Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యద్దనపూడి నవల అంటేనే పడవ కారు, రాజశేఖరం… ఈ సినిమాలాగే…

September 5, 2024 by M S R

జల్సా జల్సాగా తిరిగే పడవ కారు రాజశేఖరం- అతి ఆత్మాభిమానం , తిక్క , అంతలో రాజీపడి జారిపోయే జయంతిల సినిమా సెక్రటరీ . 1964-66 లో ఆంధ్రదేశంలో జ్యోతి మాస పత్రికలో సీరియల్ గా , మహిళాలోకాన్ని ఉర్రూతలూగించిన నవల . యద్దనపూడి సులోచనారాణి మొదటి నవల కూడా .

నవలలో పండించిన ఎమోషన్సుని , మలుపులను సినిమాకరించటం అంత సులువు కాదు . కాదు అని కూడా రుజువు చేసిందీ సినిమా . సూపర్ డూపర్ హిట్ ప్రేమనగర్ కాంబినేషనే ఈ సినిమాకూ పనిచేసింది . బహుశా ఆ కంపేరిజన్ కూడా ఈ సినిమా కాస్త మందంగా ఆడటానికి కారణం అయి ఉండవచ్చు . రెండు సినిమాలు కాస్త ఒకేలా ఉండటం . రెండింటిలోనూ హీరోయిన్ సెక్రటరీ కావటం , రెండింటిలోనూ హీరో జల్సారాయుడు కావటం వంటి కామన్ లక్షణాలు కూడా కారణం కావచ్చు .

అయిననూ అందమైన సినిమాయే . వాణిశ్రీని కె యస్ ప్రకాశరావు చూపినట్లు ఎవరూ చూపలేరేమో ! ప్రేమనగర్లో లాగానే ఈ సినిమాలో కూడా వాణిశ్రీని అజంతా , ఎల్లోరా శిల్పంలాగా చూపారు కొన్ని సీనుల్లో . వాణిశ్రీ చీరెల్ని సెలెక్ట్ చేసిన వారిని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి . డార్క్ కలర్లు కాకుండా లైట్ కలర్ చీరెల్లో కూడా అందంగా చూపవచ్చని , అందుకు వాణిశ్రీ తగునని చక్రవాకం , ఈ సెక్రటరీ సినిమాలు చెపుతాయి .

Ads

ఇక అక్కినేని . ఆయనకు ఈ పడవ కారు రాజశేఖరం పాత్ర child’s play . ఇలా ఆడపిల్లలకు లైన్ వేయటం , బీట్ కొట్టడం వంటి పాత్రల్లో దిట్ట కదా ! అయితే , ప్రేమనగర్లోలాగా తన ప్రతిభను చూపించే పాత్ర కదు . అయినా పాత్ర ఆశించిన మేరకు బాగా నటించారు . Too many characters సినిమాలో . అన్ని పాత్రల మధ్యలో అసలు పాత్రలు సన్నబడ్డాయని కూడా అనిపిస్తుంది .

జయసుధ , చంద్రమోహన్ , శాంతకుమారి , రంగనాథ్ , కృష్ణకుమారి , కాంచన , గిరిజ- సత్యనారాయణ , గుమ్మడి- హేమలత , సూరేకాంతం , మమత , రమాప్రభ- రాజబాబు , ధూళిపాళ , అన్నపూర్ణ , అల్లు రామలింగయ్య , సత్యేంద్రకుమార్ . సినిమా ఫీల్డులో ఉన్న అతిరధ మహారధులు అందరూ కనిపిస్తారు . Overcrowding .

మాటలు- పాటలు ఆత్రేయ గారివి . సంగీతం కె వి మహదేవన్ . మాటలు ఓ మాదిరిగా మాత్రమే పేలాయి . పాటలన్నీ థియేటర్లో బాగుంటాయి . కొన్ని బయట కూడా హిట్టయ్యాయి . *నా పక్కన చోటున్నది ఒక్కరికే* అనే పాటలో సూరేకాంతం కూడా అక్కినేనితో యుగళ స్టెప్పులు వేస్తుంది . *మొరటోడు నా మొగుడు* పాటలో దసరా బుల్లోడులోని *పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల* పాట గుర్తుకొస్తంది . అలాగే నటించారు ANR , వాణిశ్రీలు . *నేటిదా ఒక నాటిదా* పాట కూడా బాగానే ఉంటుంది .

చంద్రమోహన్- జయసుధల *చాటు మాటు సరసంలో ఘాటు ఉన్నది* అనే పాట బయట కూడా బాగా హిట్టయింది . విషాద గీతాలు రెండూ బాగుంటాయి . *మనసు లేని బ్రతుకొక నరకం* , *పెదవి విప్పలేను* పాటలు . పిల్లల మీద పాట *ఆకాశమంత పందిరి వేసి* బాగుంటుంది . పాటలన్నీ సుశీలమ్మ , బాలసుబ్రమణ్యం , రామకృష్ణ పాడారు .

అక్కినేని గుండె ఆపరేషన్ తర్వాత నటించిన సినిమా ఇది . తన స్వంత అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించిన మొదటి సినిమా కూడా . సెకండ్ ఇన్నింగ్స్ . ఆరు సెంటర్లలో షిఫ్టింగులు లేకుండా వంద రోజులు ఆడింది . ఈ సినిమాలో టైటిల్స్ వెరైటీగా వేసారు . నటీనటుల పేర్లను వేయకుండా వాళ్ళ పాత్రల పేర్లను ఫొటోలతో వేసారు . ఓ కొత్త ప్రయోగం .

వాణిశ్రీ కోసం చాలాసార్లు చూసాను . వాణిశ్రీ , అక్కినేని అభిమానులు ఎవరయినా చూడనివారుంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . వాణిశ్రీ మహిళా అభిమానులు వాణిశ్రీ చీరెలను చూస్తానికయినా మరోసారి చూడవచ్చు . అందరూ ఆమెను నవలా నాయకి అంటారు . నేనయితే నవలా షీరో అంటాను . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు  ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions