మేం క్రిస్టియన్లమే అని ఘంటాపథంగా మరోసారి ప్రకటించిన షర్మిల తన కొడుకు పెళ్లి తంతు మీద క్రైస్తవ సమాజానికి పెద్ద వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్న వీడియో ఒకటి బాగా సర్క్యులేట్ అవుతోంది… తను పాటించింది హైందవ వివాహ తంతు కాదని చెప్పడానికి నానారకాలుగా ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది… బహుశా ఆ వీడియో నిజమే అని నమ్ముదాం… ఇంతకీ ఆమె ఏమంటోంది..?
‘‘పసుపు యాంటీ సెప్టిక్, వంటలో కూడా వాడతాం,.. ఇది హిందూ పద్ధతి ఎలా అవుతుంది..? సంగీత్ కూడా నిర్వహించాం, డాన్స్ కూడా చేశాను… పెద్ద ఫన్… వెడ్డింగ్ పాస్టర్ చేశారు… పసుపు, కాషాయం బీజేపీ రంగులు కావు, రంగుల్ని సృష్టించింది మన దేవుడు… నా కొడుకు కోడలు తలంబ్రాలు పోసుకున్నారు కానీ అవి బియ్యం కావు… మంత్రం లేదు, పురోహితుడు లేడు… మెడలో దండ వేస్తాం, అందులో క్రాస్ ఉంటుంది… అంతే, మా అమ్మకూ అదే, నాకూ అదే… చెంబులో ఉంగరం అనేది ఓ ఫన్… మాపై ట్రోలింగ్ సరికాదు… దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడ ఉంది..? మేం దేవుడి బిడ్డలం, మేం క్రైస్తవులం…’’
Ads
ఆమె వివరణ సారాంశం ఇదే… ఇక్కడ కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయి సిస్టర్… 1) సంగీత్, బరాత్, నిశ్చితార్థం, తలంబ్రాలు, పుస్తెలు, బిందెలో ఉంగరం, బంతాట… ఇవన్నీ హైందవ వివాహ పద్ధతిలోనివే… హైందవం ఇవన్నీ చేయాలని ఏమీ చెప్పదు, హిందువుల్లోనే అనేక రకాల పెళ్లి తంతులు ఉంటాయి… కానీ పైన చెప్పినవన్నీ మీరు పాటించారు… ఇప్పుడేమో అది హిందూ పద్ధతి కాదు అనేస్తే ఎలా..? క్రైస్తవులైనా సరే, ఈ తంతు మొత్తం పాటించవచ్చు, హిందూ సమాజం దాన్నేమీ వ్యతిరేకించదు… మరి మీరెందుకు ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చుకుంటున్నట్టు..?
2) వోకే, ఇది హిందూ పద్దతి కాదు అని ప్రజలకు చెప్పడమే ఉద్దేశమైతే… మరి అచ్చం హిందూ పద్ధతిలాగా కనిపించేలా ఈ భారీ పెళ్లి తంతు జరిపించడం దేనికి..? ప్రజాజీవితంలో ఉన్నందుకా..? మేం హిందువులమే అని నమ్మించడానికా..? మరి అదే నిజమైతే మళ్లీ ఈ వివరణలన్నీ దేనికి..? జగన్ పంచాంగ శ్రవణాలకు, ప్రియాంక గంగాస్నానాలకు, రాహుల్ జంధ్య ధారణకు మీకూ తేడా ఏమున్నట్టు..?
3) పసుపు, కాషాయం రంగుల మీద బీజేపీని ఆక్షేపించడం దేనికి..? వాటి మీద పేటెంట్ రైట్స్ ఉన్నాయని బీజేపీ చెప్పిందా ఎప్పుడైనా..? అవి హిందువులవి కూడా సొంతం కావు… అవి ప్రపంచంలోని అందరివీ… మరి బీజేపీకి ఎందుకు ఆపాదిస్తున్నట్టు..? (గులాబీ రంగు మీద బీఆర్ఎస్‌కు, నీలం మీద బీఎస్పీకి, హరితం మీద మజ్లిస్‌కు, పచ్చరంగు మీద టీడీపీకి, ఎరుపు మీద లెఫ్ట్‌కు కూడా పేటెంట్స్ ఉండవు… రంగులకు పార్టీలు ఏమిటసలు..?)
