మనం ఇంతకు ముందు కొన్నిసార్లు చెప్పుకున్నాం… ఫాఫం, అంతటి పేరున్న దర్శకుడు టి.కృష్ణ కొడుకు గోపీచంద్ ఎక్కడికి జారిపోయి, కొట్టుకుంటున్నాడో, సగటు తెలుగు దరిద్రపు ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా కథల్లో పడి, తనను తాను ఎలా కెరీర్‌ను ధ్వంసం చేసుకున్నాడో…! ఏళ్లుగా హిట్ లేక, ఫస్ట్ షోకు కూడా పెద్దగా జనం లేని ‘పక్కా కమర్షియల్’ అనబడే తన కొత్త సినిమా దురవస్థకు కారణాలేమిటో అన్వేషించుకోలేని దుస్థితిని కూడా ప్రస్తావించుకున్నాం… గోపీచంద్ పనైపోయింది అనే పరిస్థితికి కారణమేంటో ఇక తనే సమీక్షించుకోవాలనీ హితవు చెప్పాం…
గోపీచంద్ ఇప్పటికీ అదే తొక్కలో నాసిరకం తెలుగు సినిమా ఫార్ములా నుంచి బయటికి రాలేడు… రావడం లేదు… అవేమో వర్కవుట్ కావు… వాటిని జనం ఛీఛీత్కరిస్తున్నారనే సోయి తనకు లేదు… కనీసం తన చుట్టూ తెలుగు ఇండస్ట్రీలో, ఇతర భాషల ఇండస్ట్రీల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ధ్యాస కూడా లేదా..? చివరకు ఒకప్పటి బూతు దర్శకుడు మారుతి తన మార్క్ కామెడీని, హీరోయిక్ యాక్షన్‌ను కలగలిపిన ఓ తిక్క వంటకంలోకి తనను లాగుతున్నాడనే దృష్టి కూడా లేకుండా పోయింది… వెరసి పక్కా కమర్షియల్ అనబడే ఓ సినిమా బుడగ ఫట్‌మని పేలిపోయింది…
నిజానికి ఈ సినిమాకు రివ్యూ అనవసరం… రివ్యూ గోపీచంద్ కెరీర్‌కు అవసరం… తను ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటున్నాడా, వెళ్లిపోతాడా తేల్చుకోవాలి… ఎంత మంచి నటుడు అయితేనేం..? ఏ ఒక్క కోణంలోనూ ఆ సినిమా గురించి పాజిటివ్‌గా చెప్పడానికి ఏమీ లేదు… మరొక్క సినిమా ఇలాంటిది పడితే మాత్రం… ‘‘అప్పట్లో గోపీచంద్ అనే ఓ మంచి నటుడు ఉండేవాడు’’ అని చెప్పుకోవాల్సిందే…
Ads
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… థియేటర్ల దాకా వెళ్లి డబ్బు తగలేయడం దేనికిలే అని పక్కా కమర్షియల్ సినిమా ఆడుతున్న థియేటర్ల వైపే జనం వెళ్లలేదు… అసలే థియేటర్లంటేనే దోపిడీ కేంద్రాలు కదా… పోనీ, ఓటీటీల్లో, టీవీల్లో చూశారా..? నెట్‌ఫ్లిక్స్, ఆహా కలిసి భారీ రేట్లకే కొన్నాయి… నిర్మాత నష్టాల్లేకుండా బయటపడి ఉండవచ్చు… కానీ గోపీచంద్ ఇజ్జత్ పోయింది కదా ఈ సినిమాతో… రాను రాను జనం చూడటమే మానేస్తే..? ఆ డిజిటల్ ప్లాట్‌ఫారాల మీద ఎందరు చూశారో తెలిసిచావదు కాబట్టి, వదిలేద్దాం…
దీన్ని భారీ రేటుకే కొన్న స్టార్‌మాటీవీ నాలుగో తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 దాకా ప్రసారం చేసింది… దీని తరువాతే బిగ్‌బాస్ గ్రాండ్ లాంచింగ్ ప్రసారం చేసుకుంది… అది ఎలా ఎదురుతన్నిందో వేరే కథనంలో చెప్పుకున్నాం కదా… దానికన్నా ఘోరం ఈ పక్కా కమర్షియల్ సినిమా రేటింగ్స్… కేవలం 2.44… పరమ నాసిరకం ప్రోగ్రాములకు కూడా ఇంతకన్నా బాగా వస్తుంటాయి రేటింగ్స్… అంతగా రిజెక్ట్ చేశారు టీవీజనం… అప్పటికే రెండుసార్లు జతకట్టిన రాశీఖన్నాతో ఇది మూడో సినిమా…
జేక్స్ బెజోయ్ సంగీత దర్శకత్వం… ఒక్కటంటే ఒక్క పాట గుర్తుండదు సినిమా అయ్యాక… అది గ్యారంటీ… చివరకు సత్యరాజ్, రావు రమేష్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, వరలక్ష్మి శరత్‌కుమార్ సహా అద్భుతమైన యంగ్ నటి, మేడమ్ శ్రీమతి అనసూయ భరధ్వాజ్ గారు కూడా సినిమాను కాపాడలేకపోయారు… (ఆంటీ కాదు)… ఈ 2.44 రేటింగ్స్ ఏం చెబుతున్నాయి అంటే… గోపీచంద్ కెరీర్ ఐసీయూలోకి చేరింది అని…!!
Share this Article