పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఫైర్..! అంటాడు కదా ఫస్ట్ పార్టులో… తగ్గేదేలా అంటాడు కదా… సెకండ్ పార్ట్‌ను, అంటే అందులో హీరోయిజాన్ని అంతకుమించి చూపించాలి కదా… లేకపోతే మన జనం ఒప్పుకోరు కదా… అసలే హీరోలు అంటే దేవుడి అంశలు… ఎహె, కాదు, దేవుళ్లే… దేవుళ్లను మించి…
ఇప్పుడిక పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా..? సునామీ అనాలేమో..! అనాలి మరి… అయ్యో, హీరో పాత్ర జేబు దొంగ కదా, కలప స్మగ్లర్ కదా, సొసైటీకి అన్‌వాంటెడ్ కదా, ఈ గ్లోరిఫికేషన్ సబబా అనే పిచ్చి సందేహాలతో ఊరుకోలేం కదా… కీర్తించాలి… ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తి చేయించాలి కదా… అప్పట్లో వామనుడు ఒక కాలితో భూమిని, మరో కాలితో గగనాన్ని కప్పేస్తాడు కదా… తెలుగు హీరో అంటేనే వామనుడిని మించి…
అందుకే రెండో పుష్పలో హీరోను స్తుతించే తాజా పాటలో అచ్చంగా అవే వాక్యాలు… ‘నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలె, నిన్ను కొలవాలంటే ఇంకా సముద్రం లోతే తవ్వాలె’ అన్నాడు చంద్రబోస్… తెలుగు జనానికి, ఇండియా సినిమాకు మళ్లీ ఆశ పుడుతుంది… చంద్రబోస్‌కు మరోసారి ఆస్కార్ వస్తుందని బలంగా అనిపిస్తోంది…
Ads
నాటు నాటు వంటి నాటు పాటకే ఆస్కార్ కొట్టినోడు ఈ ఖగోళ కీర్తనకు ఆస్కార్ కొట్టలేడా ఏం..? రాజమౌళి కొడుకు కార్తికేయ వంటి ఎపీషియెంట్ మేనేజర్ ఎలాగూ బాటలు వేశాడు కదా ఆస్కార్ స్టేజీ మీదకు… మరో కార్తికేయ దొరక్కపోడు సుకుమార్‌కు… మొన్న కీరవాణికి, ఈసారి డీఎస్పీకి… రెండుసార్లూ చంద్రబోస్‌కు… తెలుగు సినిమా అన్నమయ్యకు ఆమాత్రం కీర్తి సబబే మరి…
ఏమో చెప్పలేం… మొన్న జాతీయ అవార్డు… ఈ దెబ్బకు ఆస్కార్ కూడా నడిచొస్తుందేమో బన్నీకి… తాను మామూలు హీరో కాదుగా… గడ్డం అట్టా సవరిస్తా ఉంటే దేశం దద్దరిల్లిందట… భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్ధలైందట… పెద్ద గద్దలాగా మబ్బులపైన హద్దుదాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ల కింద కురిసేయదా… ఇవన్నీ చంద్రబోసే చెప్పాడు… సుకుమార్ ఆదేశించాడు, చంద్రబోస్ పాటించాడు…
వర్షం తలవంచడం ఏమిటి..? కాళ్ల కింద కురిసేయడం ఏమిటి…? అనేవి పిచ్చి ప్రశ్నలు… చంద్రబోస్ సాహిత్యమైనా అంతే… దాన్ని పొగడాలంటే ఆకాశం ఎత్తు పెరగాలి, సముద్రం లోతు తవ్వాలి… మరి ఆస్కార్ ఊరకే వస్తుందేటి..? అదేమైనా ఎర్రచందనం చెట్లు కొట్టడమా..?
‘వణుకు రాదు, వోటమి రాదు, వెనకడుగు, ఆగడమూ అసలు రానే రాదు, భయమే లేదు, బెంగే లేదు, ఎదురు తిరుగే లేదు…’ అట… మా హీరో కన్నెర్ర చేస్తే సౌర కుటుంబమే దద్దరిల్లు, సూర్యుడే తెల్లబోవు, పాలపుంతే అదిరిపోవు, చుక్కలన్నీ రాలిపోవు అనే రేంజుకు చంద్రబోస్ కలం ప్రజ్వరిల్లి… మూడో ఆస్కార్ కోసం అప్పుడే కొత్త కక్ష్యను ఏర్పాటు చేసుకోవాలని అభిలషిస్తూ..!
అవునూ… మోడీకి అప్పుడప్పుడూ బుర్ర పనిచేయదు… 2027 నాటికి ఇండియా ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటూ కలవరిస్తూ ఉంటాడు గానీ… ఈ సుకుమార్‌ను పిలిచి ఆర్థిక శాఖ అప్పగిస్తే పోదా..? ఫైవ్ ట్రిలియన్ ఏంటి..? ఓ హండ్రెడ్ ట్రిలియన్ దాటించడా ఏమిటి ఎర్రచందనం దుంగలతో..?! అస్సలు తగ్గేదేలా..!!
Share this Article