ఓ హిందీ ఇంటర్వ్యూలో నటి షబానా అజ్మీ చెప్పిన విషయాలు..
* ‘అంకుర్'(1974) సినిమా చేసేనాటికి నా వయసు 23. అప్పటిదాకా నేను పల్లెటూళ్లు అసలు చూడలేదు. మొదటి రోజు షూటింగ్‌లో నాకో చీర ఇచ్చి కట్టుకొని నడిచి చూడమన్నారు దర్శకుడు శ్యాం బెనగల్. నడవడం బాగానే ఉంది కానీ కూర్చుని పనులు చేయడం, భోజనం చేయడం ఇబ్బందిగా అనిపించింది. శ్యాం బెనగల్ అది చూసి, “నువ్వు మాతో డైనింగ్ టేబుల్ మీద కాకుండా నేల మీద కూర్చుని భోజనం చేయ్” అన్నారు. నేను అలా ఆ పాత్రకు అలవాటు పడ్డాను.
* ‘అంకుర్’ సినిమా షూటింగ్‌కి కొందరు కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు. వాళ్లు హీరోయిన్ కోసం చూస్తున్నారు. లంచ్ టైంలో నేను నేల మీద కూర్చుని తినడం చూసి ‘ఎవర్నువ్వు? హీరోయిన్ ఎక్కడ?’ అని అడిగారు. తను ఇవాళ రాలేదు అని అబద్ధం చెప్పాను. మరి నువ్వు? అని అడిగితే, నేను ఈ సినిమాలో ఆయా పాత్ర వేస్తున్నాను అన్నాను. వాళ్లు సరే అని వెళ్లిపోయారు. శ్యాం నా దగ్గరికి వచ్చి ‘Now you became a Village Lady. You have successfully convinced them. Come! Eat with us’ అన్నారు.
Ads
* నటుడు జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం ఆగిపోతే జీవితం ఆగిపోయినట్టే. Observation is more important. చుట్టూ ఉన్న వారిని శ్రద్ధగా గమనించడం వల్లే మన నటన మెరుగుపడుతుంది.
* Emotional Scenes వచ్చినప్పుడు బిగ్గరగా మాట్లాడటం, భారీ డైలాగులు చెప్పడం సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ నిజజీవితంలో అలా ఉండదు. మనం లోలోపల అణుచుకున్న బాధల తాలూకు స్పందనలే మన వ్యక్తీకరణలు అవుతాయి. అది అర్థం చేసుకుని నటించాలి. పాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో నటులకు తెలియాలి.
* మనం ఎంత బాగా నటిస్తున్నాం అనే దానికంటే ఆ పాత్రకు ఎంత తగినట్లుగా నటిస్తున్నాం అనేది ముఖ్యం. ఎక్కువ చేసినా, తక్కువ చేసినా ఆ పాత్రను చంపేసినట్టే అవుతుంది. నా దృష్టిలో ‘గరం హవా’ సినిమాలో బల్‌రాజ్ సహానీ ప్రదర్శించిన నటన దేశంలో అత్యుత్తమైనదిగా అనిపిస్తుంది. ఆ పాత్రకోసం ఆయన నెల రోజులపాటు భీవండిలో ఉండి అక్కడ వాళ్ళను శ్రద్ధగా గమనించారు.
* సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలావరకు ప్యారలల్ సినిమాలే చేశాను. అప్పుడు ఏ ఇబ్బందీ రాలేదు. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలూ చేశాను. అందులో పాటలు పాడే సన్నివేశం ఉంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేదాన్ని. పాడటం కష్టం కాదు, కానీ నిజజీవితంలో లేని ఒక ఎమోషన్ని తెరమీదకు తేవడం అవస్థ అయ్యేది. ఆ తర్వాత సర్దుకున్నాను. ఇక డ్యాన్స్ చేయమంటే మాత్రం అస్సలు కుదిరేది కాదు.
* నటులకు శిక్షణ అవసరమా అని కొందరు అడుగుతుంటారు. శిక్షణేమీ లేకుండా అద్భుతంగా నటించేవారు చాలా మంది ఉన్నారు. కానీ పాలిష్ చేసిన వజ్రానికి, చేయని వజ్రానికి ఉన్న తేడానే శిక్షణ పొందిన నటుడికి, పొందని నటుడికి మధ్య ఉంటుంది. శిక్షణ పొందని నటుడికి తన నటన మాత్రమే ప్రాధాన్యంగా అనిపిస్తుంది. శిక్షణ పొందినవారు ఆ సన్నివేశంలో చుట్టూ ఉన్నవారి నటనా ప్రభావవంతంగా ఉండేలా చూసుకోగలరు.
* ఒక పాత్ర ఓ నటుడి దగ్గరికి వస్తుంది. ఇలాంటి పాత్రను గతంలో ఎవరు ఎలా చేశారు అని ఆలోచిస్తారు. నా దృష్టిలో అది తప్పు. ఈ ప్రపంచంలో అందరి భావోద్వేగాలు ఒకటే అయినా, వ్యక్తీకరణలు ఒకేలా ఉండవు. అటువంటప్పుడు ఆ పాత్రను మనం సొంతం చేసుకుని మనకు తగ్గట్టు నటించాలి తప్పించి మరెవర్నో చూసి ఇమిటేట్ చేయకూడదు. నటులకు అతి పెద్ద రిసోర్స్ వారి జీవితం, ఈ ప్రపంచం. అది మర్చిపోకూడదు.
* స్వీడిష్ దర్శకుడు Ernst Ingmar Bergman అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో స్త్రీ పాత్రలు చాలా లోతైన భావాలతో ఉంటాయి. వారు చూసే ఒక చూపు, చిన్న సైగ, ఒక అడుగు కూడా చాలా అర్థవంతంగా సినిమాలో కనిపిస్తుంది.
* సినిమా జానర్‌ని బట్టి నటన ఉంటుంది. అన్ని చోట్లా ఒకే తరహా నటన కుదరకపోవచ్చు. సీనియర్ నటులు ఒక రకమైన పద్ధతికి అలవాటు పడి ఉంటారు. కొత్త నటులు మరో తరహాలో శిక్షణ పొంది రావొచ్చు. ఇద్దర్నీ ఒకే సన్నివేశంలో నటించమన్నప్పుడు ఎవరి పద్ధతికి తగ్గట్టు వారు చేస్తారు. ముందుగా దర్శకుడు తనకేం కావాలో స్పష్టతతో ఉండాలి. ఆపైన నటుల నుంచి వారి పద్ధతిలో నటన రాబట్టుకోవాలి. అందర్నీ ఒకే గాటిన కట్టడం కుదరదు.
* ఎంత గొప్ప నటుడైనా గొప్ప పాత్ర దొరికినప్పుడే నటించగలడు. గొప్ప పాత్రలు రావాలంటే గొప్ప కథ ఉండాలి. అది లేకపోతే ఎంత గొప్ప నటుడైనా ఖాళీగా మిగిలిపోవాల్సిందే! కాబట్టి కథలకు నటులెప్పుడూ చాలా గౌరవం ఇవ్వాలి……….. [ విశీ ]
Share this Article