తెలుగు, తమిళం…. సో కాల్డ్ కమర్షియల్ సినిమా అనగానే ఓ రోగం హఠాత్తుగా కమ్మేస్తుంది… ఏ దర్శకుడైనా సరే, ఫ్యాన్స్ గురించే ఆలోచించాల్సి వస్తుంది.. ఇది వేక్సిన్ లేని ఇన్ఫెక్షన్… దీనికి సింపుల్ పరిష్కారం, సదరు హీరో తన ఇమేజీకి మాస్క్ కట్టేసుకుని, తనను తాను దర్శకుడికి అప్పగించుకోవాలి… లేకపోతే ఏమవుతుంది..? హాస్పిటల్ ఐసీయూలో ఆక్సిజన్ మాస్క్ కట్టుకుని కనిపిస్తారు… ఏ స్టార్ హీరో దీనికి మినహాయింపు కాదు… ఫాఫం, తమిళ హీరో విజయ్ ఎంత..?
లోకేష్ కనకరాజ్ అనే దర్శకుడున్నాడు తమిళంలో… కాస్త బుర్ర ఉన్నవాడే… కానీ విజయ్ తను ఫాల్స్ ఫ్యాన్స్ ఇమేజీ బందిఖానా నుంచి బయటపడకపోవడంతో వచ్చింది తిప్పలు… ఇదుగో ఈ ఫోటోలో చూపినట్టు తనను తాను ఉల్టా కాల్చుకున్నట్టయింది… ఐనా హీరోయే ఓ ఊర మాస్ కటకటాల్లో బందీ అయిపోతే పదిమంది మణిరత్నాలు కూడా కాపాడలేరు.,.
Ads
అసలే మూడు గంటల సినిమా… అంతసేపు ఎవరు చూస్తరుర భయ్…? అందులోనూ సగంసేపు మొత్తం హీరో బిల్డప్పేనాయె… ఆరె, ఓ దేడ్ దిమాక్… ఒక్క పంచ్ డైలాగ్‌తో హీరో ఇంట్రడక్షన్, కేరక్టర్ ప్రేక్షకులకు తెలిసిపోవాలి… అదీ ట్రెండ్… ఈ దిక్కుమాలిన సౌతిండియా సినిమాలో ఈ బిల్డప్పు సాంగ్స్, సీన్స్ సగం సినిమాను చెడగొడతాయి… విజయ్ నటించిన తాజా సినిమా మాస్టర్ కూడా అంతే… బిల్డప్, బిల్డప్…
ఫ్యాన్స్ ఈలలు, చప్పట్లు…. మితిమీరిన వ్యక్తిపూజ… దర్శకుడు సినిమా తీస్తున్నాడా..? విజయ్ను గుడిలో పెట్టి పూజలు చేస్తున్నాడా అన్నట్టుగా..! ఓ కాలేజీ ప్రొఫెసర్‌ను ఫుల్లు తాగుబోతుగా చిత్రీకరించడంతోనే పాత్రోచిత్యం మొదట్లోనే దెబ్బతింది… దానికి కారణాలూ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు, విద్యార్థులు తనను ఎందుకంత ప్రేమిస్తారో అస్సలు ఎస్టాబ్లిష్ కాలేదు… దాంతో సినిమా సగం మటాష్ అయిపోయింది… కేవలం బిల్డప్పులతో సినిమా నడవదు అని ఈ అదిరింది, విజిల్ వంటి సూపర్ ఫ్లాప్ సినిమాల హీరోకు ఇప్పటికైనా అర్థం కావాలి… లేకపోతే మరో సర్దార్ గబ్బర్‌సింగ్, మరో అజ్ఞాతవాసి కావడం ఖాయం…
నిజానికి సినిమాలో, ఉన్నంతలో విజయ్ సేతుపతి పాత్ర బెటర్… ఆ పాత్రలో సేతుపతి ఒదిగిపోయాడు… విజయ్ను డామినేట్ చేశాడు… సేతుపతి వంటి విలన్‌ను పెట్టుకున్నప్పుడు హీరో పాత్రధారి ఒకటికి పదిసార్లు తన కేరక్టర్ సరిచూసుకోవాలి… కానీ పంచ్ డైలాగులు, రివర్స్ స్టెప్పుల్లో పడి విజయ్ దాన్ని ఇగ్నోర్ చేశాడు… అసలే ఇది తెలుగులో విడుదల చేశారూ అంటే జస్ట్, డబ్బుల కోసం… అంతా అరవ వాసన గుప్పుగుప్పు… ఆ హీరోయిన్ ఎందుకున్నదో తెలియదు… అవి ఏ భాషలో పాటలు ప్రపంచంలోనే ఎవరికీ అంతుపట్టవు… అర్థం కావు… ఆ ట్యూన్లలో ఇరికించిన పదాలు, వాక్యనిర్మాణం, అర్థాలపై పదీపదిహేను పీహెచ్‌డీలు వీజీగా చేయవచ్చు… అంతేలే, ఒకసారి ఢమాల్ అని కిందపడితే గానీ ఇలాంటి హీరోలకు, ఇలాంటి దర్శకులకు తత్వం బోధపడదు…! మంచి పాఠమే ప్రొఫెసర్ సాబ్…!!
Share this Article