పలు కోణాల్లో బలగం సినిమాను ప్రశంసిస్తున్నాం… అనేకానేక రొటీన్ చెత్తా తెలుగు సినిమాలతో పోలిస్తే చాలారెట్లు బెటర్ కాబట్టి ఈ సినిమా ప్రశంసలకు అర్హమైనదే… కానీ కొందరు పనిగట్టుకుని బలగం సినిమాపై విమర్శలకు దిగుతున్న తీరే అభ్యంతరకరం… మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేసే రీతిలో సినిమా ఉందనేది వాళ్ల విమర్శల సారాంశం… వీరిలో కొందరు నిజవిమర్శకులు… విస్తృత ప్రభావం చూపించగల సినిమా మాధ్యమం వర్తమాన స్థితి మీద వారి ఆందోళన… అది హేతుబద్ధం… కానీ కొందరి విమర్శల్లో మాత్రం తెలంగాణతనం, తెలంగాణ క్రియేటర్స్ ఎదుగుదలపై ఓర్వలేనితనం కనిపిస్తోంది…
పిట్టముట్టుడు… అనే అంశం మీద చాలామందికి అభ్యంతరం… కానీ బలగం అనేది ఒక సినిమా మాత్రమే అనీ, ఇప్పటికీ పల్లెల్లో ఉన్న విశ్వాసాలు, ఆచరణలనే సినిమా కథ చూపించిందనే సోయి ఆ విమర్శల్లో తప్పింది… గమనించారో లేదో… ఈరోజుకూ అక్కడక్కడా తెల్లారేసరికి, చౌరస్తాల్లో, రోడ్ల మీద నిమ్మకాయలున్న క్షుద్రపూజల సామగ్రి కనిపిస్తాయి… చేతబడులు, చిల్లంగి, బాణామతి ఈరోజుకూ ఉన్నాయి… వాటిని ఏదైనా కథలో ఇమిడ్చితే అది ప్రోత్సహించడమా..? తిరోగమనమా..? ఒక సైకో ఉంటాడు, పిల్లలను అపహరిస్తూ, అత్యాచరిస్తూ, చంపేస్తుంటాడు… ఈ కథ తీస్తే ఇక సైకోలను ఎంకరేజ్ చేసినట్టేనా..? సమాజంలో ఆ సంఘటనలు లేవా..?
Ads
ఒకడు బాగా తాగి, సంసారాన్ని నాశనం చేసుకుంటాడు… ఆ కథ తీస్తే, అది ఆ కథలోని ఒక కేరక్టర్ తత్వంగా అర్థం చేసుకోవాలే తప్ప, తాగడాన్ని ప్రోత్సహించినట్టు కాదు కదా… చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో… బలగం సినిమా మూఢవిశ్వాసాలను ఎంకరేజ్ చేస్తుందని కూసే గొంతులు బాహుబలులు, ఆర్ఆర్ఆర్‌లు, బింబిసారల జోలికి మాత్రం వెళ్లవు… ఎందుకో మరి… ఆలోచిస్తే ఒక ప్రాంతం మీద అక్కసు, అలివిమాలిన కుళ్లు మాత్రమే అందులో ధ్వనిస్తుంటాయి…
అయితే బలగం సినిమా ఏమైనా పర్‌ఫెక్ట్ సినిమాయా..? కాదు… తెలంగాణ కల్చర్‌కు ప్రతీకగా ఎవరైనా చెబితే అది అబద్ధం… అదొక సినిమా కథ… కాకపోతే తెలంగాణ పల్లెల్లో కనిపించే కల్చర్‌ను నేచురల్‌గా దృశ్యబద్ధం చేశారు… అంతే… గడ్డం సతీష్‌ను చిల్లర అని తూలనాడినప్పుడే బలగం దర్శకుడు వేణులోని అసలు సిసలు జబర్దస్త్ బాపతు ఆర్టిస్టు స్పష్టంగా కనిపించాడు… తన సినిమాలోనూ చెప్పుకోదగిన లోపాలు లేవా..? ఉన్నాయి… ఏ అంత్యక్రియల చుట్టూ కథను తిప్పాడో, ఈ కుటుంబబంధాల చుట్టూ కథనాన్ని తిప్పాడో వాటిల్లోనే కీలకమైన దోషాలున్నాయి… తన కథాప్రాంతం సిరిసిల్లనే తీసుకుంటే… అక్కడి కల్చర్‌నే తీసుకుంటే… ఆ లోపాలు ఏమిటంటే…
