రాజద్రోహం..! ఐపీసీ 124ఏ సెక్షన్… అధికారంలో ఉన్నవాళ్లపై ఎవరు పల్లెత్తు మాట మాట్లాడినా సరే ఈ కేసులు ఎడాపెడా పెట్టేస్తున్నారు తెలుసు కదా… చివరకు జర్నలిస్టులు, పత్రికలు, టీవీలపై కూడా… అసలు రాజు ఎవరు..? ప్రజాస్వామిక వ్యవస్థలో రాజు అంటే ప్రభుత్వమా..? కుర్చీల్లో ఉన్న వ్యక్తులా..? వాళ్ల పాలసీలా..? ఇదొక చిక్కు ప్రశ్న… ఆమధ్య జర్నలిస్టు వినోద్ దువాపై పెట్టిన రాజద్రోహం కేసును కొట్టేసింది కోర్టు… అసలు ఈ సెక్షనే దుర్మార్గం అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు కొత్తగా పోరాటం అందుకున్నాడు… అంతేకాదు, ఏబీఎన్-టీవీ5 చానెళ్లు సుప్రీంను ఆశ్రయిస్తే, ఈ కేసులను పెట్టడంపై వ్యతిరేకంగా రియాక్టయిన సుప్రీం ఈ సెక్షన్ వాడకం ఏమిటో తేల్చేస్తామంటూ మొన్నామధ్య చెప్పింది… ఇంత గొడవ జరుగుతోంది కదా… ఇప్పుడు ఓ సినిమా నటి కమ్ నిర్మాత కమ్ దర్శకురాలిపై లక్షద్వీప్ పోలీసులు తాజాగా రాజద్రోహం కేసు పెట్టేశారు…
ఆమె పేరు ఆయేషా సుల్తానా… అదే లక్షద్వీప్‌కు చెందిన చట్లాట్ ద్వీపవాసి ఆమె… మొదట మోడల్… తరువాత సినిమా నటి… నిర్మాత, దర్శకురాలు… మళయాళం ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటుంది… ఈమధ్య మీడియావన్టీవీ చానెల్లో ఓ డిస్కషన్లో పాల్గొన్న ఆమె… లక్షద్వీప్ ప్రజలపై మోడీ ప్రభుత్వం ప్రఫుల్ పటేల్ అనే అడ్మినిస్ట్రేటర్‌ను ఓ జీవాయుధంగా ప్రయోగించిందని వ్యాఖ్యానించింది… ఈ పటేల్ రాకముందు ఒక్క కరోనా కేసు కూడా లేదు, ఇప్పుడు రోజుకు వంద కేసులు నమోదవుతున్నాయి… సహజంగానే ఆమె వ్యాఖ్యలు కేరళలో చిచ్చు రగిల్చాయి… పలుచోట్ల ఆమె మీద పోలీసులకు ఫిర్యాదులు చేశారు బీజేపీ నాయకులు… లక్షద్వీప్ బీజేపీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హజీ ఫిర్యాదు మేరకు కవరత్తి పోలీసులు ఆమె మీద రాజద్రోహం, రెచ్చగొట్టే ప్రసంగాల కేసులు పెట్టేశారు…
Ads
వ్యవహారం ముదురుతుందని తెలిసి… తన వ్యాఖ్యల్ని సమర్థించుకునే పనిలో పడింది… ‘‘నేను కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు… ఈ పటేల్ విధానాలను, నిర్ణయాలను, దానివల్ల లక్షద్వీప్ ప్రజలకు జరిగే నష్టాలను విమర్శిస్తున్నాను… అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన్ని జీవాయుధం అని గాకుండా ఇంకేమని పిలవాలి..?’’ అని ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టింది… ఓ విఫల సమర్థన… ఆమె తిట్టిపోసింది కేంద్రాన్నే… కానీ తన వ్యాఖ్యల్లో రాజద్రోహం సెక్షన్లు పెట్టాల్సినంత తీవ్రత ఏముంది..? ఆమె జనాన్ని తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నదా..? లేదు కదా..! అడ్మినిస్ట్రేటర్ నిర్ణయాల్ని సర్కాస్టిక్‌గా ఒకే ముక్కలో ఎండగట్టింది… లక్షద్వీప్‌లో వేల మంది, కేరళలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు కూడా వ్యతిరేకిస్తున్నారు… ఈమె ఒక్కతే కాదు కదా…
ఇదుగో ఇలా… ఓ సీరియస్ సెక్షన్‌ను ఎడాపెడా వాడేస్తూ, బెదిరిస్తూ, దుర్వినియోగం చేయడం వల్లే… వాటిపై వ్యతిరేకత పెరుగుతోంది… పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రంలాగా… సాఫ్ట్ టార్గెట్ల మీద ఈ రాజద్రోహం కేసులు వాడేయడం ఏమిటో… పైగా ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకించడం రాజద్రోహం అవుతుందా..? అలాగయితే ప్రతి ప్రతిపక్ష నాయకుడి మీద ఎన్ని వేల కేసులు పడాలి..? పత్రికలు, టీవీల, సోషల్ యాక్టివిస్టుల మీద ఎన్ని సెక్షన్లు బనాయించబడాలి..? అందుకే ఈమె మీద పెట్టిన రాజద్రోహం సెక్షన్ల పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది… నెటిజనులు ఈ కేసుల్ని వాడుతున్న తీరును బాగా తప్పుపడుతున్నారు… ఫిర్యాదు రావడమే ఆలస్యం, పోలీసులు ఆ సెక్షన్ పెట్టేసి, కోర్టులో కొట్లాడుకోఫో అనేస్తున్న తీరు మీదా సుప్రీంకోర్టు విచారిస్తే బాగుంటుందేమో…!!
Share this Article