4) తలంబ్రాల్లో బియ్యం వాడలేదు కాబట్టి అవి తలంబ్రాలు కావంటున్నారు కదా, మరి ఆ తలంబ్రాల తంతు, చెంబులో ఉంగరం, బంతాట ఎందుకు నిర్వహించినట్టు..? హిందూ పద్ధతైనా సరే, క్రైస్తవ పద్ధతైనా సరే, స్ట్రెయిట్‌గా, సిన్సియర్‌గా ఎందుకు పాటించకూడదు..? పూర్తి క్రైస్తవ పద్ధతిలో వివాహతంతు నిర్వహించినా సరే హిందూ సమాజం నిండుగా ఆశీర్వదిస్తుంది కదా… ఇలా మిక్స్ చేయడం దేనికి..?
5) మంత్రం లేదు, పురోహితుడు లేడు, పసుపు బియ్యం లేవు… సరే, మీరు హిందూ పద్ధతిని పాటించలేదు, సరే… హిందువుల్లోనే వందల రకాల పెళ్లి పద్ధతులు ఉంటాయి… ఒక్క కులంలోనే ప్రాంతాలను బట్టి వేర్వేరు పద్దతులు, ఆచారాలు ఉంటాయి… మరి ఈ పద్ధతిలోనే ఇలాగే పెళ్లి తంతు ఉండాలని ఎవరు చెప్పారు మీకు..? పోనీ, అచ్చం హిాందూ పద్ధతిలాగే కనిపించేలా జరిపించిన పెళ్లి తంతు వెనుక మీ ఆలోచనలు ఏమిటి..? హైందవంలా కనిపించాలి, కానీ హైందవం కాకూడదు… అంతేనా..?
6) హైందవ వివాహ పద్ధతిని అనుకరించడం వల్ల సాటి క్రైస్తవుల్లో సందేహాలు ఏర్పడతాయని, బ్రదర్ అనిల్ కుమార్ మతబోధలకు ప్రామాణికత ప్రశ్నార్థకం అవుతుందని అనుకున్నారా..? అందుకేనా… మేం క్రైస్తవులమే, మా గుండెలు చీల్చినా ఇదే కనిపిస్తుందనే సంజాయిషీ, స్పష్టత ఇచ్చింది… మరి ఇలా చెప్పుకోవాల్సి వస్తుందని అనుకున్నప్పుడు ఇదే తంతును ఎందుకు పాటించినట్టు..? నిజానికి పెళ్లి ఎలా చేసుకోవాలనేది మీ కుటుంబాల ఇష్టం… వాళ్ల పెళ్లి జరిగినట్టు సమాజానికి ప్రకటించడమే దాని ఉద్దేశం… దాన్ని ఎవరూ అభ్యంతరపెట్టరు, వ్యతిరేకించరు… ఆశీర్వదిస్తారు… ఎటొచ్చీ, ఎవరైనా ఏదో అనుకుంటారేమో అనుకుని ఇంత పెద్ద వివరణ ఇవ్వడమే అనవసరం… ఎంచక్కా క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపించేసి, అందరినీ పిలిచి గ్రాండ్‌గా రిసెప్షన్ ఇస్తే సరిపోయేది…
ఏమిటో, ఆమె రాజకీయ ప్రయాణంలాగే ఇది కూడా… అస్పష్టం, సంక్లిష్టం, ఆమెకే అంతుబట్టని గందరగోళం..!! తెలంగాణ బిడ్డను అంటివి, తిరిగితివి, ఫాయిదా లేకపాయె, తెలంగాణ నిన్ను తన బిడ్డగా యాక్సెప్ట్ చేయలేదు, ఏపీకి జంప్… ఇప్పుడక్కడ ఏపీ బిడ్డవు… ఏ కాంగ్రెస్ మీ కుటుంబాన్ని టార్గెట్ చేసిందో అదే పార్టీలో చేరితివి… సొంత అన్ననే టార్గెట్ చేస్తుంటివి… మీ ఆస్తుల గొడవను తెలుగు రాజకీయాలకు రుద్దడం దేనికి అనేదే అసలు ప్రశ్న…!!
Share this Article