  • ఈ అందమైన అడవిపూల వెన్నెల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions