Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తన పాటల్లో వ్యంగ్యాన్ని, హాస్యాన్ని కలిపికొట్టేవాడు… అవి ఛెళ్లున తగిలేవి…

March 2, 2023 by M S R

Sankar G ………  జానపద పాటల రారాజు కొసరాజు …. కొసరాజుగారు ఫెళ్లుమని నవ్వితే, ఆ నవ్వు ఆయన కంఠాన్ని మించిపోయి వుండేది. నిత్యం రైతువేషమే. తెల్లటి ఖద్దరు, నల్లటి గొడుగుతో సౌమ్యభాషణతో కనిపించేవారు కొసరాజుగారు. ఆయనకు జానపద వరసలు తెలుసు గనక, అలాంటి వరసల్లోనే పాటలు రాసి, తన వరసలోనే పాడితే, కొందరు సంగీత దర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దడం కూడా వుండేది.

ఈయన సిగరెట్టు మీద రాసిన “సరదా సరదా సిగరెట్టు” అనే పాట ఇలాటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. దాన్లో పొగతాగితే “ఊపిరితిత్తుల కేన్సర్‌ కిదియే కారణమన్నారు డాక్టర్లు” అని ఒక పాత్ర అంటే రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు సిగరెట్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వటం, సినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని గ్లామరైజ్ చెయ్యటం, మీద విసిరిన మంచి చెణుకు. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర “థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర “కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన జోక్ వెయ్యటం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది.

అలాగే పేకాట గురించిన పాట “అయయో చేతులొ డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే” అనేది కరుణ, హాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెల్వవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదువబెట్టవచ్చు, ఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆక్కుండా, “పోతే?” అనే సందేహం, దానికి “అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్‌.

Ads

ఇలాటిదే మరో ఇల్లరికం అల్లుడి మీద పాట “భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే” అనేది. దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ “జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడి, దూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కటి ప్రయోగం.

ఈ కోవలోదే మరో పాట “చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అనేది. దీన్లో జనానికి, దేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర “బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను, చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది.

మొత్తం మీద ఇలాటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచి చూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది. రాఘవయ్య గారు ‘గండికోట యుద్ధము’ అను ద్విపద కావ్యము, ‘కడగండ్లు’ అను పద్యసంకలనం వ్రాశాడు. ‘కొసరాజు విసుర్లు’,’కొండవీటి చూపు’, ‘నవభారతం’, ‘భానుగీత’ ఇతని ఇతర రచనలు.

బిరుదులు, పురస్కారాలుఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము రాఘవయ్య గారికి రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది.1985లో కళాప్రపూర్ణ బిరుదును పొందారు.తెలుగు ప్రజానీకం ‘కవి రత్న’ ‘జానపద కవి సార్వభౌమ’ మున్నగు బిరుదులు ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ నిర్వహించిన బుర్రకథల పోటీలో ”నవభారతం” బుర్రకథకు ఆయన ప్రథమ బహుమతి పొందారు. అఖిలభారత కాంగ్రెస్‌, ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, రాజ్యలక్ష్మి వెంకన్న చౌదరి ఫౌండేషన్‌ వంటి సంస్థలు ఆయన్ని ఘనంగా సత్కరించాయి.

తెనాలి క్లాసికల్‌ ఫిలిమ్‌ సొసైటీ నుంచి సముద్రాల రాఘవాచారి అవార్డు అందించారు. చివరిసారిగా సురేష్‌ ప్రొడక్షన్‌ వారి ”గురుబ్రహ్మ”చిత్రానికి 1986 అక్టోబర్‌ 27వ తేదీన ”వినరా, ఆంధ్రకు మారా” అనే బుర్రకథను రాసి, అదేరోజు రాత్రి పది గంటలకు కొసరాజు రాఘవయ్య గారు పరమపదించారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions