నిలువలేని కారుకు విలువ లేదు!
——————–
నటుడు సల్మాన్ ఖాన్ కు దేవుడిచ్చిన చెల్లెలుంది. ఆ అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. ఆ అమ్మాయి ఈమధ్య బాంబేలో ఒక డూప్లెక్స్ అపార్ట్ మెంట్ కొన్నది. ఒకరకంగా సల్మాన్ కుటుంబం డెవెలప్ మెంట్ కు ఇచ్చిన నిర్మాణమది. అందులో తన చెల్లికి సల్మాన్ రెండంతస్థులను కలుపుతూ ఒక డూప్లెక్స్ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లున్నాడు. ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కు స్టాంప్ డ్యూటీనే కోటీ ఇరవై ఒక్క లక్షల రూపాయలు చెల్లించారు. అంటే రిజిస్ట్రేషన్ విలువ రెండు వందల కోట్లు. మార్కెట్ విలువ బహుశా మూడు వందల కోట్లు. బాంబేలో మూడు, నాలుగు వందల కోట్లు పెట్టి నాలుగయిదు వేల చదరపు అడుగుల అపార్ట్ మెంట్ కొనడం ఇప్పుడు పెద్ద వార్తే కాదు. సాధారణంగా ఇలాంటి అపార్ట్ మెంట్లకు నాలుగయిదు కార్ పార్కింగులుంటాయి. సల్మాన్ చెల్లెలు మాత్రం ముప్పయ్ కార్ పార్కింగులతో ఈ అపార్ట్ మెంట్ కొనడంతో పెద్ద వార్త అయ్యింది.
——————–
Ads
కొన్ని దేశాల్లో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి, పార్కింగ్ లేకుండా కార్లు కొనడాన్ని నిరుత్సాహపరచడానికి ప్రత్యేక చట్టాలున్నాయి. అప్పటికే కారు కొన్నవారు రెండో కారు కొంటే లైఫ్ ట్యాక్స్ నిష్పత్తి పెరుగుతుంది. మూడో కారుకు ఇంకా పెరుగుతుంది. నాలుగో కారుకు దాదాపు కారు ధరతో సమానంగా లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. భారత దేశంలో రెండో కారుకు నామమాత్రంగా లైఫ్ ట్యాక్స్ ను పెంచారు. పార్కింగ్ కు మాత్రం మన దగ్గర శాస్త్రీయమయిన, వాస్తవికమయిన అంచనా లేదు. పట్టణాలు, నగరాల్లో పార్కింగ్ స్థలం లేకపోయినా కార్లు కొని మునిసిపల్, కార్పొరేషన్ పబ్లిక్ రోడ్ల మీద హాయిగా పార్క్ చేసుకుంటున్నారు. ఎవరూ ఏనాడూ నడవని, నడవలేని, నడిస్తే ఎముకలు విరిగే ఫుట్ పాత్ లకు సగం రోడ్డు పోతుంది. కార్లు, బైకులు కొట్టుకోవడానికి చైనాగోడకంటే ఎత్తయిన డివైడర్లకు కొంత రోడ్డు పోగా- పావు వంతు రోడ్డు మిగిలి ఉంటుంది. ఆ పావు భాగం రోడ్డు మీద నెలకోసారి కవర్ తీసి వాడే కార్లు, లేదా రోజూ వాడే కార్లు పార్క్ చేసి పెడతారు. వీటిమధ్య కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్- అన్నట్లు సకల ప్రపంచం రాకపోకలు చేయాలి. ఏళ్ల తరబడి పబ్లిక్ రోడ్లను పార్కింగ్ లుగా వాడుకుంటుంటే పోలీసులు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఏమి చేస్తున్నాయన్నది అడగకూడని ప్రశ్న. భారత దేశంలో కూడా పార్కింగ్ స్థలం డాక్యుమెంట్ చూపకపోతే కార్లు రిజిస్ట్రేషన్ చేయని చట్టం రావాలేమో?
