== పడి లేచిన కెరటం మహమ్మద్ షమీ ==
• కుటుంబ కలహాలతో విచ్ఛిన్నమైన వివాహ బంధం..
• భార్య పెట్టిన బూటకపు రేప్, గృహహింస కేసులు..
Ads
• మాజీ భార్యకు నెలకు యాభై వేలు, సంతానానికి ఎనభై వేల భరణం చెల్లించాలని కోర్టు ఇచ్చిన తీర్పు..
• క్లిష్ట సమయంలో తండ్రిని కోల్పోవడం..
• మానసిక కుంగుబాటుకు లోనై మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నం..
మిడ్ కెరీర్ లో ఉన్న ఒక ముప్పై ఏళ్ల పురుషుడు వ్యక్తిగత జీవితంలో ఇన్ని సమస్యలను ఎదుర్కుని కెరీర్ లో విజయవంతం అవుతాడా? జీవితం మీద ఆశలు కోల్పోయి కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేస్తారు. కాని మహమ్మద్ షమీ సుడిగుండం లాంటి సమస్యల్లో చిక్కుకున్నా, కుటుంబ సభ్యుల సహకారంతో, వ్యక్తిగత కోచ్ అందించిన సహాయంతో తీవ్ర మానసిక ఒత్తిడిని తట్టుకుని కెరీర్ మీద దృష్టి పెట్టి, ఆటకు మరింత పదను పెట్టుకున్నాడు. కుటుంబ సమస్యలతో ఒకప్పుడు భారత జట్టుకు దూరమైన షమీ అనూహ్య పరిస్థితుల్లో భారత జట్టులో చోటు సంపాదించాడు.
తిరిగి అరంగేట్రం చేసినప్పటి నుంచి బంతి బంతికి వికెట్ తీయాలన్న కసి కనబడింది మహమ్మద్ షమీలో. నిన్న న్యూజీలాండ్ తో జరిగిన ప్రపంచ కప్ మొదటి సెమీస్ లో ఏకంగా 7 వికెట్లు తీసి భారత్ ను ఫైనల్స్ కి చేర్చడంలో కీలక పాత్ర పోషించి హీరో ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు మహమ్మద్ షమీ. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అదిరే ఆరంభం, శుభ్ మన్ గిల్ దూకుడైన ఆట, వన్డే క్రికెట్ చరిత్రలో 49 సెంచరీలతో సచిన్ పేరున ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించి కోహ్లీ చేసిన చారిత్రాత్మక 50వ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ దనాధన్ సెంచరీలతో భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులతో ప్రత్యర్థి న్యూజీలాండ్ ముందు భారీ లక్ష్యం ఉంచింది.
అయినా కూడా ఏదో మూల భారత్ అభిమానుల్లో గెలుపు మీద అనుమానం. ఎందుకంటే అంత సులభంగా ఓటమి ఒప్పుకోని న్యూజిలాండ్ జట్టు పోరాట పటిమే. న్యూజిలాండ్ 39 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, మిచెల్ తో కలిసి స్ట్రైక్ రొటేట్ చేస్తూ భారత్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. 31 ఓవర్లకు కివిస్ స్కోర్ 213/2. ఆట కివీస్ నియంత్రణలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్న కివీస్ 19 ఓవర్లకి 185 పరుగులు చేయాల్సి ఉంది. ఒకరకంగా 20-20 మ్యాచ్ టార్గెట్. బౌలర్లు తేలిపోతున్నారు, ఒత్తిడిలో ఫీల్డర్లు తప్పులు చేస్తున్నారు.
తిరిగి బంతిని అందుకున్న మహమ్మద్ షమీ ఒకే ఓవర్లో విలియమ్సన్, లేథమ్ వికెట్లు తీసి భారత జట్టును, అభిమానులను ఒత్తిడి నుండి బయట పడేశాడు. అంతేకాదు సెమీస్ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి న్యూజీలాండ్ పతనాన్ని శాసించి భారత్ ను ప్రపంచ కప్ ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్య గాయంతో వైదొలగడంతో నాలుగు మ్యాచుల తర్వాత భారత తుది జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ ఈ ప్రపంచ కప్ లో మూడుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేయడమే కాకుండా ఈ టోర్నమెంట్ లో 23 వికెట్లు తీసి ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. మొదటి నాలుగు మ్యాచులు కూడా ఆడుంటే మరిన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుని ఉండేవాడు.
పైపైన చూస్తే మహమ్మద్ షమీ ఎదుర్కున్న సమస్యలు కొందరికి చిన్న సమస్యలు అనిపించవచ్చు. కాని ఈ వైవాహిక, కుటుంబ సమస్యలు మనం అనుకునేంత చిన్నవి కావు. పీజీలు, పిహెచ్డిలు చేసి కెరీర్ లో ఉన్నతంగా ఎదగాల్సిన వాళ్ళు కుటుంబ కలహాలతో కెరీర్ మీద దృష్టి నిలపలేక అనామకులుగా మిగిలిన వాళ్ళు ఎందరో ఉన్నారు లోకంలో (ఇలాంటి వారిలో కొందరికి నేను వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ కూడా చేశాను కాబట్టి ఆ అనుభవంతో చెబుతున్న)..
ఇటువంటి సమస్యలను ఎదుర్కుని, తనను అవమానించిన, వేధించిన వారు కూడా సిగ్గుతో తలదించుకునేలా కెరీర్ లో శిఖరాగ్రానికి చేరుకుని ప్రజల అభినందనలు అందుకుంటున్న మహమ్మద్ షమీ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదే ఊపులో ఫైనల్ మ్యాచ్ లో కూడా అద్భుత ప్రదర్శన చేసి చరిత్రలో తన పేరును శాశ్వతంగా సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలని కోరుకుంటున్న. – నాగరాజు మున్నూరు
Share this Article