కేంద్ర ప్రభుత్వంలో విదేశాంగ శాఖ ఉంటుంది… ఈ పాస్‌పోర్టులు, వీసాల వ్యవహారం చూసేది వాళ్లే… ఇకపై పాస్‌పోర్టుల వ్యవహారంలో చాలా మార్పులు అవసరం… కేంద్రం దీనికి తగిన సర్క్యులర్ తక్షణం జారీ చేయాలి… పాస్‌పోర్టులు ఇచ్చేటప్పుడే ఎవడు ఏ హీరోకు అభిమానో ఇంటలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెప్పించుకోవాలి… కటౌట్లు పెట్టేవాళ్లు, అభిషేకాలు చేసేవాళ్లను గుర్తించాలి… సోషల్ ఖాతాల్లో వాళ్ల పోస్టులను విశ్లేషించాలి… అభిమానసంఘాల్లో యాక్టివ్ రోల్ ఎంతో మదింపు వేయాలి… వీళ్లకు ఈస్ట్‌మన్ కలర్ ట్యాగ్‌తో పాస్‌పోర్టులు ప్రత్యేకంగా ఇవ్వాలి…
అంటే ఏ విదేశంలోకి వెళ్లి బతుకుతుంటే, వీడు ఫ్యాన్, ప్రాబ్లమాటిక్, వీడికి కులం పిచ్చి, హీరో పిచ్చి, కనుక జాగ్రత్త అని అక్కడి అధికారులకు ముందే సూచించడం అన్నమాట… థియేటర్లకు టికెట్ల కోసం వచ్చినప్పుడే వీళ్ల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలి, ఏ గొడవా లేకుండా బయటికి వస్తేనే తిరిగి పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలి… లేదా సీజ్ చేసి, ఇండియాకు తిరిగి పంపించాలి… ఇక జన్మలో పాస్‌పోర్టు ఇవ్వకుండా వీళ్లపై జీవితకాల నిషేధం విధించాలి…
ఇలాంటి పాస్‌పోర్టులు చెక్ చేసి మరీ ఉద్యోగాల్లో జాయిన్ చేసుకోవాలి విదేశీ కంపెనీలు… సదరు హీరో బర్త్ డే, సినిమా రిలీజు, ఇంకేదో సందర్భంలో వందలాది కార్ల ర్యాలీలు గనుక నిర్వహిస్తే మాస్ కేసులు బుక్ చేయాలి… థియేటర్లలో అల్లర్లకు పాల్పడితే అక్కడే జైళ్లలో పారేసేలా అక్కడి చట్టాలకూ కొన్ని సవరణల్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించాలి… అసలు వీసాలు ఇచ్చేటప్పుడే ఎవడు ఏ హీరో ఫ్యానో తెలుసుకోవాలి, వీసాలు రిజెక్ట్ చేయాలి…
Ads
వీళ్లు విదేశాలకు వెళ్లినా అవే వ్యాధులు… కులాలు, హీరోలు, ఫ్యానిజాలు, ర్యాలీలు, నినాదాలు, పేపర్లు చింపి థియేటర్ తెర మీదకు విసిరేయడాలు… ఇంత చదువుకుని, విదేశాలు వెళ్లి మరీ కొలువులు చేస్తూ ఇంకా ఈ చెత్తా ధోరణుల బతుకులేమిట్రా..? పొట్ట చేత్తో పట్టుకుని విదేశం వెళ్లావు సరే, అక్కడ నీ దేశం పరువు తీయడం దేనికి..? ఇండియన్స్ అందరూ ఇలాంటివారే అని ఆయా దేశాలు థూత్కరించడానికా..? ఇదేనా మీ దేశగౌరవం నిలిపేది..?
ఏ కులమూ, ఏ ప్రాంతమూ, ఏ హీరో, ఏ రాజకీయ నాయకుడూ మినహాయింపు కాదు… అందరికీ ఫ్యాన్లు… సంఘాలు… సెలబ్రేషన్స్, మీటింగులు, ఆవేశాలు, నినాదాలు, ప్రత్యర్థి సంఘాలపై బురద జల్లడాలు… నెట్ నిండా ద్వేషాన్ని చిమ్ముకోవడం… కాస్త హుందాగా, ఆయా దేశాల కల్చర్లకు తగినట్టు గౌరవంగా బతకొచ్చు కదరా నాయనా… ఈ మాట అంటే మళ్లీ ట్రోలింగు… వీళ్ల చదువులు పాడుగాను, చదువుల్లేనివాడు మర్యాద, పద్ధతులను పాటిస్తాడు… ఎదుటివాడిని గౌరవిస్తాడు… వీళ్లు మాత్రం బేఫికర్… ఎవడికీ ఎవడి భయం లేదు…
మాకేం అవుతుంది..? మేం స్టాంపింగుకు పోయేదేమీ లేదు… మేం గ్రీన్ కార్డు హోల్డర్లం అని విర్రవీగే వారి మీద కూడా కేసులు పెట్టి, ఇండియాకు డిపోర్ట్ చేయాలి… కొందరికి ఈ శిక్షలు పడితేనే కదా, మిగతావాళ్లలో కాస్త భయం ఉండేది… ఏమాటకామాట, ఇలాంటోళ్ల విషయంలో గల్ఫ్ దేశాల ప్రభుత్వాలే నయం… ఎక్కువ మాట్లాడితే కొరడా తీసి బాదుతాయి… తీసుకువెళ్లి జైళ్లలో పారేస్తాయి… చెప్పుకుంటే నిష్ఠురంగానే ఉంటుంది… కానీ నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది… ఇలాగే… https://www.facebook.com/reel/508536681149976/?s=single_unit
Share this Article