శబరి అంటే..? రామాయణంలోని ఓ పాత్ర… రాముడి రాక కోసం నిరీక్షిస్తూ బతికి, చివరకు రాముడిని కలిసి, ఆకలి తీర్చి, ఆ తరువాత రాలిపోయే పండుటాకు పాత్ర… ఆ కేరక్టరే డిఫరెంట్… భక్తి, తాదాత్మ్యత, నిరీక్షణ ఆ పాత్ర లక్షణాలు… ఆ పాత్రను తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన సినిమా పేరుగా ఎందుకు పెట్టారో ఓ పట్టాన అర్థం కాదు… నిజానికి అర్థం లేదు కూడా…
పోనీ, కథానాయిక పేరు శబరి అనుకుందామంటే, అదీ కాదు… సర్లే, సినిమా అన్నాక ఏదో ఓ పేరు పెట్టాలి కాబట్టి, ఇది హీరోయిన్ సెంట్రిక్ కథ కాబట్టి శబరి అని పెట్టేసి వదిలారు అనుకోవాలిక… ఓ డైవొర్సీ లేడీ… ఓ చిన్న పిల్లకు తల్లి… ఓ సైకో ఆ బిడ్డను ఇవ్వాలంటూ వెంట పడతాడు… మరోవైపు ఆ బిడ్డ నాకే కావాలని పాత భర్త కోర్టుకెక్కుతాడు… తన బిడ్డను తాను ఆ తల్లి ఎలా కాపాడుకున్నదీ, ఎలాంటి సిట్యుయేషన్స్‌తో పోరాడిందీ అనేది కథ…
తీసుకున్న స్టోరీ లైన్ స్థూలంగా బాగుంది… కొత్తగానే ఉంది… సరిగ్గా వండితే ఆసక్తికర వంటకం అయ్యేదే… కానీ ప్రజెంటేషన్ బాగా లేదు… ఇక్కడే సుహాస్ ప్రసన్నవదనం సినిమాకూ ఈ వరలక్ష్మి శబరికీ నడుమ తేడా… చెప్పాలనుకున్న స్టోరీని ప్రేక్షకులకు ఇంట్రస్టింగుగా ఎలా చెప్పామనేదే సినిమా మాధ్యమానికి ప్రధానం… ఓ బిడ్డ కోసం ఒంటరి తల్లి చేసే పోరాటం కథలో పెద్దగా ఎమోషన్స్ లేకపోవడంతో సినిమా పెద్దగా కనెక్ట్ కాకుండా పోయింది…
Ads
అచ్చు సుహాస్‌లాగే వరలక్ష్మి కూడా మంచి నటి… హీరోయిన్ పాత్రే అక్కర్లేదు తనకు… నచ్చితే ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతుంది… పాత్రకు తగ్గట్టు నటిస్తుంది, గొప్పగా కాకపోయినా ఆ పాత్రకు లోటు చేయదు… ఈ సినిమాకు అట్రాక్షన్ ఫ్యాక్టర్ కూడా వరలక్ష్మే… కానీ ఇందులో ఎందుకోగానీ వరలక్ష్మి పాత్ర గానీ, పోషణ గానీ అంతగా నప్పలేదు, నచ్చలేదు…
ఓ సైకలాజికల్ థ్రిల్లర్ అనుకున్నప్పుడు కథలో అక్కడక్కడా ఉత్కంఠకు గురిచేసే మలుపులు, వాటిని డీల్ చేసే విధానం ముఖ్యం… అదుగో అక్కడ దర్శకుడు తన ప్రతిభను చూపించలేకపోయాడు అనిపించింది… అసలు కథ వేరు, కాగా కథానాయిక బాల్యం, తల్లిలేనితనం, వేదన, తరువాత ఒకడితో ప్రేమ, పెళ్లి, వాడితోపడక బయటకు వచ్చేయడం దాకా కథ అంత ఆసక్తికరంగా సాగదు…
దాన్ని సంక్షిప్తంగా చెప్పేస్తే సరిపోయేది… పోనీ, సదరు సైకో పాత్రనైనా సరిగ్గా తీర్చిదిద్దారా అంటే అదీ లేదు, చివరలో తేలిపోతుంది… నిజానికి ఈ కథను ఎలా ముగించాలో, ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఎంత ముఖ్యమో దర్శకుడికి అర్థం కాలేదు… అదీ పెద్ద మైనస్ పాయింట్… వరలక్ష్మి గాకుండా వేరే ఎవరూ గుర్తుండరు… కాకపోతే సగటు తెలుగు సినిమా తాలూకు దుర్వాసనలు ఏమీ లేకపోవడం ఓ రిలీఫ్… కానీ అంతిమంగా కేవలం వరలక్ష్మి కోసం థియేటర్ దాకా వెళ్లడం అంటే… కష్టమే బాస్…!! లలితా గుండు బాస్ చెప్పినట్టు డబ్బులు ఊరకేరావు..!!
Share this Article