——————–
సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ. పేరు అనవసరం. హైదరాబాద్ లో ఒక కాలనీ. నాలుగు చిన్న చిన్న వీధులు. ఇళ్లన్నీ షాపులయ్యాయి. పార్కింగుల్లేని షాపులు. కింది ఫ్లోర్ అద్దెకిచ్చున్నారు. పైన ఓనర్ ఉంటాడు. రోడ్డంతా కార్లే. ఈలోపు వీధి చివర ఒక సూపర్ మార్కెట్ వెలిసింది. దాని పక్కనే ఒక కార్పరేట్ ఆసుపత్రి శాఖ మొలిచింది. వీటి వల్ల వచ్చిన వైరాగ్య ద్రవం పుచ్చుకోవడానికి పక్కనే ఒక బార్ తాగుతూ వచ్చింది. రోడ్డు మీద హక్కుగా ఎప్పుడూ పెట్టే తోపుడు బండ్లు, అన్నిటికీ మించి హక్కుగా పార్కింగ్ చేసి వదిలేసిన త్రేతాయుగం నాటి కదలని కార్లు ఉండనే ఉన్నాయి. సూపర్ మార్కెట్ కు వచ్చినవారు ఆసుపత్రి పాలవుతున్నారో? ఆసుపత్రి బెడ్ మీది నుండి టైమ్ పాస్ కు సూపర్ మార్కెట్ కు వెళుతున్నారో? చివరికి ట్రాఫిక్ అయోమయంలో బార్లో కూర్చుని ద్రవ సెలయిన్ చుక్కలు చుక్కలుగా ఎక్కించుకుంటున్నారో? కాలనీవారికి అంతుపట్టడం లేదు. పైగా లివర్ చెడగొట్టే బార్- చెడిపోయిన లివర్ ను బాగుచేసే ఆసుపత్రి ఒకేసారి ఏర్పాటు కావడం మీద కాలనీకి ఎన్నో అనుమానాలున్నాయి. మ్యూచువల్ అండర్ స్టాండింగ్, క్విడ్ ప్రో కో నీకిది నాకది లాంటివి ఉన్నాయన్న కాలనీ అనుమానం అక్షరాలా నిజమయ్యింది కూడా. ప్రతి సాయంత్రం రెండు చేతుల్లో సరుకుల సంచులతో మధ్య తరగతి, చేతికి ఇంట్రా వీనస్ సిరంజి సూది ఆసుపత్రి బ్యాండ్ తో రోగుల తరగతి, తాగి ఎటు వెళ్లాలో తెలియక- ఎటూ వెళ్లలేక రోడ్డు మధ్యలోనే ఆగిపోయే తాగుబోతుల తరగతితో , వీరందరి వాహనాలతో కాలనీకి వచ్చిన కొత్త శోభ రాస్తే వింత రామాయణం.
——————–
అసలే బాంబే. ఇలాంటి పార్కింగ్ సమస్యలు తన ఇంటికి, తన ఇంటికొచ్చేవారికి ఉండకూడదని సల్మాన్ చెల్లెలు ముప్పయ్ కారు పార్కింగులు కొన్నట్లుంది. కొందరయినా ఇలా పార్కింగులను సెన్సిటివ్ గా ఆలోచిస్తే మంచిది. లేకపోతే రోడ్లు ఉంటాయి. కానీ- ప్రయోజనం ఉండదు. మన పొరుగున కర్ణాటక రాజధాని బెంగళూరు ఐ టీ నగరంగా మారినప్పటినుండి ట్రాఫిక్ విషయంలో నరకంగా మారిపోయింది. రోడ్డుకు ఒక వైపు ద్వి చక్ర వాహనాలు, మరో వైపు కార్లు పార్క్ చేయాలన్న నిబంధనను అక్కడ దశాబ్దాలుగా పాటిస్తున్నారు. అయినా కార్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో రోడ్డు మీద ఎవరి ఇంటి ముందు వారు కార్ పార్క్ చేసుకున్నా నెలకు వెయ్యి నుండి అయిదు వేల రూపాయలు వసూలు చేసేలా కర్ణాటక ప్రభుత్వం కొత్త విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతోంది. మన ఇల్లే మనది. మన ఇంటి ముందు రోడ్డు మనం కొన్నది కాదు. మన ఆస్తి కాదు. అది మనకు కేవలం దారి. అది అందరిది. పార్కింగ్ నిలువనీడ లేని కారుకు విలువ లేదు…….. By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article