సీనియర్ జర్నలిస్టు మిత్రుడు సూరజ్ అభిప్రాయం… :: శ్రార్ధకర్మల్లో సంప్రదాయబద్దంగా కొమురయ్య కొడుకులిద్దరికీ విధిగా జరగాల్సిన శిరోముండనం మాత్రం ఎందుకో జరపలేదు! (గుండు గీకడం)… అత్యంత సహజంగా, మానవీయ కోణంలో మనసుకు హత్తుకునేలా తీసిన బలగం చిత్రంలో, ఒక మనిషి చావు తదనంతరం తలెత్తే పరిణామాలన్నిటినీ స్పృశించినా, వెంట్రుకలు తీసే తంతు ఊసే లేకపోవడంతో సంపూర్ణత్వం కొరవడింది. చావుల్లో అతి కీలక ఘట్టమైన శిరోముండనం లోటు స్పష్టంగా కనిపించింది. ఆ తప్పిదం జరగకపోతే గాజుల కొమురయ్య మృత్యుకావ్యం నిజంగా ఓ అద్భుతమే అయ్యేది! ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా దర్శకనిర్మాతలు, తారాగణం, ఇతర సాంకేతిక సిబ్బంది, ఇంకా ఎవరు ఆ ఫిల్మ్ చూసినా అదో పెద్ద వెలితిగానే మిగిలిపోతుంది!
మరో సీనియర్ జర్నలిస్టు మిత్రుడు శెంకేసి శంకర్‌రావు అభిప్రాయం… :: తెలంగాణోళ్లు అంత నీసు ముచ్చులేం కాదు! కథా గమనం కోసం, కథలో మలుపు కోసం తెలంగాణోళ్లను నల్లిబొక్క పిచ్చోళ్లుగా ఎస్టాబ్లిష్ చేయడం విడ్డూరంగానే కాదు, జుగుప్సగా ఉంది. అత్తవారింట భోజనం చేసే సమయంలో మాంసం కూరలో తనకు నల్లి బొక్క పడలేదనే కోపంతో బామ్మర్దులతో గొడవకు దిగి, పెళ్లాంపైన చేయిచేసుకొని, ఆమెను దొంగదాన్ని చేసి అల్లుడు నారాయణ 20 ఏళ్లు అత్తవారింటిని బహిష్కరిస్తాడు. ‘మీ బొక్కలొద్దు.. మీరొద్దు..’ అని భార్యాబిడ్డలను పుట్టింటికి పోకుండా చేస్తాడు. వేణు ఈ సన్నివేశాన్ని ‘హా’శ్చర్యపోయేలా తీశాడు. తెలంగాణలో ఈ స్థాయిలో మటన్ పిచ్చోళ్లు ఉంటారా…? బొక్క కోసం బంధాలను తెంపుకునే అహంతో ఊగిపోతారా..? అని బిత్తరపోయేలా చేశాడు. తెలంగాణ సంస్కృతిని పాత రాతియుగాల నాటికి తీసుకుపోయి పొరుగోళ్లు నవ్వుకునేలా చేశాడు.
మరో మిత్రుడు అంబట్ల రవి అభిప్రాయం… :: ఇంత పెద్ద బలం, బలగం ఉన్న సినిమాలో, అదీ తెలంగాణ సినిమాలో, తెలంగాణ వాళ్లే చేసిన సినిమాలో తెలంగాణ ‘వర్స’ మిస్సయినట్లనిపించిది! ఆ వర్స ఏంది?! తెలంగాణలో మేనత్త (నాన్న అక్క/చెల్లె)కు ప్రత్యేక స్థానం ఉంది. మేనత్త అంటే మన ఇంటి ఆడబిడ్డ. ఆమెకు, ఆమెను ఏ ఇంటికైతే కోడలిగా పంపుతామో ఆ ఇంటివాళ్ల (చిన్నపిల్లలైనా సరే)కు మనం కాళ్లు మొక్కడం తెలంగాణ అంచాన (అంచనా కాదు.. సంప్రదాయం/పద్ధతి)గా వస్తున్నది. (వొంతెన అని కూడా అంటారు)… ఆడబిడ్డ అత్తగారు ఎప్పుడూ మనకంటే పెద్దోళ్లే అని ఆ ఆడబిడ్డ పుట్టింటివాళ్లు భావిస్తుంటరు. ఆడబిడ్డ అత్తగారి ఇంట్లోని చిన్నపోరగాళ్లను కూడా ‘అరేయ్ తరుయ్’ అని ఇక్కడోళ్లు పిల్వరు. మర్యాదగా మాట్లాడుతరు. మస్తు అర్సుకుంటరు. మేనత్త కొడుకుకు మన ఇంటి నుంచి ఆడబిడ్డను ఇచ్చుడు తప్పితే మేనత్త కూతురును మన ఇంటి కొడుకుకు చేసుకోవడం దాదాపు తెలంగాణలో ఏ పల్లెలో లేదు.
