.
రఘు మందాటి… రాత్రి, చైనా లోని శాంగై బండ్ మీద నిలబడినప్పుడు నది మౌనంగా ఒక గాధ చెప్తున్నట్టు అనిపించింది. నీటిపై వేలాది లాంతర్న్లు తేలిపోతూ, నగరం నడిబొడ్డునా ఓ నిశ్శబ్ద సందేశాన్ని రాసుకుంటున్నాయి. నా చుట్టూ అపారమైన జనసందోహం. నవ్వులు, సంబరాలు, రంగురంగుల కాంతులు. అయినా నా మనస్సు ఎక్కడో మరో వెలుగును తాకాలనే ఆరాటంలో ఉంది.
నగరం నిండా వెలుగులే, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అలాగే ఆ వెలుగుల వెనక నీడలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న గల్లీల్లో కూర్చుని మట్టి మాస్కులు అమ్ముతున్న వృద్ధుడు, కాలినడకన వందల కిలోమీటర్లు పయనించి పనికి వచ్చి నిలబడ్డ యువతి, తన చాప మీద ఆఖరి లాంతర్న్ అమ్మడానికి కూర్చున్న బామ్మ. ఈ పండుగ వారికీ ఎంత వరకూ పండుగైందో, ఆలోచించకుండా ఉండలేకపోయాను.
Ads
అప్పుడే మా తెలంగాణ బతుకమ్మ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా ఊరిలో, బతుకమ్మ పండుగ అంటే ఊరు అంతా రంగుల పువ్వులతో నిండిపోయేది. అక్క, అమ్మ, పక్కింటి అత్తమ్మ చిన్నమ్మ పెద్దమ్మ అందరూ కూర్చొని మా సద్దుల బతుకమ్మను ముద్దుగా పేరుస్తుంటే. మేము పిల్లలు మాత్రం ఆ పూల రంగులను చూస్తూ సత్తు పిండి నువ్వుల పొడి కొబ్బరి పొడి పెసర ముద్దలు తినుకుంటూ ఆ తీయని పరిమళాల్లోనే గమ్మత్తుగా ఆడుకునే వాళ్లం.
రాత్రి అయ్యాక ఊరంతా కోలాహలంగా మారేది. ముత్యాల ముగ్గులు, నడిబజారులో గులాబీలు అమ్మే వాళ్లు, పసుపు, కుంకుమల వాసనలతో గాలి కూడా పండుగ చేసుకునేది. అంతా ఆనందం, అంతా సంబరం కానీ మర్నాడు రాత్రి ఈ పువ్వులన్ని చెరువులో కలిసిపోయి, శాంతంగా సాగిపోతాయనే విషయం గుర్తొచ్చిందా? ఆ క్షణంలోనే మానవ జీవితానికి ఒక అర్థం దొరికినట్టు అనిపించింది.
లాంతర్న్ పండుగలో నది ఒడ్డునా, బతుకమ్మలో చెరువు ఒడ్డునా, చివరికి మనం చేస్తున్నదేమిటి? మనం వెలిగిస్తున్నదీ, గాలిలో వదులుతున్నదీ, నీటిలో కలిపేది అంత కూడా మనకెదురయ్యే జీవిత సత్యాలే..
శాంగై వీధుల్లో గాలిలోకి లాంతర్న్ వదులుతుంటే, నా వెనక నిలబడి ఒక చిన్నారి తన తండ్రితో భయంతో మాట్లాడుతోంది.
నాన్నా, ఈ దీపం ఎక్కడికెళ్లిపోతుంది?
ఆ తండ్రి నవ్వుతూ అన్నాడు, మన ఆశల వెంట ప్రయాణం చేస్తుంది, బాబు!
ఆ మాట విన్నాను కానీ, చిన్నప్పుడు నేను మా అమ్మని అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. అమ్మా, బతుకమ్మ ఈ చెరువులో కలిసాక ఏం అవుతుంది?”
అమ్మ మెల్లగా చెప్పింది, చెరువు మన బాధలని తనలో దాచుకొని. మన ఊరి కథను అమ్మ వారికి చెప్పి చల్లగా చూడమని వేడుకుంటుంది..
అంతే.. ఎక్కడో శాంగైలోనూ, ఎక్కడో తెలంగాణాలోనూ, ఓ తండ్రి తన బిడ్డకి ఓ వెలుగును చూపిస్తున్నాడు, ఓ తల్లి తన బిడ్డకి ఒక చెరువును అర్థమయ్యేలా చెప్తోంది. మనం అందరిలో కాస్తో కూస్తో తేడాలు ఉన్నప్పటికీ మన కథలు మాత్రం అంతే.. ఓ వెలుగు వెతుకుతున్న అన్వేషణే.
అక్కడ చైనాలో వేలాది దీపాలు గాలిలో తేలిపోతుంటే, తెలంగాణలో కొబ్బరి చిప్పలపై నెయ్యి దీపాలు వేశారు. అక్కడ లాంతర్న్లు గాలిలోకి పోతుంటే, ఇక్కడ పసుపు రంగుల్లో నీటి ఒడ్డుకు ఒరిగిన బతుకమ్మ.
అక్కడ ఎవరైనా సంతోషంగా లాంతర్న్ వదులుతారు. ఇక్కడ ఎవరైనా బతుకమ్మ చెరువు ఒడ్డున వదులుతారు.
ఒక్కసారి శ్రద్ధగా చూడండి, ఈ రెండింటిలోనూ మనిషి వెనక్కి తిరిగి చూసి, తను సాగించిన జీవితం వైపు ఒకసారి మెదలిపోతాడు. అక్కడ నీటిలో కలిసిన పూలలాంటిదే మన ఆశలు, మన బంధాలు. ఓసారి వెలిగించి చూసిన తర్వాత, వాటిని బంధించలేం. కానీ వాటి తాలూకు వెలుగు మన గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది.
ఆ రాత్రి శాంగైలో ఒక లాంతర్న్ నా చేతుల్లో తేలుతూ, ఆకాశంలోకి ఎగిరిపోయింది.
మన తెలుగులోని ఒక వాక్యం గుర్తొచ్చింది:
చీకటి తీరాన వెలుగుకై వెతికే ప్రయాణం, మనిషి జీవితం.
అందుకే, శాంగై లాంతర్న్ పండుగనూ, మా ఊరి బతుకమ్మనూ నేను ఒకటిగా చూసాను. ఎందుకంటే, ఎక్కడైనా మన గమ్యం ఒకటే వెలుగును వెతకడమే…
.
.
Share this Article