.
ఆ అక్రమార్కుడికి సెబీ మందలింపు సరే... మరి 40 వేల కోట్లు నష్టపోయిన వారి సంగతేమిటి ?
Jane అనే అమెరికా బ్రోకరేజ్ కంపెనీ 40 వేల కోట్ల స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ వార్త తెలుసు కదా ? ఎందుకు తెలియదు …? స్టాక్ మార్కెట్ కు సంబంధించి అతి పెద్ద తాజా కుంభకోణం …
Ads
- ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయవద్దు అని వార్నింగ్ ఇచ్చి తిరిగి ట్రేడింగ్ చేసుకో పో అని sebi తనకు అత్యంత భారీ తీవ్ర ఔదార్యంతో అనుమతి ఇచ్చింది . ఎంతైనా sebi ది తల్లి మనసు … కుమారుడు స్కూల్ లో గొడవ పడి వస్తే ఇంకోసారి అలా చేయవద్దు అని తల్లి మందలిస్తుంది కదా అచ్చం అలానే సెబీ మందలించింది …
హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకు బైక్ మీద వస్తే మాత్రం కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే హై … అని బాదుతారు… సరే, 40 వేల కోట్ల కుంభకోణం అనేది చిన్న విషయం కదా, అందుకే పెద్దగా పట్టించుకోదు వ్యవస్థ …
తల్లి కనీసం కొడుకు చెవులు మెలేస్తుంది . Sebi తల్లి ఆ మాత్రం కూడా చేయదు … మళ్ళీ ట్రేడింగ్ చేస్తా అని jane అడిగింది, sebi పెద్ద మనసుతో సరే బిడ్డా అంది … మీ తల్లి కొడుకుల అనుబంధం బాగానే ఉంది కానీ 40 వేల కోట్ల రూపాయలు నష్టపోయిన అనాథల్లాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ సంగతేమిటి ?
వంద కోట్ల కుంభకోణం కూడా కాని బోఫోర్స్ కుంభకోణం వల్ల దేశమే తలక్రిందులు అయింది . రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయాడు, చివరకు ప్రాణాలు కూడా కోల్పోయాడు… అలాంటి బోఫోర్స్ తో పొలిస్తే ఇది ఎన్ని వందల రేట్ల పెద్ద కుంభకోణం ..?
స్టాక్ మార్కెట్ అంటేనే ఇప్పటికీ చాలా మంది జూదం అనుకుంటారు … స్టాక్ మార్కెట్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటిది . అలాంటి మార్కెట్ ఊపిరి తీయాలని ప్రయత్నిస్తూ వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడే వారిని వదిలేయడానికి సెబీకి అత్యంత భారీ పెద్ద మనసు ఉండవచ్చు కానీ ఇది దేశానికి మంచిది కాదు …
స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ మెంట్ వేరు , ట్రేడింగ్ వేరు … యాప్ లో అకౌంట్ నుంచి స్టాక్ కొనడానికి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఓ హెచ్చరిక కనిపిస్తుంది . ట్రేడింగ్ లో 92 శాతం మంది నష్టపోతారు . జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తారు …
నిజానికి ఆ హెచ్చరిక చదివేంత ఓపిక కూడా రిటైల్ ఇన్వెస్టర్లకు ఉండదు . ఒకవైపు ఇలాంటి వార్నింగ్ లు, మరోవైపు వేల కోట్ల కుంభకోణంకు పాల్పడినా జానే దేవ్ బాల్‌కిషన్ అనే తేలికపాటి ధోరణి … 40 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే ఐదు వేల కోట్ల జరిమానా విధిస్తే ఏమవుతుంది … కుంభకోణానికి పాల్పడిన jane బాగానే ఉంది . సెబీకి ఐదు వేల కోట్లు వస్తాయి . మధ్యలో నష్టపోయింది సామాన్య ట్రేడర్స్ … రేయ్, రేయ్, నాశనమైపోతార్రా…
ఈమధ్య సెబీ కొత్త తరం వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది . టెక్నాలజీని ఉపయోగించుకొంటోంది . దానివల్ల ఇలాంటి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి . అంత వరకు బాగానే ఉంది కానీ వేల కోట్ల కుంభకోణాలపై చూసీచూడనట్టు వదిలేస్తే, దయ చూపిస్తే , మార్కెట్ మీద రిటైల్ ఇన్వెస్టర్లకు నమ్మకం పోతుంది . అది మార్కెట్ కే కాదు దేశానికి, అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిది కాదు……. – బుద్దా మురళి
Share this Article