ద్రౌపది పాత్రలో నటి రౌద్రావతారం!
చావుదప్పి బతికి బయటపడ్డ విలన్!
——————-
బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్యహరిశ్చంద్ర నాటక రచయితగా జగత్ ప్రసిద్ధుడు. ఆ నాటకం ప్రదర్శించని ఊరు తెలుగు నేల మీద బహుశా ఉండదు.
“భక్తయోగ పదన్యాసి వారణాసి…”
“తిరమై సంపదలెల్ల..” పద్యాలు అందులోనివే. నాటకాన్ని సినిమా మింగనంతవరకు, మూడు యుగాలు గడచినా పూర్తి కాని సీరియళ్లతో టీ వీ లు వేయి తలలుగా విస్తరించనంతవరకు నాటకం పద్యాలు వినేవారు ఉండేవారు. డి వి సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వర రావు లాంటి మేరునగధీరులయిన నటులు స్టేజ్ మీద నాటకంలో పద్యానికి ప్రాణం పోశారు. తెలుగు పద్యనాటకానికి అజరామరమయిన కీర్తి కిరీటం పెట్టారు. పద్యం కంటే… పద్యం చివర వారు తీసిన అనంతమయిన రాగానికి ఒన్స్ మోర్లు, ఈలలు, కేకలు, మెడలో నోట్ల దండలు, పూల దండలు. చప్పట్లే చప్పట్లు. స్టూడియోల్లో యాంత్రికంగా ఎకోలు, కోరస్ లు పెంచడం తెలియని రోజుల్లో నటుడు నాటకంలో పద్యం గొంతెత్తి పాడితే మైక్ లేకపోయినా ఊరు ఊరంతా వినగలిగేది. అదొక స్వర్ణ యుగం.
చెల్లియో చెల్లకో…
బావా ఎప్పుడు వచ్చితివి?
యేనుంగునెక్కి…
ధారుణి రాజ్యసంపద…
జెండాపై కపిరాజు…
లాంటి పద్యాలు కేవలం నాటకాలవల్లే జనం నోళ్లల్లో శతాబ్దాలపాటు బతికాయి. చదువురాని సామాన్యుల్లో కూడా ఈ పద్యాలు పట్టుచీర కట్టుకుని సగర్వంగా నిలబడ్డాయి. రకరకాల కారణాలవల్ల తెలుగునాటకం ఒకానొక అమావాస్య అర్ధరాత్రి స్టేజీ తెరకే ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది. అది ఆత్మహత్య కాదు- అక్షరాలా హత్య అని ఇప్పటికీ నాటక ప్రియుల బలమయిన నమ్మకం. ఏమయినా తెలుగు నాటకానికి శాశ్వతంగా తెర పడింది. ఇక ఆ తెర లేవదు.
Ads
స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన ఒక యథార్థ సంఘటన. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్య హరిశ్చన్ద్ర నాటకం చిత్తూరు ప్రాంతంలో ప్రదర్శిస్తున్నారు. హరిశ్చంద్రుడిని అడుగడుగునా పట్టి పీడించే నక్షత్రకుడి పాత్రలో స్వయంగా బలిజేపల్లి వారే నటిస్తున్నాడు. కాశీలో చేతిలో చిల్లిగవ్వలేని హరిశ్చన్ద్రుడు చివరికి భార్యను కూడా దాసిగా కొనుక్కోమని వేలం పాట పాడతాడు. అయినా అప్పు తీరక శ్మశానంలో కాటి కాపరి ఉద్యోగానికి ఒప్పుకుంటాడు. సర్వంసహా చక్రవర్తి ఇలా పాడెల మీద కట్టెలు పేరుస్తూ, మంటకు పైకి లేచే దేహాలను కర్రలతో కొడుతూ ఉన్నా నక్షత్రకుడు మాత్రం హరిశ్చన్ద్రుడిని విసిగించడం మానడు. ముందువరుసలో కూర్చున్న రసజ్ఞుడయిన ఒక అధికారి నాటకంలో లీనమై కోపం పట్టలేక నక్షత్రుకుడి వేషంలో ఉన్న బలిజేపల్లి మీదికి ఉరికి వెళ్లి, కాలిలో చెప్పు తీసి… ఒరేయ్ ఎంత దుర్మార్గుడివిరా నువ్వు? అంతటి హరిశ్చద్రుడిని ఇంతగా హింసిస్తావా? అవమానిస్తావా? అని ఆయనమీదికి చెప్పు విసిరాడు. ఈలోపు ప్రేక్షకుల్లో కలకలం. నాటకం ఆగిపోయింది. ఒక్క క్షణంలో ఆ అధికారి తేరుకుని, బలిజేపల్లిని క్షమించమని వేడుకున్నాడు. బలిజేపల్లి నవ్వుకున్నాడు. తన నటనకు తానే పొంగిపోయాడు. చెప్పు దెబ్బలు గొప్ప గౌరవంగా భావించాడు. ఇంకో చెప్పు కూడా కలిపి హారంగా మెడలో వేయించుకున్నాడు. ఆరోజునుండి బలిజేపల్లి పేరు ముందు “పాదరక్షక బిరుదాంకిత” అయ్యింది. బలిజేపల్లి రచయిత, నటుడు, గాయకుడు, ప్రయోక్త, తెలుగునేల నలుచెరగులా తిరిగి హరిశ్చంద్రుడిని మనలో ఒకడిగా చేసినవాడు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవికి పాదరక్షక బిరుదు వచ్చిన ఈ సంఘటనను మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు రాయలసీమలో కథలు కథలుగా చెప్పుకునేవారు.
——————-
మనదగ్గర సురభి లాంటి నాటకాలకు కూడా దిగ్విజయంగా తలదీపం పెట్టి నువ్వులు నీళ్లు వదిలాం కానీ- మరాఠీ, కన్నడలో ఇప్పటికీ నాటకం బతికి ఉంది. నాటక సమాజాలున్నాయి. ఓటీటీ వీర విజృంభణ రోజుల్లో కూడా అక్కడ నాటకాలు వేసేవారున్నారు. చూసేవారున్నారు. ఈమధ్య కర్ణాటకలో ఒక నాటకంలో ద్రౌపది పాత్రలో ఉన్న నటి సన్నివేశంలో లీనమై నిజంగానే విలన్ను కింద పడేసి, శూలంతో పొడవబోయింది. ఏదో తేడాగా ఉండడంతో విలన్ హాహాకారాలు చేశాడు. ఈలోపు పక్కనున్నవారు ఆమెను శాంతింపజేసి, విలన్ కు చావు తప్పించారు. పాత్రలో లీనమైపోయాను. ఎవరో పరుగెత్తుకుకువచ్చి తనను పట్టుకుని ఆపకపోతే నాటకం స్టేజి మీద స్క్రిప్ట్ లో లేని హత్య జరిగేది- అని ఆ నటి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. నాటకంలో నటించేవారు కొందరు. జీవించేవారు కొందరు. ఈ డిజిటల్ యుగంలో కూడా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రకు ప్రాణం పోసే గొప్ప నటులున్నందుకు నిజంగా నాటకం పొంగిపోవాలి………….. By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article