.
. ( వాసిరెడ్డి శ్రీనివాస్ ) .. ….. దేశంలోనే తానే సీనియర్ అంటారు. ఎవరు తప్పు చేసినా సహించేది లేదు అంటారు. కానీ యాక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. మాటలు చూస్తే అసలు చంద్రబాబు ఇంత నిక్కచ్చిగా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. అసలు విషయం మాత్రం అలా సాగదీసి సాగదీసి అంతా మర్చిపోయేలా చేస్తారు.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నది కూడా అదే. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశంలోనే అత్యంత పవర్ ఫుల్ పారిశ్రామికవేత్తగా ఉన్న అదానీ కంపెనీకి భారీ ఝలక్ ఇచ్చారు. గ్లోబల్ టెండర్ల ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్నా కూడా … అధిక ధరల కారణంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ( ఏఈఎస్ఎల్) కు దక్కిన వేల కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ ను రద్దు చేశారు.
Ads
మళ్ళీ ఫ్రెష్ గా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. అదానీ కంపెనీ ఎల్ వన్ గా నిలిచినా రేట్లు ఎక్కువగా ఉన్నాయని భావించి తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ తాజాగా ఈ రద్దు నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులోని ఎనిమిది జిల్లాల్లో 82 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. ఇందులోనే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ దక్కించుకుంది. అదానీ కంపెనీలు ఇండియాలో అధికారులకు ముడుపులు ఇచ్చి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటుంది అంటూ అమెరికా కోర్ట్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలను కంపెనీ తోసిపుచ్చుతున్నా కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సోలార్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సెకి) తో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది అని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా… అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రకటించారు.
ఈ ఒప్పందాలను రద్దు చేయాలని ఎన్ని డిమాండ్స్ వచ్చినా సరే చంద్రబాబు స్పందించటం లేదు. ఎప్పటిలాగానే అన్ని అంశాలను పరిశీలించి తగు నిర్ణయం అంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు పెట్టాయి… వాటిని ప్రభుత్వం కూడా ఆమోదించింది.
అయినా సరే చంద్రబాబు మాత్రం ఇంకా ఈ విషయంలో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారం పడుతుంది అని చెప్పి కూడా చంద్రబాబు అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే… మరోవైపు పక్కనే ఉన్న తమిళనాడు సీఎం మాత్రం ప్రజలపై భారం పడనీయకూడదు అని ఎల్ వన్ గా ఉన్న టెండర్ ను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం ఆసక్తి రేపుతోంది.
స్టాలిన్ తాజాగా నిర్ణయంతో మరోసారి చంద్రబాబు ఇరకాటంలో పడినట్లు అయింది అనే చెపుతున్నారు. చంద్రబాబు తీరు చూసిన వాళ్ళు ఎవరూ కూడా సెకితో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తారు అని భావించటం లేదు. ఎందుకంటే ఈ విషయంలో తెర వెనక జరగాల్సిన వ్యవహారాలు అన్ని జరిగిపోతున్నాయి అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.
ఒకవైపు జగన్ కు ఇదే ఒప్పందంలో 1750 కోట్ల రూపాయలు ముడుపులు దక్కాయని ఆరోపిస్తూ… అదే ఒప్పందాన్ని చంద్రబాబు కాపాడటానికి ప్రయత్నం చేయటం ఈ మొత్తం ఎపిసోడ్ లో హై లైట్ గా చెప్పుకోవచ్చు అని ఆ అధికారి అభిప్రాయపడ్డారు…
Share this Article