జబర్దస్త్… అదొక ప్రవాహం… కొన్ని కలుస్తుంటాయి, కొన్ని విడిపోతుంటాయి… విడిపోయినవీ మళ్లీ ఎక్కడో ఎప్పుడో కలుస్తుంటాయి… కానీ టీవీ షోలు, సీరియళ్లు పాడిబర్రెల్లాంటివి… స్థిర ఆదాయాన్ని, పాపులారిటీని మెయింటెయిన్ చేస్తుంటాయి… సినిమా అవకాశాలు మాత్రం లాటరీ… లక్కు తగలొచ్చు, దెబ్బ తగలొచ్చు… అప్పుడు మళ్లీ టీవీ షోలవైపు దృష్టి సారించొచ్చు…
సినిమాలే చేస్తాను, తగ్గేది లేదు అని భీష్మించుకుని పనికిరాని భేషజాలకు పోతే మొదటికే మోసం రావచ్చు, కడుపు కాలిపోవచ్చు… ఎందరో సినిమా నటులు క్షేత్ర పరిజ్ఞానంతో టీవీల వైపు, వెబ్ సీరీస్ వైపు వచ్చేస్తున్నారు… సినిమాలన్నీ ఇవే పదిలం… షకలక శంకర్ అనే కమెడియన్ కమ్ హీరోకు కూడా ఇదే తత్వం కాస్త లేటుగా బోధపడింది… కట్ చేస్తే, మళ్లీ జబర్దస్త్ షోలోకి వచ్చిపడ్డాడు…
జబర్దస్త్ మొదటితరం కమెడియన్లలో చాలామంది ఇప్పుడు అందులో చేయడం లేదు, కారణాలు బోలెడు, చాలామంది విడిపోయారు… అసలు బేసిక్‌గా షో కేరక్టరే మారిపోయింది… మెరిట్ ఉన్న కామెడీ స్టార్లు దూరమైపోగా… నత్తితో డైలాగ్స్ పలకలేనివాళ్లు కూడా జబర్దస్త్ కమెడియన్లుగా తెగ చిరాకెత్తిస్తున్నారు… అందుకే జబర్దస్త్ రేటింగ్స్ నానాటికీ దిగదుడుపు అన్నట్టుగా మారింది… ఐనా సరే, ఈ స్థితిలోనూ జబర్దస్తే దిక్కు అనుకుని షకలక శంకర్ వంటి వెటరన్ కమెడియన్లు తిరిగి దాన్నే ఆశ్రయిస్తున్నారు… కాలమహిమ,..
Ads
జబర్దస్త్‌ను ఇంటిపేరుగా మార్చుకున్న వాళ్లలో సినిమాల్లోకి కాస్తోకూస్తో మంచి అవకాశాల్ని, సంపాదనను సొంతం చేసుకున్నవారిలో అనసూయ, సుధీర్ పేర్లను చెప్పుకోవచ్చు… ఇక సినిమాల్ని వదిలేసి, సినిమాలు వాళ్లను వదిలేసి… జబర్దస్త్ పంచన చేరినవాళ్లలో ఇంద్రజ, (తాజాగా సదా), కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్ తదితరుల్ని చూపించవచ్చు… సరే, షకలక శంకర్ విషయానికి వస్తే… మంచి టైమింగ్, డైలాగ్ డిక్షన్ ఉండి, మంచి ఎనర్జీ కనబరిచిన కమెడియన్లలో తను కూడా ఉంటాడు…
సినిమాలు పిలిచాయి… సినిమా అంటే ఆకర్షణ లేనిదెవరికి..? తనూ వెళ్లాడు… కొన్ని చాన్సులు వచ్చాయి, హీరోగా కూడా చేశాడు… ముందే చెప్పుకున్నాం కదా సినిమా అంటే లాటరీ అని… కొన్నాళ్లకు షకలక శంకర్‌కు తత్వం బోధపడింది… చూపు జబర్దస్త్ వైపు మళ్లింది… గతంలోకన్నా భిన్నంగా… ఒకసారి తమను వదిలేసి వెళ్తే మళ్లీ తీసుకోవద్దు అనే స్థిర ఇగోయిక్ సూత్రానికి సడలింపులు ఇచ్చి జబర్దస్త్ పాత వాళ్లకు గేట్లు తీస్తోంది… (మార్కెట్‌లో మంచి కమెడియన్లు లేరు కదా, తప్పడం లేదు…)
అలా శంకర్ కూడా తిరిగి ఎక్సట్రా జబర్దస్త్‌లోకి వచ్చిపడ్డాడు… అదీ టీమ్ లీడర్ కాదు, జస్ట్, బుల్లెట్ భాస్కర్ అనే ఓ సాదాసీదా టీమ్ లీడర్ నేతృత్వంలోని టీమ్‌లో ఓ సాధారణ సభ్యుడిగా… టైమింగ్ బాగుండగానే సరిపోదు, టైమ్ కూడా బాగుండాలి మరి… పోనీలెండి, అసలే నాసిరకం స్కిట్లతో కునారిల్లిపోతున్న జబర్దస్త్‌కు కాస్త క్వాలిటీ యాడ్ అవుతుంటే సంతోషమేగా…!!
Share this Article