నో డౌట్… విజయ్ సేతుపతి మంచి నటుడు… కానీ ఎప్పుడు..? తనలోని నటుడిని ఆవిష్కరించే మంచి పాత్ర దొరికినప్పుడు..! తనలోని నటుడికి చాలెంజ్ విసిరే పాత్ర దొరికినప్పుడు..! మరి మిగతా సందర్భాల్లో..? జస్ట్, ఓ నటుడు, ఓ హీరో… అంతే… తుగ్లక్ దర్బార్ సినిమా చూస్తుంటే పాపం సేతుపతి అనిపిస్తే అది మన తప్పేమీ కాదు… తన తప్పే..! మొన్న ఏదో లాభం అని ఓ పిచ్చి సినిమా చూసినప్పుడూ సేతుపతి మీద జాలేసింది… ఎందుకిలాంటి పాత్రలు అంగీకరిస్తున్నాడు అని..! తమిళం వాళ్లకు కొన్ని సినిమాలు కావాలి, అతి, అతి, అంతా ఓవరాక్షన్ ఉండాలి… అలాంటి సినిమాలు చేస్తేనే అక్కడి నటులకూ గిరాకీ… ఆ మాయలో పడి ఇలాంటి సినిమాలు చేస్తున్నాడేమో… ఎలాగూ సేతుపతికి తెలుగులోనూ కాస్త ఫాలోయింగ్ పెరుగుతోంది కదా, ఇంకేముంది..? వాటిని తెలుగులోకి డబ్ చేసి, స్ట్రెయిట్ సినిమాల్లాగే రిలీజ్ చేసిపారేస్తున్నారు… థియేటర్లలో కాదు, ఓటీటీలున్నయ్ కదా… ఈ తుగ్లక్ దర్బార్ కూడా అలాగే నెట్‌ఫ్లిక్స్ వాడికి అంటగట్టేశారు… మొన్నమొన్ననే కదా లాభం రిలీజ్ చేశారు, మళ్లీ ఇప్పుడే ఈ సినిమాయా అని ఆశ్చర్యపోకండి… కొన్ని అంతే…
ఇలాంటి పాత్రల్నే చేస్తుంటే ఇక అంతే సంగతులు… తన చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలున్నయ్… అందుకే కాస్త రివ్యూ చేసుకోవయ్యా సేతుపతీ… ఈ తుగ్లక్ దర్బార్ సినిమాలో తనది స్ప్లిట్ పర్సనాలిటీ… గతంలో చూశాం కదా అపరిచితుడు సినిమా… విక్రమ్ యాక్షన్ చూశాక ఇక ఆ రేంజ్ మరిపించాలంటే కష్టం… సేతుపతి కష్టపడ్డాడు, ఇందులో పాత్ర స్వభావం కూడా కాస్త కొత్తకొత్తగానే ఉంటుంది కానీ… ఎందుకో, ఎక్కడో అసంతృప్తి…! ఇందులో పార్తీపన్ ఉన్నాడు, రాశిఖన్నా ఉంది, మంజిమా మోహన్ ఉంది… కానీ సేతుపతి, రాశి తప్ప అందరూ తమిళమే… రాశి చేయడానికి ఏమీలేదు, మంజిమాకు ఉన్నంతలో కాస్త మంచి పాత్రే… కానీ పాటలు ఏ భాషలో వినిపిస్తున్నాయో అర్థం కాదు… రాశితో లవ్ ట్రాక్ కూడా పండలేదు… మంజిమాతో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఎమోషనల్‌గా వర్కవుట్ కాలేదు… కామెడీ ఏదో సపరేట్ ట్రాక్ ఉంది, అదొక చిరాకు… ఒకే నాయకుడిలో రెండు వేర్వేరు పార్శ్వాలు కన్విన్సింగుగా, ఎప్పటికప్పుడు మార్చేస్తూ చూపాలంటే దానికి తగ్గ కథారచన, కథనం, దర్శకత్వ ప్రతిభ అవసరం… అవి లేవు, దాంతో సేతుపతి శ్రమ వృథా అయిపోయింది… ఇంకానయం, థియేటర్లలో విడుదల చేయలేదు, సేతుపతి కదా అని నేరుగా వెళ్లిపోతే, ఎంతమంది పర్సులు కాలిపోయేవో…!!
Ads
Share this Article