ద్రౌపది ముర్ము… ఆమె రాష్ట్రపతి అభ్యర్థి కాగానే రకరకాల పెదవివిరుపులు… ఏకైక కారణం ఆమె బీజేపీ నాయకురాలు కావడం… యాంటీ- బీజేపీ పార్టీలు, నాయకులందరూ పనిగట్టుకుని ఓ రబ్బరు స్టాంపు, ఆమెకు ఏం తెలుసు, ఓ విగ్రహం మాత్రమే వంటి విమర్శలకు దిగారు… ఆమె బీజేపీ కాబట్టి వ్యతిరేకించాలి… అంతే… అదొక్కటే సూత్రం… అలాంటివాళ్లు సపోర్ట్ చేసిన యశ్వంత్ సిన్హా తన జీవితకాలం మొత్తం బీజేపీ నాయకుడిగానే ఉన్నాడని మరిచిపోయారు…
నిజానికి ఆమె రబ్బరు స్టాంపా..? ఏమీ తెలియదా..? ఒక కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమె రాష్ట్రపతి వరకు రావడం వెనుక మెరిట్ ఏమీలేదా..? తన పాతికేళ్ల రాజకీయ జీవితానికి, చేపట్టిన పదవులకు విలువే లేదా..? ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పైసా అవినీతి ఆరోపణల్లేవు… అట్టహాసాలు, ఆడంబరాలు, డాంబికాలు, దర్పాలు లేవు… సింపుల్ జీవితం…
నిజంగా ఆమె రబ్బర్ స్టాంపేనా…? కాదు…! 2017 నాటి ఓ మంచి ఉదాహరణ చెప్పుకోవాలి… ఆమె బీజేపీ, జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉండేది… రఘువరదాస్ ముఖ్యమంత్రి… ఆదివాసీ భూములకు సంబంధించి బ్రిటిష్ హయాంలో తీసుకురాబడిన చోటానాగపూర్ కౌలుదారీచట్టం, సంతాల్ పరగణా కౌలుదారీచట్టంలోని కొన్ని నిబంధనలను సవరించాలని అసెంబ్లీ తీర్మానించింది… ఆమోదం కోసం తన వద్దకు వచ్చిన ఆ ఫైలును ద్రౌపది ముర్ము సంతకం చేయకుండా వెనక్కి పంపించేసింది…
Ads
ఈ సవరణలతో ఆదివాసీలకు ప్రయోజనం ఏమిటి అనడిగింది ఆమె… 200 అభ్యంతరాలు వచ్చిన బిల్లుపై సరైన స్పష్టత ఇవ్వకపోలే ఎలా అని ప్రశ్నించింది… సొంత గవర్నర్ అయి ఉండీ ఇలా కొర్రీ వేయడం ఏమిటంటూ ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ఆమె తన వైఖరికే కట్టుబడి ఉంది…
రఘువరదాస్ సీఎంగా ఉన్నప్పుడే పాతాళగడి వివాదం తలెత్తితే… ద్రౌపది ముర్ము స్వయంగా కొందరు ఆదివాసీ పెద్దలను రాజభవన్‌కు పిలిపించి, సమస్య పరిష్కారానికి ప్రయత్నించింది… 2019లో రఘువరదాస్ ప్రభుత్వం కూలిపోయి హేమంత్ సోరెన్ సీఎం అయ్యాడు… తరువాత కొంతకాలానికి ట్రైబల్ కన్సల్వేటివ్ కమిటీ ఏర్పాటు సవరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించింది సోరెన్ ప్రభుత్వం… ఆ కమిటీ ఏర్పాటులో గవర్నర్ పాత్ర ఏమీ ఉండదని తెలిసి, సంతకం చేయకుండా వాపస్ పంపించింది ఆమె…
Share this Article