Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ శంకరాభరణం ఇప్పుడు వచ్చి ఉంటే..? ఇది పుష్ప శకం కదా..!!

January 2, 2025 by M S R

.

.   (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..    .. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అనే అంటారు . శిశువులు , పశువులు , పాములే కాదు ప్రేక్షకులు కూడా వశులవుతారని నిరూపించిన సంచలనాత్మక చిత్రం 2-2-1980 న విడుదలయిన ఈ శంకరాభరణం .

భారతీయ శాస్త్రీయ సంగీత నాట్య సాహిత్య సభ్యతాసంస్కారాల మేళవింపుతో ప్రపంచ ప్రేక్షకులను రసగంగ ధారలో తడిపి ముద్దముద్ద చేసిన సినిమా . ఈ సినిమాను చూడని వారు ఎవరూ ఉండరు . ఒక్కొక్కరు ఒక్కో Ph.D గ్రంధాన్నే వ్రాస్తారు .

Ads

ఈ సినిమాలో పాటల మీద , సంభాషణల మీద , ఫొటోగ్రఫీ మీద , నటీనటుల నటన మీద , నృత్యాల మీద , ఒకటేమిటి ఈ సినిమాలోని అన్ని క్రాఫ్టుల మీద విడివిడిగా ఒక్కో Ph.D చేయవచ్చు . అంత గొప్ప సినిమా .

మల్లీశ్వరి , జయభేరి , మహాకవి కాళిదాసు , విప్రనారాయణ వంటి కళాఖండాలు పోయి , పిచ్చి పిచ్చి గంతులతో , బూతులతో , వెకిలిచేష్టలతో దారీతెన్నూ లేకుండా పోతున్న తెలుగు సినిమా రంగాన్ని శాస్త్రీయ కళా మార్గంలోకి తిప్పిన సినిమా .

బూతులు , వెకిలి , మకిలి లేకుండా , టాప్ హీరోహీరోయిన్లు లేకుండా ఇలాంటి చారిత్రాత్మక సినిమాలను కూడా తీయవచ్చని రుజువు చేసిన కళాతపస్వి విశ్వనాథ్ . తెలుగు సినిమా రంగం గురించి చెప్పాలంటే శంకరాభరణం ముందు , శంకరాభరణం తర్వాత అని చెప్పే స్థాయిలో తీయబడ్డ సినిమా .

ఈ సినిమా అఖండ విజయంతో ఇలాంటి మరి కొన్ని కళాఖండాలు రాగలిగాయి . సప్తపది , సాగరసంగమం , స్వాతిముత్యం , శృతిలయలు , స్వర్ణకమలం , సిరివెన్నెల . ఈ సినిమాలో నటించిన నటీనటుల జీవితాలు చరితార్ధమయినాయి . అలాగే సాంకేతిక వర్గం అంతా కూడా .

నటీనటుల ఎంపిక . సినిమా ప్రేక్షకులకు కనీసం పేరు కూడా తెలియని ఓ రంగస్థల నటుడు జె వి సోమయాజుల్ని ఎంపిక చేసుకోవడం విశ్వనాథ్ గొప్ప . ఆ తర్వాత అప్పటివరకు వాంప్ పాత్రలు , క్లబ్ డాన్సర్ పాత్రలు వేస్తున్న మంజుభార్గవి ఎంపిక హేట్సాఫ్ . బహుశా ఆమె గత సినిమా చరిత్ర కూడా ఈ సినిమా కధకు కరెక్టుగా సెట్ అయిందేమో ! సినిమా మొత్తం మీద పట్టుమని పది డైలాగులు కూడా ఉండవేమో ఆమె పాత్రకు .

ఈ సినిమాలో మరో గొప్ప పాత్ర అల్లు రామలింగయ్యది . ఎంత గొప్ప స్నేహితుడి పాత్ర ! ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరొకరిని ఊహించలేమేమో ! మరో అద్భుతమైన పాత్ర బేబీ తులసి పాత్ర . భక్త ప్రహ్లాద సినిమాతో రోజారమణి జీవితం ఎలా సార్ధకమయిందో అలాగే ఈ సినిమాతో తులసి జీవితం చరితార్ధమయింది .
ప్రతీ పాత్ర అంతే .

నిర్మలమ్మ , చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి , అన్నవరంలో మరచెంబు , ప్రసాదం వంటి సీన్లను ఎవరు మరచిపోగలరు !? ఝాన్సీ , పుష్పకుమారి పాత్రల్ని కూడా మరచిపోలేం . ఇంక వేటూరి వారి సాహిత్య విరాటరూపం . ఆ పాటల్ని ఆయనే వ్రాసాడా లేక సరస్వతీదేవి వ్రాసి వెళ్ళిందా అని అనిపిస్తుంది .

ఆ పాటల్ని పాడిన బాలసుబ్రమణ్యం , వాణీ జయరాం , జానకిలు . ఎంత చెప్పినా తక్కువే . ఈ పాటల్ని ఏరోజు విన్నా ఆ రసగంగలో తేలిపోయే సంగీతాన్ని అందించిన కె వి మహదేవన్ చిరస్మరణీయుడు .

ప్రత్యేకంగా గుర్తు చేసుకోవలసిన వారిలో ఒకరు నృత్య దర్శకుడు శేషు . బేలూరు , హళెబీడు బేక్ డ్రాపులో కంపోజ్ చేసిన మంజుభార్గవి శాస్త్రీయ నృత్యాలు కన్నుల విందు చేస్తాయి . ఆమె ఆహార్యాన్ని అంత అందంగా మలిచిన విశ్వనాధుడిని ప్రశంసించాల్సిందే . ఈ సినిమాలో ఒక్కొక్క పాట గురించి తూతూమంత్రంగా చెప్పలేం . ఒక్కో పాటకు ఒక్కో పోస్ట్ పెట్టాల్సిందే . లేకపోతే వాటికి న్యాయం చేయలేం .

అయినా ఆ పాటల గురించి తెలుగు ప్రేక్షకులకు ఒకరు చెప్పేదేమిటి . ప్రేక్షకుల ఒళ్ళు పులకరించిపోయే సాహిత్య సంగీతాలు అవన్నీ . ఇంక జంధ్యాల వారి డైలాగులు. ముఖ్యంగా శంకరశాస్త్రి గారి నోట్లో నుంచి వచ్చిన ప్రతీ డైలాగూ పదునుగా ఉంటుంది.

మొదటి వారం జనం లేకుండా ఖాళీగా ఉన్న సినిమా హాళ్ళు వారం తర్వాత జనంతో కిక్కిరిసిపోయాయి . ధనవర్షం , కీర్తి ధార , అవార్డల పరంపర , ప్రశంసల సునామీ . జాతీయ అంతర్జాతీయ అవార్డులు , ప్రశంసలతో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు , దర్శకుడు విశ్వనాథ్ , సాంకేతిక నిపుణులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు .

ఈ సినిమా గురించి ఎంత వ్రాసినా తరగదు , తృప్తి ఉండదు . చూడనివారు ఎవరయినా ఒకరూ అరా ఉంటే యూట్యూబులో ఉంది . వెంటనే చూసేయండి . ఆ రసగంగలో తేలియాడండి .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions