మనిషి స్పూరద్రూపి… అందగాడు… ఆముదాలవలస స్వస్థలం… అచ్చమైన తెలుగు నేపథ్యం… 1973 నుంచీ, అంటే దాదాపు నాలుగైదు దశాబ్దాలు ఇండస్ట్రీలో ఉన్నా, మెరిట్ ఉన్నా సరే, తన మొత్తం సినిమాలు మహా అయితే 200 దాకా ఉంటాయేమో… అవీ హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలన్నీ కలిపి… తెలుగులో 120 వరకూ ఉంటాయి తను పోషించిన పాత్రలు… అంతే… అంటే ఇండస్ట్రీ శరత్ బాబును అలియాస్ సత్యం బాబు అలియాస్ సత్యనారాయణ దీక్షితుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయిందనే అనుకోవాలి… లోపం ఎక్కడుందో తెలియదు…
ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్కాచెల్లెళ్లున్న ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు… తండ్రి ఓ హోటల్ నడిపించేవాడు… కొన్నాళ్లుగా అనారోగ్యంతో పోరాడుతూ, అలిసిపోయి ఈరోజు కన్నుమూశాడు… ఇది శరత్ బాబు మాత్రమే వేయగలడు అనిపించుకున్న పాత్రలేమీ కనిపించవు తన కెరీర్‌లో… అలాగే శరత్ బాబు ఈ పాత్రలు మాత్రమే వేయగలడు అని కూడా అనిపించుకోలేదు… ఓ మైనపుముద్ద… పాత్ర స్వభావాన్ని బట్టి ఏ పాత్రయినా చేయగలడు… కానీ నిజంగా వావ్, శరత్ బాబు ఈ పాత్రను భలే పోషించాడ్రా అని చటుక్కున గుర్తొచ్చే పాత్ర కనిపించదు…
ఒక సీతాకోకచిలుక, ఒక సాగరసంగమం, ఒక అభినందన, ఒక సీత కథ వంటి కొన్ని సినిమాల్లో పాత్రలు గుర్తుచేసుకోవచ్చు… చివరి చిత్రం వకీల్ సాబ్… ఇక తన వ్యక్తిగత జీవితానికి వస్తే… మొదట్లో సినిమా నటి రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు… ఇద్దరూ బిజీ ఆర్టిస్టులే కాబట్టి కాస్త ఆ కుటుంబం మంచిగానే నిలదొక్కుకోవాలి… కానీ ఫెయిలైంది… 14 ఏళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు…
Ads
తరువాత స్నేహలత అనే యువతిని పెళ్లి చేసుకున్నట్టు వార్తలొచ్చాయి… ఆమెతో కూడా చాన్నాళ్లు బంధం నిలవలేదు… 2011లో ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నాడు… అప్పటి నుంచి మరి ఇప్పటివరకు ఏమిటనేది పెద్దగా తెలియదు… మూడో పెళ్లిబంధం కూడా ఉంది… కానీ ఆమె పేరును బయటికి వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు… తనకు ఎందరు పిల్లలు అనేదీ రహస్యమే… రమాప్రభతో తనది కేవలం సహజీవనం మాత్రమే అనీ, పెళ్లి కాదనీ తను వెల్లడించడం చిత్రంగా అనిపించింది… ఆమె కూడా శరత్ బాబు మీద చాలా ఆరోపణలు చేసింది…
Share this Article