మేనత్తకు పుట్టిన ఆడబిడ్డలుంటే మన ఇంటి ఆడబిడ్డల (అక్కా చెల్లెళ్ల) లెక్కనే చూస్కుంటం. వదిన అనో, మర్దలనో కూడా పిలువం. అన్న కొడుకుకు, చెల్లెలి కూతురును ఇచ్చి లగ్గం జేయడం అనే వర్స ఉండదు. అసుంటిది.. తెలంగాణ సినిమా, తెలంగాణ ఆత్మగల్ల సినిమా, తెలంగాణ బలగమంతా చేసిన సినిమాలో మేనత్త బిడ్డను ఆ మేనత్త అన్న కొడుకుకు ఇచ్చి లగ్గం జేయాలనుకోవడం.. పెద్ద మనిషి కొమురయ్య కోరిక కూడా అదే కావడం మంచిగనిపియ్యలే!! మంచి బలగంలో ఈ వర్స నాకు నచ్చలేదు.
సినిమా చూసినంక సిరిసిల్ల, కరీంనగర్ దోస్తులకు కూడా ఫోన్ చేసిన. మా సుట్టుపక్కల కిరాణా దుకాణం నడుపుకొనే నల్గొండ వాళ్లను అడిగిన.. రోడ్డు మీద చాయ్ బండి నడిపే గజ్వేల్ అవ్వనడిగిన.. ‘‘మీ దగ్గర మేనత్త బిడ్డను లగ్గం జేస్కుంటరా?’’ అని. ‘‘ఆళ్లు పెద్దోళ్లాయె.. మనం ఆళ్ల కాళ్లు మొక్కెటోళ్లమే. ఆళ్ల పిల్లని జేస్కుంటమా? మన పిల్లనే ఇస్తం.. అదీ వర్స’’ అన్నరు. మరీ తెలంగాణ బలగమంతా కలిసి తీసిన తెలంగాణ ‘బలగం’లో ఆ తెలంగాణ వర్స మిస్సవ్వడం ఏందో?! తెలంగాణలో కూడా అక్కడక్కడ చెల్లె బిడ్డను అన్న కొడుక్కు ఇచ్చి పెండ్లి చేసే వర్స ఉండొచ్చేమో కాదనలేం. కానీ, ఫక్తు తెలంగాణ సినిమాలో దాదాపు తెలంగాణలో ఎక్కువ మంది పాటించే వర్సను తప్పితే ఎట్ల?!
11వ రోజు కాకి ముట్టుకోకుంటే మీతో ఊరోల్లు ఎవరూ మాట్లాడరు.. మిమ్మల్ని వెలివేస్తున్నట్లే అనే ఊరిపెద్దల తీర్పు ఖాప్ పంచాయితీ లెక్క ఉంది… పిట్టముట్టకపోతే ఆ కుటుంబాన్ని వెలివేయడం అనేది తెలంగాణ పల్లెల్లో ఎక్కడా లేదు… కథాగమనంలో పంచ్ కోసం దర్శకుడు సొంతంగా రాసుకున్న వైనం అది… ఇలా కథనలోపాలకు పలు ఉదాహరణలు దొరుకుతయ్ ఈ సినిమాలో… అయితే బ్రాడ్‌గా సినిమాను ఎందుకు అభినందించవచ్చో పలుసార్లు పలు కోణాల్లో చెప్పుకున్నాం కాబట్టి వాటి ఊసు మళ్లీ ఇక్కడ అక్కరలేదు…!!
Share this Article