Sai Vamshi…. తూర్పు కశ్మీర్‌లోని బండిపోర్ జిల్లా నైద్‌కయ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల జరీఫా జాన్ గురించి మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు? ఏమిటి ఆమె ప్రత్యేకత?
సూఫీ కవిత్వం రాయడంలో ఆమె ప్రసిద్ధురాలు. అదేం గొప్ప? ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. ఆమె రాతలేం ప్రత్యేకం? ప్రత్యేకమే! ఆమెకు చదువు రాదు. చదవడం, రాయడం తెలియదు. అయినా కవిత్వం రాసేందుకు తన కోసం కొత్త భాష కనిపెట్టారు. కాగితంపై కలంతో సున్నాలు చుడుతూ కవితలు, పాటలు రాస్తున్నారు. ఆ కవిత్వం ఆమె మాత్రమే చదవగలరు. ఆమె మాత్రమే చెప్పగలరు. ఆ గుండ్రటి చిహ్నాల ద్వారా ఆమె రాసే కవిత్వం స్థానికంగా ప్రత్యేకత సంతరించుకుంది. మరెవరూ గుర్తించలేని భాషలో రచనలు చేస్తున్న ఏకైక భారతీయ కవయిత్రి ఆమె.
కవితలు రాయాలన్న ఆలోచన ఆమెకు ఎలా వచ్చింది? దానికి వెనుక ఉన్న కథ విశిష్టమైనది. ఒక రోజు తన ఇంటికి సమీపంలోని ఒక వాగులోంచి నీళ్లు తేవడానికి వెళ్లారు జరీఫా. ఆ సమయంలో ఆమెను ఏదో ఒక మానసిక స్థితి కమ్మేసింది. తిరిగి యథాస్థితికి వచ్చిన తర్వాత ఆమె నోటి వెంట ఓ గజల్ వచ్చింది. దాన్ని రాసేందుకు ఆమెకు చదువు రాదు. అందుకోసం సొంతంగా గుండ్రటి చిహ్నాల భాష కనిపెట్టారు. తనే ఆ భాషను అభివృద్ధి చేసుకున్నారు.
గతంలో ఆమె కోడింగ్‌లో రాసే కవిత్వాన్ని ఆమె కూతురు ఉర్దూ & కాశ్మీరీ భాషల్లో రాసేవారు. ఆరేళ్ల క్రితం ఆ కూతురు మరణించిన తరువాత జరీఫా కేవలం తన చిహ్నాల భాషకే పరిమితమయ్యారు. ఎక్కడా చదువుకోకపోయినా తన కోడింగ్ భాషలో ఆమె నిష్ణాతురాలు. ఇప్పుడు రాసిన కాగితంలోని చిహ్నాలను మరో నెల తర్వాత చూపినా తడుముకోకుండా ఇవాళ ఏం చెప్పారో అదే చెప్తారు. అలా కొన్ని వందల కవితలు ఆమె వద్ద ఉన్నాయి. వాటిని ఆమె తప్ప మరెవరూ చదవలేరు. చిన్ననాటి నుంచి బడికి వెళ్లని జరీఫా కశ్మీర్ Cultural and Science Foundation ఉపాధ్యక్షురాలు. కశ్మీర్ రాష్ట్రానికి చెందిన రచయిత్రిగా ఆమెకు చాలా పేరుంది. స్థానిక సాహిత్య సంస్థలు ఆమెను విశేషంగా గౌరవిస్తాయి.
తన 40వ ఏట జరీఫా చిహ్నాలతో కవిత్వం రాయడం మొదలుపెట్టారు. అలా రాసే శక్తి ఆమెకు ఎలా వచ్చిందనే విషయంపై చాలామందికి చాలా అంచనాలున్నాయి. అయితే అదంతా దైవదత్తం అంటారామె. దేవుడి గురించిన భావనను వెల్లడించే ప్రయత్నంలో ఆ చిహ్నాలు తమంతతాముగా వస్తాయంటారు. రాసేటప్పుడు తనకు తెలియకుండానే ఒకలాంటి మానసిక స్థితి (ట్రాన్స్)లోకి వెళ్లిపోతానంటారు.
“ఈ సృష్టిలో అందరూ చావును చవిచూడాల్సిందే! మరణానికి ముందే ఏదైనా సాధించాలి” అంటారు జరీఫా. “తొందరెందుకు నీకు? నీ గురించి ఆలోచించుకో ముందు! ఏదేమైనా సరే.. ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం మరిచిపోకు” అనేది ఆమె రాసిన ఒక కవితా పంక్తి. “దేవుణ్ణి తలచుకుంటూ ఉండండి. ఇతరులతో మర్యాదగా ప్రవర్తించండి” అనేది ఆమె ఇచ్చే సార్వజనీన సందేశం. ఆమె రాసిన 300 కవితల్ని కాశ్మీరీ భాషలో పుస్తకంగా తెచ్చేందుకు ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు… – విశీ
Share this Article