ఒక చిన్న వార్త… నిజానికి చిన్నదేనా..? స్టాలిన్ కొడుకు ఉదయనిధి సనాతన ధర్మంపై పరుష వ్యాఖ్యలు చేసిన సంగతి, దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతీ తెలిసిందే కదా… పార్టీ నాయకులు స్టాలిన్, రాజా తదితరులు ఉదయనిధిని వెనకేసుకొచ్చారు… మెజారిటీ ప్రజల మనోభావాల్ని గాయపరుస్తున్నాడు అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఉదయనిధి తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ప్రకటించాడు…
నీకు సనాతన ధర్మంపై సదభిప్రాయం లేకపోతే సరి… కానీ ఆ పేరుతో మొత్తం హిందూ మతం పట్ల విషాన్ని కక్కడం ఏమిటనేది తనపై వచ్చిన విమర్శల సారాంశం… ఆ ధర్మం మనుషుల్ని సమానులుగా చూడలేదు, చాలా లోపాలున్నయ్ అందులో అంటాడు ఉదయనిధి… సరే, సమాజంలో, ప్రత్యేకించి తమిళ సమాజంలో ఇదెప్పుడూ ఉన్నదే… ఐతే ధర్మం దేవుడికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, సామాజిక కట్టుబాట్లు కూడా ఉంటయ్…
అందులో లోపాలూ ఉంటయ్… అదొక సంస్కృతి… గతంలో తిలక్ చెప్పినట్టు ఏ సంస్కృతీ కాదొక స్థిరబిందువు… అనేక నదీనదాలు కలిసిన అంతస్సింధువు… అవును, ఏ ధర్మమైనా డైనమిక్… అస్థిరం కాదు, కాలాన్ని బట్టి, సొసైటీలో వచ్చే మార్పులను బట్టి ధర్మం కూడా అనేక రకాల మార్పులకు లోనవుతూ ఉంటుంది… అసలు ‘‘సనాతన ధర్మం’’ అంటే ఏమిటో ఈ సోకాల్డ్ విమర్శలకు, సమర్థకులకు తెలుసా..? అది ఆచరణలో ఉందా..? లేక హిందూ మతాన్నే సనాతన ధర్మంగా చెబుతున్నారా..? మరి ఆధునిక ధర్మం ఏమిటి..? అన్నీ శేషప్రశ్నలు…
Ads
ఇప్పుడు ఆసక్తికరంగా అనిపించిన వార్త ఏమిటంటే… ఇదే స్టాలిన్ బిడ్డ, పేరు సెంథామరై సోమవారం సత్తయినాథర్ గుడికి వెళ్లింది, ప్రత్యేక పూజలు నిర్వహించింది… అదే కుటుంబం… స్టాలిన్ నాస్తికుడు… ఉదయనిధి కూడా అంతే (కానీ తను ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అనేవాళ్లూ ఉన్నారు… తన భార్య కృతిక మతం ఇదమిత్థంగా తెలియదు…) స్టాలిన్ సోదరి కనిమొళి నాస్తికురాలు… కానీ స్టాలిన్ భార్య దుర్గ పరమ విశ్వాసి… ఆమె తమిళనాట గుమ్మం ఎక్కని గుడి లేదు, మొక్కని పెరుమాళ్ లేడు… దేవుడిని నమ్మని తన భర్తను ముఖ్యమంత్రిని చేయాలంటూ దాదాపు దేవుళ్లందరినీ వేడుకుంది…
