.
ఒరేయ్… మెదడు మోకాళ్లలో ఉందారా..? ఈ తిట్టు కోట్లసార్లు విన్నదే కదా తెలుగునాట… ఎవడికైనా బుద్ది పనిచేయడం లేదా అని తిట్టాలంటే ఇదే… పదే పదే…
అంటే మెదడు జారీ జారీ మోకాళ్లలోకి చేరిపోయింది కదా అని వెక్కిరింపు, తిట్టు… కొందరైతే పాదాల్లోకి మెదడు దిగిపోయిందా అని కూడా తిడతారు… అది ఇంకాస్త తీవ్రత…
Ads
మెదడు- మోకాలి సంబంధం తెలియదు గానీ… కాళ్ల కండరాలకూ హృదయానికీ,… అదేనండీ గుండెకు చాలా సంబంధం ఉంది, జాగ్రత్త అంటున్నారు ఇప్పుడు కార్డియాలజిస్టులు… నిజమండీ బాబూ….
“మనకు ఒకే హృదయం లేదు… రెండున్నాయి… ఒకటి ఛాతీలో ఉంటుంది… మరొకటి కాళ్ల కండరాల్లో ఉంటుంది…” అంటున్నాడు… ఇది బలహీనమైతే ఏమవుతుంది..? అంటే కాళ్ల కండరాలు…
ఇప్పటి ఆధునిక జీవనశైలి కాళ్ల కండరాలను నాశనం చేస్తోందని ఆయన హెచ్చరిస్తున్నాడు… అనగా రెండో గుండెకు ప్రమాదం అని… గంటల తరబడి కూర్చోవడం, తక్కువ నడక, వయసుతోపాటు వచ్చే మజిల్ లాస్… ఇవన్నీ “రెండో హృదయాన్ని” బలహీనపరుస్తాయి… దాంతో మొదటి హృదయం ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది…
ఇదీ విశ్లేషణ… అవునూ, బలహీనమైతే ఏమవుతుంది?
రక్తప్రసరణ నెమ్మదిస్తుంది… కాళ్లు, పాదాల్లో వాపు వస్తుంది… రక్తపోటు పెరుగుతుంది… గుండు వైఫల్యం ముప్పు పెరుగుతుంది… “దీనికి మందుల ఉపయోగం ఉండదు” అని సదరు డాక్టర్ హెచ్చరిస్తున్నాడు…
పరిష్కారం ఒక్కటే…
“మూవ్ అవ్వండి! రోజూ నడవండి. ఆఫీసులో కూర్చున్నప్పుడే heel raises చేయండి. లిఫ్ట్‌కి బదులుగా మెట్లు ఎక్కండి. మీ కాళ్ల కండరాలను బలంగా ఉంచుకోండి” అని యారనోవ్ సలహా ఇస్తున్నాడు…
అంటే తను చెప్పదలుచుకున్నది ఏమిటంటే…? “ఒక హృదయం బలహీనపడితే… మరొకటి మూల్యం చెల్లించుకోవాలి… ఆలస్యం చేయకండి – ఇప్పుడే మొదలు పెట్టండి… మీ భవిష్యత్తు మీకు ధన్యవాదాలు చెబుతుంది…” అని ఆయన సందేశం…
ఇంకా సింపుల్‌గా చెప్పాలా..? ఒరేయ్, మీ గుండె అంటే రక్తాన్ని ప్రతిక్షణం పంప్ చేసే ఏకైక యంత్రం కాదురా… మోకాలి కింద కండరాలు కూడా గుండెలాంటివే… రక్తప్రసరణను అవీ డిసైడ్ చేస్తాయి, జాగ్రత్త… కాస్త అటూ ఇటూ నడుస్తూ, వాటిని ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తుండండి… లేకపోతే చచ్చి ఊరుకుంటారు అని..!!
Share this Article