Sai Vamshi …. సామాన్యుల జోలికి రావాలంటే ‘షరతులు వర్తిస్తాయి’
నాకు World Cinema పెద్దగా తెలియదు. నాకు Indian Cinemaనే వరల్డ్ సినిమా. ఇక్కడి సినిమాల నుంచే నేను ప్రపంచ సినిమాను అర్థం చేసుకున్నాను. ఇక్కడ సినిమాలతో ప్రపంచ సినిమాను కంపేర్ చేస్తూ కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉన్నాను. ఆ క్రమంలో Realistic Cinema అనేది ఒకటుందన్న విషయం అర్థమైంది.
Realistic Film అంటూ ఏడుపులు, కన్నీళ్లు, కష్టాలు మాత్రమే చూపిస్తే వెంటనే ఆ సినిమా స్కిప్ చేసేస్తాను. కథ ఉండాలి. అది సవ్యంగా నడవాలి. ఆసక్తి కలిగించాలి. కొంచెం ఆలోచన కలిగించాలి. అదే నా దృష్టిలో రియలిస్టిక్ సినిమా. తెలుగులో బి.నరసింగరావు గారు మేలైన రియలిస్టిక్ సినిమాలు తీశారు. దాసరి నారాయణరావు గారి ‘శివరంజని’, ‘కంటే కూతుర్నే కను’ లాంటి సినిమాలు కూడా రియలిస్టిక్ సినిమాలే అనిపిస్తాయి.
కన్నడలో పి.శేషాద్రి అనే దర్శకుడు ఉన్నారు. ‘మున్నుడి’, ‘బెరు’, ‘బెట్టదజీవ’, ‘భారత్ స్టోర్స్’ లాంటి రియాలిస్టిక్ సినిమాలను ఆసక్తికరంగా తీశారు. తెలుగులో అలాంటి ఒరవడి ఎప్పుడూ ఉంది. అయితే భారీ నదీ ప్రవాహంలో అది సన్నటి పాయలా సాగూతూ ఉంటుంది. మనం కనిపెట్టి, ఒడిసి పట్టుకోవాలి.
‘షరతులు వర్తిస్తాయి’ సినిమా టైటిల్ నుంచే రియాలిస్టిక్ గుబాళింపుతో నిండి ఉంది. కథ చెప్పాలా? ఒక కుటుంబం. కొన్ని ఆశలు. కొంత డబ్బు. బరువైన మోసం. దాన్ని ఛేదించే ప్రయత్నం. అందులో సాధకబాధకాలు. ఇదే మూలాంశం. దాని చుట్టూ ఓ అందమైన కథ అల్లుకుంది. హీరో చిరంజీవి, హీరోయిన్ విజయశాంతి. నిజంగా వాళ్లు కాదు. వాళ్ల పేర్లున్న ఓ జంట. ఈ కథకు వాళ్లే హీరోలు.
ఈ సినిమాను కొబ్బరికాయ దశ నుంచి గుమ్మడికాయ దశ వరకూ దూరం నుంచి గమనిస్తూ ఉన్నాను. పేరు & కథ.. రెండూ నన్ను ఆకర్షించాయి. అది సినిమాగా మారి తెరపైకి చేరి రెండు గంటలపాటు అలరించింది. మనకున్న నవరసాల్లో మొదటిది శృంగారం, రెండోది హాస్యం. ఏ సినిమాలోనైనా ఈ రెండు మోతాదుకు మించి పెరిగినా, తగ్గినా నాకేదో తేడాగా అనిపిస్తుంది. ‘షరతులు వర్తిస్తాయి’కి ఆ ఇబ్బంది లేదు. ప్రేమికుల మధ్య చిలిపిదనం, భార్యాభర్తల నడుమ సహవాస రాగం సరిగ్గా కుదిరాయి. హాస్యం ఉన్నంతమేరకు బాగున్నా, ఇంకా ఉండొచ్చు అనిపించింది. సంగీతం సందర్భానుసారం హాయిగా సాగిపోయింది. పెండ్లి పాట ఎంత బాగుందో!
చిరంజీవిగా చైతన్య, విజయశాంతిగా భూమిశెట్టి భలేగా కుదిరారు. నిజంగా ఆలుమగలు అనిపించేంతగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు.
అన్నీ బాగున్నాయి! మరి నచ్చనిదేమిటి? నిడివి. అఫ్‌కోర్స్. నిడివి నిర్ణయం పూర్తిగా దర్శకుడి స్వేచ్ఛ. కానీ మొదటిభాగంతో పోలిస్తే రెండో భాగం కొంత సాగతీతగా మారిందేమో అనిపించింది. మొదటి భాగంలో చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధించిన యాడ్ సీన్ వస్తున్న కొద్దీ ‘హేయ్! ఇంతసేపుందేంటి ఈ ఎపిసోడ్? ఇదేమైనా యాడ్ ఫిల్మా?’ అని అనిపించింది. నా సహనానికి కాస్త ఎక్కువ పరీక్ష పెట్టిన ఎపిసోడ్ అది. బాగాలేదని కాదు, కానీ అంతసేపు అవసరం లేదని!
ఎన్నికల ఎపిసోడ్ కూడా మరికొంత కత్తిరించాల్సి ఉండిందని అనిపించింది. ఒక రూంలో నిలబడి, కంప్యూటర్లు అవీ పెట్టి హీరో చేసిన హడావిడి చూసి చాలా పెద్ద ప్లాన్ ఏదో వేస్తాడని అనిపించింది. చివర్లో అది చిన్న వీడియోతో లింక్ చేసేసరికి, హీరో చుట్టూ చూపించిన హడావిడి అవసరమా అనిపించింది.
ఈ రెండు అంశాలను మినహాయిస్తే, మిగిలిన కథంతా ఆసక్తికరంగా సాగిపోయింది. పేరుకు తగ్గట్టే సామాన్యులను మోసం చేయాలని చూస్తే కొన్ని షరతులు వర్తిస్తాయని, మధ్యతరగతి వారు తిరగబడితే ఫలితాలు బలంగా ఉంటాయని చెప్పింది. చక్కటి చిత్రం తీసిన దర్శకుడు అక్షరకుమార్ అన్నకు మరిన్ని మంచి సినిమాల నిండైన మేల్తలపులు … సినిమా ‘ఆహా’ యాప్‌లో అందుబాటులో ఉంది…. – విశీ
Share this Article
Ads