స్టాలిన్ తల్లి దయాళు అమ్మాల్ కూడా వీరభక్తురాలే… పరమ నాస్తికుడైన కరుణానిధి భార్య ఆమె… స్టాలిన్ సోదరి సెల్వి కూడా ఆస్తికురాలే… అంతెందుకు..? నాస్తికత్వం, హేతువాదాన్ని పార్టీ సిద్ధాంతంగా భావించబడే డీఎంకేలో కొన్నేళ్లుగా చాలామంది నాస్తికత్వానికి నీళ్లొదిలి, పక్కా భక్తిమార్గం పట్టారు… అన్నాడీఎంకే ఎప్పుడో ‘ఆస్తిక పార్టీ’ అయిపోయింది… సో, స్టాలిన్ తల్లి భక్తురాలు, స్టాలిన్ భార్య భక్తురాలు, స్టాలిన్ సోదరి భక్తురాలు, స్టాలిన్ బిడ్డ భక్తురాలు…
భగవంతుడి మీద విశ్వాసానికీ, సనాతన ధర్మ ఆచరణకూ నడుమ తేడాలున్నయ్… ఇక ఆ చర్చ జోలికి ఇక్కడ పోదలుచుకోలేదు… కానీ సొంత ఇంట్లోనే తల్లి, చెల్లి, భార్య, కోడలు, బిడ్డ అందరూ దైవవిశ్వాసులే… (ఉదయనిధి బిడ్డ తన్మయ విశ్వాసాల గురించి వార్తలేమీ కనిపించలేదు…) నీ ఇంటి సభ్యులనే నీ హేతువాద సిద్ధాంతం కన్విన్స్ చేయలేకపోతోందా..? కుటుంబాన్నే తమ పంథాలోకి మళ్లించలేకపోయారా కరుణానిధి, స్టాలిన్… శ్రీశ్రీ ఇంట్లో సత్యనారాయణవ్రతంలాగా… సీపీఐ నారాయణ తిరుమల యాత్రలాగా… రమణమహర్షి ఆశ్రమంలో చేరిన చలంలాగా… వృద్ధాప్యంలో గుళ్లబాట పట్టిన గద్దర్‌లాగా… సెంథామరై గుడి సందర్శన వార్త చదివాక నెటిజనం పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు… ఏమోయ్, ఉదయనిధీ, ఇది సనాతన ధర్మం కాదా, మీ చెల్లెకు నచ్చజెప్పు చేతనైతే అనేది ఆ పోస్టులు, కామెంట్ల సారాంశం…
ఇక్కడే మరో కోణం కూడా పరిశీలించాలి… దేవుడు, ఆస్తికత్వం, సామాజిక కట్టుబాట్లలో వివక్షలకు సంబంధించి స్టాలిన్, ఉదయనిధి ధోరణులు కేవలం వ్యక్తిగతమే కాదు… అవి ఆ పార్టీ మూల సిద్దాంతాలు… అందుకే చర్చ… ఐనాసరే, తమ కుటుంబసభ్యుల వ్యక్తిగత విశ్వాసాలను స్టాలిన్ గానీ, కరుణానిధి గానీ, ఇప్పుడు ఉదయనిధి గానీ వ్యతిరేకించలేదు… ఆంక్షలు పెట్టలేదు… స్వేచ్ఛను ఇచ్చారు… వాళ్ల నమ్మకాలకు అడ్డుపడలేదు.. ఆ కోణంలో వాళ్లను అభినందించొచ్చు… మతం వ్యక్తిగతం అంటారు…
అదేసమయంలో తమ పార్టీ సిద్ధాంతం మాత్రం నాస్తికత్వం… ఇదొక ద్వైదీభావమా..? సో, రాజకీయం వేరు, కుటుంబం నడక వేరు అనుకోవాలా..? ఏమైనా గానీ ఆసక్తికరమైన చర్చ తమిళనాట సాగుతూనే ఉంది, ఉంటుంది… ఎంతైనా నువ్వు భలే దేవుడివి స్వామీ… నువ్వు లేనే లేవంటూ అరివీర, భీషణ ప్రసంగాలతో ఎవరైతే పోరాడుతుంటారో, వాళ్ల నీడలతోనే పొర్లు దండాలు పెట్టించుకుంటావు… బహు చమత్కారివి… జగన్నాటక సూత్రధారివి…!!
Share this Article