ఆమధ్య దసరా సినిమా… ఫుల్లు తాగుడు నింపేశాడు దర్శకుడెవరో గానీ..! తెలంగాణ బొగ్గుగనుల నేపథ్యంలో కథ నడిపించినా సరే తెలంగాణ స్పెసిఫిక్ కల్చర్ పెద్దగా కనిపించలేదు… మాటలు, పాటల్లో కూడా కమర్షియల్ లైనే అగుపించింది… బలగం సినిమాలో కూడా తాగుడుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా సరే… ఒక చావు, కుటుంబసభ్యుల మధ్య సంబంధాల పునరుద్దరణ స్టోరీ లైన్ కాబట్టి, అది పల్లె జనానికి కనెక్టయింది ప్రధానంగా…
తెలంగాణ పల్లెలో అంత్యక్రియలు, పిట్టకు పెట్టుడు, పెద్ద కర్మ ఎట్సెట్రా సరిగ్గా చూపించాడు దర్శకుడు వేణు… మరి తెలంగాణ సంబురానికి వేదిక పెళ్లి కదా… ఆ పెళ్లి తంతును ఎవరైనా తడిమారా..? ఏమో… అప్పట్లో ఫిదా సినిమాలో కొంత చూపించాడు శేఖర్ కమ్ముల, కానీ అంతగా ఇంప్రెసివ్‌గా ఉన్నట్టు అనిపించలేదు… ఆమధ్య విపరీతంగా వైరలైన బుల్లెట్టు బండెక్కి పాట కూడా కొత్తగా పెళ్లయిన ఓ ఆడపిల్ల తన మెట్టింటిపై ఆశల్ని చెబుతుందే తప్ప పెళ్లి తంతునేమీ చూపించదు…
తెలంగాణ కల్చర్ అంటే తాగుడే అన్నట్టుగా చూపించే తీరు మీద చాలా విమర్శలొచ్చినయ్ కూడా… ఎస్, తెలంగాణలో తాగడం సిగ్గుపడే పనేమీ కాదు, అంత సోయితప్పి అందరూ బజార్లలో తాగి తిరగరు… తాగడానికీ ఓ పద్ధతి ఉంది… మర్యాదలుంటయ్… మనసు విప్పి కష్టం సుఖం చెప్పుకునే సందర్భాలవి… ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే… నూతన దర్శకుడు అక్షరకుమార్ (కుమారస్వామి) దర్శకత్వం వహించిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాలోని పన్నెండు గుంజల పాట రిలీజైంది తాజాగా…
Ads
త్రివిక్రమ్ శ్రీనివాస్, మామిడి హరికృష్ణ ఈ సినిమా పోస్టర్ రిలీజప్పుడే కొంత ఆసక్తి కలిగింది… సరే, ఈ పాట చూద్దాం… మరీ ఈమధ్య తెలంగాణ పాట అనగానే ఏదో ఫోక్ సాంగ్ పెట్టేసి ఉంటారులే అనుకుని కాజువల్ లుక్ వేశాక… అది మొత్తం పాటలోకి తీసుకెళ్లింది… సరే, పెద్దింటి అశోక్‌కుమార్‌తో పాట రాయించుకున్నారు అంటే, కంటెంటులో క్వాలిటీ మీద డౌటేమీ లేదు… కానీ ఆ పెళ్లిపాట చిత్రీకరణ అంటే విశిష్టమైన తెలంగాణ పెళ్లి తంతును కాసింతైనా ఉన్నదున్నట్టు చూపించడం ఓ టాస్క్… ఆ టాస్క్‌లో దర్శకుడు అక్షర నెగ్గాడు… పాట నచ్చింది…
సో, పాట బాగానే ఉంది కాబట్టి సినిమా కూడా సరైన దిశలో వెళ్తున్నదనే నమ్మకాన్ని కలిగించింది… సాదాసీదా పెళ్లి చేసుకుందామనే పిల్లగాడు, జీవితకాలం మెమొరీ, ధూంధాం చేసుకుందామనే పిల్ల… నిజమే, జీవితకాలం మెమొరీ కదా పెళ్లంటే… పాటకు ముందు వచ్చే సీన్‌లో పిల్ల (భూమి శెట్టి) డిక్షన్ పర్‌ఫెక్టుగా తెలంగాణ యాసలో ఉంది… మంచిగుంది… (నీకేం తెల్వదు ఊకో),.. పన్నెండు గుంజల పందిర్లా కింద అని పాడుకునే ఆ పాటకు కొత్త సింగర్స్‌ను ఎంచుకోవడం కరెక్టు…
పచ్చాని పందిట్ల ముత్యాల పోలు.., పాలాపొరుక తీసుడే.., కుండలు దీసి, ముగ్గులు పూసి, ఐరేండ్లను జేసుడే… ఒడిబియ్యం పోసుడే… సన్నబియ్యం సాలుపోసి జోడు పీటలేసుడే… మైలాపోలు తీసుడే… చెక్కరి కుడుకలు పోసుడే… పోలు వోసిన… ఏడవకు ఏడవకే నా ముద్దు బిడ్డా, నవ్వుతూ దాటాలె పుట్టింటి గడ్డ… వంటి వాక్యాలతో పెద్దింటి అశోక్ మస్తు రాసిండు… పక్కా తెలంగాణ పెళ్లితంతు… ఆడపిల్లంటే పుట్టింటి చుట్టం అనే ప్రయోగం బాగుంది… (సందడి, పారాణి వంటి కొన్ని మెరిగలు అక్కడక్కడా తగిలినా సరే) పందిరి గుంజల కాన్నుంచి రిసెప్షన్, డీజే బరాత్ దాకా తెలంగాణ ప్రజెంట్ పెళ్లి తంతును సింపుల్‌గా తేల్చేశాడు అక్షర…
ఇదే పాటలో ఓచోట గోడకు వేలాడదీసిన ఫోటో, అందులో ఓ పెద్దాయన, కన్నీళ్లు పెట్టుకునే మహిళ… ఆ చిన్న బిట్ కూడా బాగుంది… (కారణం కథలో ఉందేమో…) తెలంగాణ సినిమా అంటే తాగుడు కాదు… తాగి వాగుడు అసలే కాదు… తెలంగాణ సంబురాన్ని, కన్నీళ్లను, బంధాల్ని, కల్చర్‌ను చూపించడం… బాగుంది… ఐతే సినిమా అంతా ఇలాగే ఎఫెక్టివ్‌గా వచ్చిందా..? ఏమో… షరతులు వర్తిస్తాయేమో…!! లేదా… బలగంలాగే ప్రశంసలూ వర్షిస్తాయేమో…!!
Share this Article